కామెడీ.. బీజేపీకి డబుల్ డిజిట్ అట.?

ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలతోనే పండగ చేసేసుకుంటోంది భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి ఏంటన్నది అందరికీ తెల్సిన విషయమే. 2014 ఎన్నికల్లో బీజేపీ - టీడీపీ కలిసి పోటీ చేయడంతో ఐదు అసెంబ్లీ, ఓ లోక్‌సభ సీటు బీజేపీకి దక్కాయి. టీడీపీ ఓటు బ్యాంకు బీజేపీకి, బీజేపీ ఓటు బ్యాంకు టీడీపీకి అప్పట్లో కలిసొచ్చింది. మరి, ఈసారి ఏమవుతుంది.? అంటే, ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్ని బట్టి, బీజేపీకి మెరుగైన ఫలితాలే రావొచ్చని తేలింది.

మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌.. బీజేపీ, తన ఓటు బ్యాంకుని పెంచుకుంటుందనీ, సీట్ల సంఖ్య కూడా కాస్తో కూస్తో పెరిగే అవకాశముందని తేల్చడంతో, బీజేపీ నేతల ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. 'మేం మొత్తం అన్నిచోట్లా పోటీచేశాం.. ముందు ముందు రాజకీయంగా బలోపేతమయ్యేందుకు ఇది తొలి అడుగు.

ఖచ్చితంగా డబుల్‌ డిజిట్‌ సాధిస్తాం.. హంగ్‌ పరిస్థితులు కన్పిస్తున్నాయి.. హంగ్‌ ఏర్పడితే, మా సీట్లే కీలకం కాబోతున్నాయి..' అని బీజేపీ నేతలు చెబుతుండడం గమనార్హమిక్కడ. అయితే, ఒకట్రెండు సర్వేలు బీజేపీకి ప్రస్తుతం వున్న 5 సీట్ల కంటే తక్కువగా రావొచ్చని చెబుతున్నాయి.

ఆ సర్వేల్ని మాత్రం బీజేపీ పరిగణనలోకి తీసుకోవడంలేదు. అన్నిచోట్లా పోటీచేసే శక్తి సంపాదించుకున్నాం.. ఇది, తెలంగాణలో బీజేపీ ఘనమైన భవిష్యత్తుకు తొలిమెట్టు.. అని కాన్ఫిడెంట్‌గా బీజేపీ నేతలు చెబుతున్నారు. నిజానికి, బీజేపీ లక్ష్యం సార్వత్రిక ఎన్నికలు.

2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఒకటికి మించి ఎన్ని సీట్లు సాధించినా అది ఆ పార్టీకి జాతీయ స్థాయిలో అదనపు అడ్వాంటేజ్‌ అవుతుందన్నది నిర్వివాదాంశం. టీఆర్‌ఎస్‌, మహాకూటమి ఫైట్‌లో రాజకీయంగా తాము లాభపడ్తామని బీజేపీ వేసుకుంటున్న అంచనాలు నిజమవుతాయా.? తన సీట్లను బీజేపీ పెంచుకోగలుగుతుందా.? వేచి చూడాల్సిందే.

Show comments