ప్రజాదర్బార్: తండ్రి బాటలో జగన్

అధికారం అప్పగిస్తే రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని హామీ ఇచ్చిన జగన్, చెప్పినట్టుగానే అప్పటి వైఎస్ఆర్ పాలనను గుర్తుచేస్తున్నారు. సంక్షేమ పథకాల్ని ప్రవేశపెడుతూ, వరాల జల్లులు కురిపిస్తూ అన్ని వర్గాలకు దగ్గరవుతున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ గతంలో అనుసరించిన ఓ పద్ధతిని ఇప్పుడు జగన్ కూడా ఫాలో అవ్వాలని నిర్ణయించారు.

వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రతిరోజు ఉదయాన్నే కొంతమంది సామాన్యుల్ని కలిసేవారు. వాళ్ల సమస్యల్ని వినేవారు. సమస్య చిన్నదైతే అక్కడికక్కడే వాటిని పరిష్కరించేవారు. సాధ్యంకాని పక్షంలో సంబంధిత శాఖకు ఆ అర్జీని పంపించేవారు. వైఎస్ఆర్ తర్వాత అధికారంలోకి వచ్చిన ఏ ముఖ్యమంత్రి ఈ పద్ధతిని ఫాలో అవ్వలేదు. ఇప్పుడు జగన్ మరోసారి ఆ తరహా ప్రజాదర్బార్ ను ప్రారంభించాలని అనుకుంటున్నారు.

తండ్రి తరహాలో తను కూడా సామాన్యులకు దగ్గరగా ఉండే ఉద్దేశంతో ప్రజాదర్బార్ ఏర్పాటుచేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు జగన్. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు మొదలైనట్టు తెలుస్తోంది. ఓవైపు కీలక నిర్ణయాలు తీసుకుంటూనే మరోవైపు ఇలా సామాన్యుల సమస్యల్ని ప్రత్యక్షంగా పరిష్కరించాలని జగన్ భావిస్తున్నారు.

నిజానికి ఈ తరహా కార్యక్రమాలు జగన్ కు కొత్తేంకాదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించారు జగన్. తన పరిథిలో ఉన్నంతలో ప్రజల సమస్యల్ని పరిష్కరించేవారు. ప్రజలకు వ్యక్తిగత స్థాయిలో సాయం అందించిన సందర్భాలు వేలలో ఉన్నాయి.

ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వడంతో ఈ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో నిర్వహించబోతున్నారు. అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో ఈ మేరకు వేదికను ఏర్పాటుచేయబోతున్నారు.

గాజువాకలో అయితే బొత్తిగా తృతీయస్థానం