స్మశానమూ మనదే.. రంగు పూసేయ్!

‘ఊరు మనదే తోసేయ్’ అని పురాతన కాలంనాటి సినిమాలో ఒక డైలాగు ఉంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం కూడా అంతకంటె తక్కువ రేంజిలో ఎంతమాత్రమూ లేదు.

తమ ప్రభుత్వం రాజ్యమేలుతున్నది గనుక.. తమ పార్టీ జెండాలోని రంగులను ప్రతిచోటా పులిమేయాలని.. ఎటు చూసినా.. వైకాపా రంగులే వెలిగిపోతుండాలని వారు కోరుకుంటున్నారు.

ఈ కోరిక పార్టీల్లో కొత్త కాదుగానీ... తెదేపా కాలంనాటని శిలాఫలకాలకు, చివరికి స్మశానంలో సమాధులకు కూడా పార్టీ రంగులు వేసేస్తుండడమే వారి అత్యతుత్సాహాన్ని చాటిచెబుతోంది.

పార్టీకి చెందినవిగా ముద్రపడిన రంగులను వ్యాప్తిలో పెట్టడం ద్వారా.. ప్రజల్లోకి చొచ్చుకు పోవడానికి రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నాలు ఇవాళ్టివి కాదు.

జాతీయ జెండాలోని రంగులనే తమ పార్టీకి పెట్టుకుని.. లేదా తమ పార్టీ రంగులనే జాతీయజెండాకి పులిమి... కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎంతగా నాటుకుపోయిందో మనకు తెలుసు. ఆ టెక్నిక్ దాదాపుగా అన్నిచోట్లా అన్ని పార్టీలూ వాడుతుంటాయి.

మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏలుబడి సాగినంత కాలమూ.. ఏది కనిపించినా సరే.. దానికి పచ్చ రంగు పులిమేశారు. చివరికి ఆలయాల్లో అతిథులకు వేసే కండువాలను కూడా పసుపురంగులోనే ఉండేలా చూసుకున్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ గుడి కండువాలు.. జాతీయ పతాక లాగా ఎర్ర, ఆకుపచ్చ అంచులతో ఉండేలా చూసుకున్నాయి. తెదేపా వచ్చాక.. కట్టించిన ఇళ్లన్నింటికీ పసుపు రంగు పూశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత.. ఇప్పుడు నడుస్తున్నది మా పాలన అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నది. అన్నిచోట్ల పంచాయతీ కార్యాయాలకు, కొన్ని ఇళ్ల కాంప్లెక్సులకు అధికారికంగా వైకాపా రంగులు పడ్డాయి.

ఇదొక ఎత్తు కాగా.. కార్యకర్తలు మరో అడుగు ముందుకేస్తున్నారు. శిలాఫలలకాలకు  కూడా వైకాపా రంగులేస్తున్నారు. ఇప్పుడు పడుతున్నవి కాదు.. తెదేపా కాలం నాటి పాత శిలాఫలకాలకు కూడా తమ సొంత ఖర్చుతో వైకాపా రంగులేసేస్తున్నారు.

పరాకాష్ట ఏంటంటే.. స్మశానంలో సమాధికి కూడా వైకాపా రంగులు వేయడం. ఎక్కడిదో తెలియకపోయినా.. అలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయినా ఇలా రంగులు వేయడం ద్వారా.. నలుగురిలో చర్చ తప్ప సాధించేదేముంటందో తెలియదు.