చౌదరి 'చంద్రభక్తి' తగ్గలేదంతే.!

మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు దయా దాక్షిణ్యాలతో ఒకటికి రెండుసార్లు రాజ్యసభకు ఎంపికైన సుజనా చౌదరి, అదే చంద్రబాబు పుణ్యమా అని కేంద్రమంత్రి కూడా అయ్యారు. కానీ, 'కాలం' చంద్రబాబు - సుజనా చౌదరి మధ్య 'బంధాన్ని' తెగ్గొట్టేసింది. టీడీపీకి గుడ్‌ బై చెప్పేసి సుజనా చౌదరి బీజేపీలో చేరిపోయారు. అయితే, తెరవెనుకాల ఇంకా సుజనా - చంద్రబాబు మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతూనే వున్నాయనుకోండి.. అది వేరే విషయం.

బీజేపీ నేతగా, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో హల్‌చల్‌ చేస్తోన్న సుజనా చౌదరి, చంద్రబాబు గనుక బీజేపీతో స్నేహం కోరుకుంటే.. తాను మధ్యలో వుండి, బీజేపీ అధిష్టానాన్ని ఒప్పిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'టీడీపీలో వున్నప్పుడు బీజేపీతో స్నేహంపై చంద్రబాబుకి నేను ఏం చెప్పానో అది ఆయనకి తెలుసు.. పార్టీలో అందరికీ తెలుసు.. చేతులు కాలాక చంద్రబాబు ఆకులు పట్టుకున్నారు..' అంటూ సుజనా చౌదరి 'అసలు విషయం' బయటపెట్టేశారు.

ప్రస్తుతం బీజేపీ అధిష్టానం చంద్రబాబుతో స్నేహాన్ని కోరుకోవడంలేదన్నది పరోక్షంగా సుజనా చౌదరి చెబుతున్న మాట. అందుకే 'చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం' అని సెలవిచ్చారు సుజనా చౌదరి. అయినాగానీ, 'చంద్ర భక్తి' కారణంగా సుజనా చౌదరి, బీజేపీ అధిష్టానంతో చంద్రబాబు విషయమై మాట్లాడేందుకు సిద్ధంగా వున్నారట.

ఇదిలావుంటే, పోలవరం ప్రాజెక్టుని శరవేగంగా పూర్తి చేయాలన్న కమిట్‌మెంట్‌ కేంద్రానికి వుందనీ.. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో అధికారంలో వున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఆ చిత్తశుద్ధి లేదనీ సుజనా చౌదరి అంటున్నారు. గతంలో చంద్రబాబు చేసిన తప్పులే ఇప్పుడు వైఎస్‌ జగన్‌ చేస్తున్నారంటూ సుజనా చౌదరి వ్యాఖ్యానించడం గమనార్హం.

అప్పట్లో చంద్రబాబు సమర్థుడనీ.. పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టేస్తున్నాయనీ సెలవిచ్చింది ఇదే సుజనా చౌదరి. పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం ఇవ్వాల్సిన నిధుల్ని కేంద్రమంత్రిగా వున్నప్పుడే రప్పించలేని సుజనా చౌదరి, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడితే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?  

రాంగ్ రూట్లో బాబు ఆత్మశోధన

Show comments