త‌ల న‌రుకుతా...సినీ డైలాగ్‌లు కాదు క‌దా?

వేదిక‌పై అగ్ర హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. అందులోనూ జ‌న‌సేనాని. వంద‌లాది మంది ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు హాజ‌రైన స‌భ‌. ఎదురుగా ప‌దుల సంఖ్య‌లో స‌భ‌ను చిత్రీక‌రిస్తున్న మీడియా వీడియోలు, కెమెరాలు. దీంతో తానొక సినిమాలో న‌టిస్తున్న‌ట్టు జ‌న‌సేన నేత సాకే ప‌వ‌న్‌కుమార్ భ్ర‌మించాడు. ఇత‌ను అనంత‌పురం జిల్లా రాప్తాడుకు చెందిన జ‌న‌సేన ఎమ్మెల్యే అభ్య‌ర్థి.  

త‌న పేరు కూడా ప‌వ‌న్‌కుమార్ కావ‌డంతో...త‌మ నాయ‌కుడు, హీరో అయిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌లో ఉన్న‌ది, త‌న‌లో లేనిది ఒక్క క‌ల్యాణ‌మే క‌దా అని భావించిన‌ట్టుంది.  మైక్ చేతికి తీసుకోగానే పూన‌కం వ‌చ్చిన మాదిరి ప్ర‌వ‌ర్తించాడు.  ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆదేశిస్తే రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి అయినా ఏ రెడ్డి అయినా త‌ల న‌రుకుతాన‌ని హెచ్చ‌రించాడు.

అంత‌టితో ఆయ‌న ఆగ‌లేదు. కార్య‌క‌ర్త‌ల నుంచి ఈలలు, చ‌ప్ప‌ట్లు మార్మోగ‌డంతో మ‌రింత రెచ్చిపోయిన ప‌వ‌న్‌కుమార్ వైసీపీ నేత‌ల త‌ల‌లు న‌రికేందుకు మేము రెడీ, మీరు రెడీనా అని ప్ర‌శ్నించాడు. మీరు పెట్టే కేసుల‌కు జ‌న‌సేన భ‌య‌ప‌డ‌ద‌ని వైసీపీని తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించాడు. అస‌లేం మాట్లాడుతున్నాడో తెలియ‌ని అయోమ‌య స్థితి నెల‌కొంది. 

అయితే జ‌న‌సేనాని మాత్రం అలా మాట్లాడ‌డం త‌ప్ప‌ని వారించ‌లేదు. పైగా త‌మ అధినేత మౌనం అంగీకారమ‌ని భావించిన ప‌వ‌న్‌కుమార్ రెచ్చిపోయి ప్ర‌త్యేకంగా రాయ‌ల‌సీమ‌లో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాన్ని రెచ్చ‌గొట్ట‌డం తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. 

Show comments