ఇలాంటి విలీనాలు సబబేనా కేసీఆర్ సారూ?

ఆల్రెడీ కేసీఆర్ కు తెలంగాణ ఫ్రజలు బంపర్ విక్టరీని ఇచ్చారు. మహాకూటమి అంటూ కాంగ్రెస్-తెలుగుదేశం - ఇతర పార్టీలు ఒకటై వచ్చినా.. వాటన్నింటినీ కాదని కేసీఆర్ కు అఖండ విజయాన్ని ఇచ్చారు తెలంగాణ ప్రజలు. ఆయనపై తమకున్న నమ్మకాన్ని, భరోసాను వారు అలా చాటుకున్నారు. ఐదేళ్ల కేసీఆర్ పాలనకు డిస్టింక్షన్ మార్కులు వేసి ప్రజలు కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు. 

అలా తెలంగాణ ప్రజల మనసులను గెలుచుకున్నందుకు కేసీఆర్ ను అభినందించవచ్చు. మరో ఐదేళ్లపాటు కేసీఆర్ కు తెలంగాణలో తిరుగులేదు. ఇక లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రజలు కేసీఆర్ ను ఇదే స్థాయిలో ఆశీర్వదించి ఉంటే ఆయనకు మరింత శక్తి సమకూరినట్టే.

అక్కడి వరకూ బాగానే ఉంది కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేతకు విలీనాల పై మోజు ఇంకా తగ్గినట్టుగా లేదు. గత టర్మ్ లో వివిధ పార్టీల లెజిస్ట్లేటివ్ విభాగాలను కేసీఆర్ విలీనం చేసుకున్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు.. ఇలా వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకున్నారు. అలాంటి చేరికలు తెలంగాణ రాష్ట్ర సమితికి ఏ మేరకు ఉపయోగపడ్డాయో తెలియదు.

అలాంటి ఫిరాయింపుదారులను కూడా ప్రజలు ఇటీవలి ఎన్నికల్లో మళ్లీ గెలిపించడంతో.. కేసీఆర్ కు మళ్లీ విలీనాలపై మోజు మరింత పెరిగినట్టుగా ఉంది. ఈసారి విలీనం చేసుకోవడానికి కూడా పార్టీలు పెద్దగా ఏమీలేవు. అందుకే ఏకంగా కాంగ్రెస్ పార్టీకే కేసీఆర్ టెండర్ వేశారు.

ఆ పార్టీ లెజిస్ట్లేటివ్ విభాగాన్ని తెరాసలోకి విలీనం అంటున్నారు. ఆ పార్టీ తరఫున ఇటీవల నెగ్గిన ఎమ్మెల్యేల్లో మెజారిటీ మంది తెలంగాణ రాష్ట్ర సమితిలోకి చేరిపోయారు కాబట్టి.. సీఎల్పీ విలీనం అంటున్నారు. అయితే ఈ విలీనాలు చట్టపరంగా అయితే చెల్లవు. రాజ్యాంగం ప్రకారం.. ఇవి చెల్లుబాటు కావు. అయితే ఏపీ, తెలంగాణల్లో అలాంటి రాజ్యాంగానికి అనుగుణమైన పాలన సాగుతున్నట్టుగా ఎవరికీ అనిపించడం లేదు.

ఏపీలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే వారిపై చర్యలు తీసుకోకుండానే ఎన్నికలు వచ్చేశాయి. ఇక ఇలాంటి విలీనాలు, ఫిరాయింపులకు ప్రజల ఆమోదం, రాజ్యాంగం ఆమోదం లేకపోయినా.. పాలకులు అయితే ఇలాంటివి తమ విజయంగా చెప్పుకుంటున్నారు. ఏం చేసినా ఐదేళ్ల వరకూ కేసీఆర్ కు తిరుగులేదు కాబట్టి.. ఆయన ఏమైనా చేయగలరు!

రాష్ట్ర రాజకీయంలో ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది?

జెర్సీ గురించి నాని చెప్పిన నిజాలేంటి

Show comments