సినిమా వాళ్లూ బహు పరాక్‌!

సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రాగానే ఎగబడి ఓట్లు గుద్దేయడం అనేది ఒకనాటి ట్రెండు. ఇప్పుడు సినిమావాళ్లు రాజకీయాల్లోకి దిగి సొంత బలంతో గెలవడం దాదాపు అసాధ్యమని ప్రతిసారీ క్లియర్‌ సినిమా కనిపిస్తోంది. ఏదైనా ఎస్టాబ్లిష్డ్‌ పార్టీలో చేరి ఎంపీగానో, ఎమ్మెల్యేగానో గెలవడం సులభమే కానీ, సొంత కుంపటి పెట్టి రాజకీయాల్లో మార్పు తీసుకురాగలమని భావించడం అవివేకం.

చిరంజీవిలాంటి మాస్‌ హీరోకే పదిశాతం సీట్లు కూడా రాలేదపుడు. ముప్పయ్యేళ్ల పాటు సినీ రాజ్యాన్ని ఏలిన చిరంజీవి ఎవరో పేరు కూడా తెలియని ఒక స్త్రీ చేతిలో పరాజయం పాలయ్యాడు. అయినా కానీ పవన్‌కళ్యాణ్‌ రాజకీయాల్లో మార్పు తెస్తానంటూ దిగి కనీసం ఎమ్మెల్యే కూడా కాలేకపోయాడు. పవన్‌కళ్యాణ్‌ రెండుచోట్ల పరాజయం పాలవడం పెద్ద షాకే కాదు ఇకపై రాజకీయాల్లోకి రావాలనే ఆరాటం వున్న నటులకి కనువిప్పు కూడా.

ఇక్కడ పవన్‌కళ్యాణ్‌ అనే కాదు... పక్క రాష్ట్రంలో కమల్‌హాసన్‌కి కూడా పరాభవం తప్పలేదు. సొంత పార్టీని పెట్టి రాజకీయాలలో మార్పు తీసుకొస్తానని వచ్చిన కమల్‌కి తమిళ జనం తన స్థానం ఎక్కడో చూపించారు. పార్టీ అంటూ పెద్ద వ్యవహారాలకి దిగకుండా ఇండిపెండెంట్‌గా మాత్రం పోటీ చేసిన ప్రకాష్‌రాజ్‌కి కూడా మొట్టికాయలు తప్పలేదు.

సినీ రంగంలో ఎంతటి ఘనాపాటీలు అయినా కానీ రాజకీయాలకి వచ్చేసరికి ప్రజల నమ్మకం చూరగొనడం అంత ఈజీ కాదని ఇంకోసారి వీరంతా నిరూపించారు. ఇకపై సొంతంగా రాజకీయం చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ గుణపాఠంగా మిగిలిపోయారు. 

సినిమా రివ్యూ: సీత