సినిమా రివ్యూ: ఎఫ్‌ 2 - ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌

రివ్యూ: ఎఫ్‌ 2 - ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌
రేటింగ్‌: 3/5
బ్యానర్‌:
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
తారాగణం: వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహ్రీన్‌, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి, బ్రహ్మాజీ, అన్నపూర్ణ, అనసూయ, నాజర్‌, ఝాన్సీ తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
కూర్పు: తమ్మిరాజు
ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి
సమర్పణ: దిల్‌ రాజు
నిర్మాతలు: రాజు, శిరీష్‌
రచన, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి
విడుదల తేదీ: జనవరి 12, 2019

భార్యాభర్తల జగడాలు, కీచులాటలు తెలుగు సినిమా బాక్సాఫీస్‌కి సక్సెస్‌ ఫార్ములా అని గతంలోనే రుజువయింది. ఈ జోనర్‌కి పూర్తిగా అంకితమైపోయి పదుల కొద్దీ సినిమాలు తీసిన దర్శకులున్నారు. అయితే గత దశాబ్ధ కాలంగా ఈ కాన్సెప్ట్‌ని సినిమా వాళ్లు వదిలేస్తే, ఇదే కాన్సెప్ట్‌తో కామెడీ స్కిట్స్‌ చేస్తూ టీవీలో జబర్దస్త్‌గా అదరగొట్టేస్తున్నారు యువ కమెడియన్లు. బాక్సాఫీస్‌ పరంగా కాలం చెల్లిపోయిందని అనుకున్న ఈ ఫార్ములాకి కాస్త మోడ్రన్‌ టచ్‌ ఇచ్చి 'ఎఫ్‌ 2' అంటూ మగాళ్లు, ముఖ్యంగా మొగుళ్ళ ఫ్రస్ట్రేషన్‌ని, తద్వారా ఉత్పన్నమయ్యే ఫన్‌ని మన ముందుకి తీసుకొచ్చాడు అనిల్‌ రావిపూడి.

కథాపరంగా ఇందులో చెప్పుకోతగ్గ స్టఫ్‌ లేదు. అయితే ఫన్‌ క్యారెక్టర్స్‌ని, ఫన్నీ సిట్యువేషన్స్‌ని సృష్టించి సినిమా చూస్తున్నంతసేపు టైమ్‌ పాస్‌ చేయడంలో ఎఫ్‌2 డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడు. ఈ ప్రాసెస్‌లో వెంకటేష్‌ని బ్రహ్మాస్త్రంగా వాడుకున్నాడు. ఫ్యామిలీ హీరో ఇమేజ్‌ వున్న వెంకటేష్‌తో ఒక హీరో పాత్ర చేయించడంతో ఆయనకి స్వతహాగా వున్న కామెడీ టైమింగ్‌ ఈ చిత్రానికి భలేగా హెల్ప్‌ అయింది. కొన్ని సాధారణ సన్నివేశాలని కూడా వెంకీ తన హాస్యంతో నిలబెట్టేసాడు. వెంకటేష్‌కి బ్రదర్‌గా వరుణ్‌ తేజ్‌ కూడా యాప్ట్‌గా వున్నాడు. గతంలో కామెడీ చేసిన అనుభవం లేకపోయినా బెరుకు లేకుండా నటించాడు. ఈ ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదరడంతో ఎఫ్‌2 సీన్స్‌ ఇంకాస్త ఎక్కువ ఇంపాక్ట్‌ చూపించగలిగాయి.

ఫస్ట్‌ హాఫ్‌ మొత్తం ఇద్దరు హీరోల ఇంట్రడక్షన్‌, వారికి తమ ఆడాళ్ళతో ఎదురయ్యే ఫ్రస్ట్రేషన్‌తోనే నడుస్తుంది. ఇదంతా విసిగించకుండా వినోదాత్మకంగా సాగడానికి తోడు కొన్ని సందర్భాలలో పొట్ట చెక్కలయ్యే  హాస్యం కూడా పండడంతో 'ఎఫ్‌2' ఫస్ట్‌ హాఫ్‌ పైసావసూల్‌ అనిపించేస్తుంది. మిగతాదంతా బోనస్‌ అని ఆడియన్స్‌తో పాటు డైరెక్టర్‌ కూడా ఫీలవడం వలనో ఏమో ద్వితియార్ధంపై ఎక్కువ ఫోకస్‌ పెట్టినట్టు లేడు. ఫస్ట్‌ హాఫ్‌లో వున్న ఫన్‌ సెకండ్‌ హాఫ్‌కి వచ్చేసరికి చాలా వరకు తగ్గుతుంది. ఫన్‌ మోడ్‌ నుంచి డైవర్ట్‌ కాకపోయినప్పటికీ మొదటి సగంలో పండిన హాస్యాన్ని మ్యాచ్‌ చేయడం ద్వితియార్ధం వల్ల కాలేదు. అయినప్పటికీ అడపాదడపా నవ్వించే సన్నివేశాలతో కాలక్షేపమయితే అయిపోతుంటుంది. ఫస్ట్‌ హాఫ్‌ రేంజ్‌లో సెకండ్‌ హాఫ్‌ కూడా కామెడీ పండినట్టయితే ఈ చిత్రం మరో రేంజ్‌కి వెళ్లిపోయి వుండేది.

కానీ సెకండ్‌ హాఫ్‌ అంతా గ్యాప్‌ ఫిల్లింగ్‌ వ్యవహారంలా, ఈ తంతుని ఎలాగోలా ముగించాలి అనే పద్ధతిలో సాగిపోవడంతో ఒకింత నిరాశ కలుగుతుంది. అయినప్పటికీ చాలా వరకు లోపాలని వెంకటేష్‌ అండ్‌ కో కవర్‌ చేసేయడంతో అనిల్‌ రావిపూడి పని సులువైంది. ఫస్ట్‌ హాఫ్‌లో హజ్బెండ్స్‌ని విక్టిమ్స్‌గా చూపించిన అనిల్‌ రావిపూడి సెకండ్‌ హాఫ్‌కి వచ్చేసరికి వైవ్స్‌ సైడ్‌ తీసుకుని సగటు దిల్‌ రాజు సినిమా దర్శకుడిలా వాళ్లని మెప్పించే ప్రయత్నం చేయడం ఆడ్‌గా అనిపిస్తుంది. అసలు లేడీస్‌ తరఫునుంచి రియలైజేషనే లేకపోవడం ఏమిటో మరి? నాజర్‌ క్యారెక్టర్‌ ద్వారా ఇప్పించిన జస్టిఫికేషన్‌, ఆడవాళ్లకి మొగుడే సర్వస్వం అనే వాదన కొంతమందికి యాప్టే కానీ ఇందులో వెంకీ, వరుణ్‌ల ఫ్రస్ట్రేషన్‌కి రిలేట్‌ చేసుకునే రీజనింగ్‌ కాదది.

అలాగే తమన్నా, మెహ్రీన్‌లకి మరో పెళ్లి చేయాలనుకోవడం, దానిని తప్పించడానికి వెంకీ, వరుణ్‌ పాట్లు పడడం అంతా కన్వీనియంట్‌గా వుంటుందే తప్ప కన్విన్స్‌ చేయదు. ఫస్ట్‌ హాఫ్‌లో అంత ఈజీగా జనరేట్‌ అయిన ఫన్‌ సెకండ్‌ హాఫ్‌కి వచ్చేసరికి బలవంతంగా ప్రయత్నిస్తే తప్ప పుట్టలేదంటే కారణం స్క్రిప్ట్‌ పరంగా వున్న వీక్‌నెస్‌ కారణమని చెప్పాలి. ప్రకాష్‌రాజ్‌, పృధ్వీ బృందంతో ట్రై చేసిన కామెడీ చాలా సాధారణంగా అనిపిస్తుంది. వెన్నెల కిషోర్‌ ట్రాక్‌ అయితే కామెడీ పుట్టించడానికి పడుతోన్న డెస్పరేషన్‌ని తెలియజేస్తుంది. కామెడీ చిత్రాలలో లాజిక్స్‌కి స్పేస్‌ తక్కువ అనుకుని ఇదంతా ఓవర్‌లుక్‌ చేసేయాలి. లోపాలు వున్న మాట నిజమే అయినా వినోదం చాలా వరకు తప్పులని కవర్‌ చేసేయడంతో ఎఫ్‌ 2 ఓవరాల్‌గా 'వాచబుల్‌' అనిపించుకుంటుంది.

ఈ చిత్రానికి వెంకటేష్‌ ప్రధానాకర్షణగా నిలిచాడు. కామెడీ పండించడంలో తనకున్న నేర్పుని ఆయన పూర్తి శాతం వాడడంతో ఈ చిత్రాన్ని సగం ఆయనే గెలిపించగలిగాడు. తమన్నా ఫ్యామిలీ మెంబర్స్‌తో ఆయన పాత్ర వేసుకునే వాదం, కొన్ని సిట్యువేషన్స్‌లో ఇన్‌స్టంట్‌గా ఇచ్చే రియాక్షన్స్‌ బాగా నవ్విస్తాయి. వరుణ్‌ తేజ్‌ కూడా వెంకీకి ఫుల్‌ సపోర్ట్‌ ఇచ్చాడు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ తన వంతుగా వినోదాన్ని పండించాడు. తమన్నా, మెహ్రీన్‌ నటన మామూలుగానే వున్నా కానీ వారి గ్లామర్‌ మాసప్పీల్‌కి దోహదపడుతుంది. 'గిర్రా గిర్రా' పాటలో ఇద్దరూ ఫుల్‌గా రెచ్చిపోయారు బ్రదర్‌!

సహ నటీనటులు కూడా తమవంతు చెయ్యేసారు. రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌ కామెడీకి దోహదపడ్డారు. ప్రగతి, అన్నపూర్ణ లాంటి సీనియర్లు కూడా వెన్నెల కిషోర్‌, ప్రియదర్శిల మాదిరిగా హాస్యం పండించడంతో ఈ చిత్రంలో నవ్వులకి లోటు లేకుండా పోయింది. పృధ్వీ, శ్రీనివాసరెడ్డి పాత్రలు అంతగా నవ్వించలేక మిస్‌ఫైర్‌ అయ్యాయనుకోండి. ఇక సాంకేతిక వర్గానికి వస్తే దేవిశ్రీప్రసాద్‌ పాటలు మళ్లీ వినాలనిపించేలా లేకపోయినా కానీ హుషారైన సన్నివేశాల జోరు అయితే తగ్గించలేదు.

అనిల్‌ రావిపూడి సంభాషణలు నవ్విస్తాయి. దర్శకుడిగా అనిల్‌ రావిపూడి మరోసారి కమర్షియల్‌గా పే చేసే చిత్రాన్ని అందించాడు. కాకపోతే స్క్రిప్ట్‌ పరంగా ఇంకాస్త శ్రద్ధ పెడితే తననుంచి ఇంకా బెటర్‌ అవుట్‌పుట్‌ ఆశించవచ్చు. చాలా సందర్భాల్లో 'ఇది సరిపోతుందిలే' అనే ధోరణి అతని చిత్రాల్లో కనిపిస్తూ వుంటుంది. 'ఇంకేదైనా చేయాలి' అనుకుంటే పాస్‌ అయిపోయే చిత్రాలని దాటి గుర్తుండిపోయే చిత్రాలని అందించగలడు.

సంక్రాంతికి ఏ తరహా వినోదాన్ని, కాలక్షేపాన్ని అయితే ప్రేక్షకులు కోరుకుంటారో అలాంటి వినోదాన్ని అందించిన ఎఫ్‌2 మెజారిటీ ఆడియన్స్‌తో మంచి మార్కులు వేయించుకుంటుంది. ఆకర్షణీయమైన లీడ్‌ యాక్టర్స్‌, హాయిగా నవ్వించే ఫస్ట్‌ హాఫ్‌, ఓకే అనిపించే సెకండ్‌ హాఫ్‌ వెరసి ఈ చిత్రాన్ని డీసెంట్‌ సంక్రాంతి ఎంటర్‌టైనర్‌గా నిలబెట్టాయి. కంటెంట్‌ సోసో అయినా కానీ కాంపిటీషన్‌తో పోల్చుకుంటే క్రౌడ్‌ యాక్టెప్టెన్స్‌ దీనికే వుంటుంది.

బాటమ్‌ లైన్‌: ఎంతో ఫన్‌!
- గణేష్‌ రావూరి

Show comments