సీఎం రమేష్‌ మీసం మెలేసిందెవరిమీద.?

సినిమాల్లో హీరో మీసం మెలేస్తే.. అభిమానులకు లభించే కిక్కేవేరప్పా.! 'ఓసారి తొడకొట్టు చిన్నా.. మీసం మెలేయ్‌ కన్నా..' అంటూ సపోర్టింగ్‌ రోల్స్‌ కోరడం, హీరో ఆయా పనులు చేసి.. థియేటర్లలో రీ-సౌండ్‌ తెప్పించడం మామూలే. రాజకీయాల్లోనూ అప్పుడప్పుడూ ఇలాంటివి చూస్తుంటాం. ఎన్నికల ప్రచారాల్లో ఇలాంటివి ఎక్కువగా కన్పిస్తుంటాయి. అభిమానుల్ని, కార్యకర్తల్ని ఉత్సాహపరచడానికే కాబట్టి, తప్పుపట్టాల్సిన పనిలేదు.

కానీ, మీడియా ముందు ఓ పొలిటికల్‌ లీడర్‌.. దర్యాప్తు సంస్థల్ని ఉద్దేశించి మీసం మెలేస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటుండదు. ఆదాయపు పన్నుశాఖ టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ ఇల్లు, కార్యాలయాలపై సోదాలు జరిపింది. ఈ సోదాల్లో ఏవో కొన్ని పత్రాలు, కొంత నగదుని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దొరికినోళ్ళంతా దొంగలూ కారు.. దొరకనోళ్ళు దొరలూ కాదన్నది రాజకీయాల్లో అందరికీ తెల్సిన విషయమే. ఐటీ అధికారులు తీసుకెళ్ళిన పత్రాలు, నగదుకు సంబంధించి లెక్కలు చూపిస్తే, సీఎం రమేష్‌ క్లీన్‌ చిట్‌ పొందినట్లే. ఆ లెక్కలెలా చూపించాలో రాజకీయ నాయకులకు తెలియదా.?

మొన్న రేవంత్‌ రెడ్డిపై జరిగిన ఐటీసోదాలు కావొచ్చు, తాజాగా సీఎం రమేష్‌ మీద జరిగిన ఐటీసోదాలు కావొచ్చు.. వాటి పని అవి చేసుకుపోయాయి. ఆ తర్వాతి వ్యవహారం కోర్టుకు చేరుతుంది. ఆ కోర్టుల్లో ఇలాంటి వ్యవహారాలు ఎలా సాగతీతకు గురవుతాయో అందరికీ తెలుసు కదా.! మరెందుకు, సీఎం రమేష్‌ మీసం మెలేసినట్లు.?

కడప ఉక్కు పరిశ్రమ కోసమంటూ తుక్కు దీక్ష చేసిన సీఎం రమేష్‌, ఈ మధ్య పదే పదే కేంద్రాన్ని సవాల్‌ చేసేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చట్టసభల్లో అయ్యగారి నిర్వాకం ఎంత గొప్పగా సాగిందో చూశాం. నాలుగేళ్ళు మోడీ సర్కార్‌ని భుజాన మూసి, ఇప్పుడు అదే బీజేపీ ప్రభుత్వాన్ని తూలనాడుతున్నారు.

రాజకీయాల్లో ఇలాంటివి మామూలే.. అది ఆయనకీ తెలుసు. తెలిసే, సీఎం రమేష్‌ పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారన్నది ఓపెన్‌ సీక్రెట్‌. మీడియా సమావేశాల్లో మీసం మెలేసెయ్యడం కాదు.. 2019 ఎన్నికల్లో అసెంబ్లీకో, లోక్‌సభకో పోటీచేసి.. గెలుస్తానని, ఆయన 'శపథం' చేస్తే బావుండేదేమో.

సీఎం రమేష్‌ తెలుగుదేశం పార్టీలో పోషిస్తున్న పాత్ర గురించి తెలియనిదెవరికి.? అసలాయన రాజ్యసభ టిక్కెట్‌ ఏ కోటాలో దక్కించుకున్నారో తెలియనిదెవరికి.? సీఎం రమేష్‌, కాంట్రాక్టుల పేరుతో ప్రభుత్వ ధనాన్ని దోచేస్తున్న వైనంపై.. ఇంకెవరో కాదు, టీడీపీ నేతలే.. అదీ కడపజిల్లాకి చెందిన టీడీపీ నేతలే పలుమార్లు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారాయె.!

ధైర్యముంటే సీఎం రమేష్‌ స్వంత జిల్లాలో పోటీచేసి... కడప టీడీపీ నేతల మీద మీసం మెలెయ్యగలగాలి.!

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి 

Show comments