జనసేన ఆ జిల్లాలో కొత్త ఆశలు!

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో జనసేన పార్టీ ఆశలపల్లకిలో విహరిస్తోంది. ఇక్కడ కొంతమంది నేతల చూపు పవన్ కల్యాణ్ పార్టీ మీద పడుతోంది. దీనికి ప్రత్యేకమైన కారణాలున్నాయి. చిత్తూరు జిల్లాలో బలిజల జనాభా గట్టిగా ఉంటుంది. చిరంజీవిని రాయలసీమ ప్రాంతంలో బలిజలు బాగా ఓన్ చేసుకుంటారు. మిగతా రాయలసీమలో కూడా బలిజల జనాభా ఉందికానీ, చిత్తూరులో మరి కాస్త ఎక్కువ. దాని ఫలితమే.. 2009 ఎన్నికల్లో తిరుపతి నుంచి చిరంజీవి నెగ్గడం.

కాపులు గట్టిగా ఉన్న సొంతూళ్లో ఓడిన చిరు చిత్తూరులో మాత్రం నెగ్గాడు. అయితే.. చిరు ఎమ్మెల్యే పదవిని మధ్యలో వదిలేసి వెళ్లడంతో ప్రజల నుంచి ఆగ్రహం కూడా వ్యక్తం అయ్యింది. ఇక ఈ జిల్లాపై పవన్ కల్యాణ్‌కు కూడా చాలా ఆశలే ఉన్నాయి. పవన్ కూడా తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని గతంలో వార్తలు వచ్చాయి. అయినా జనసేన అధినేత పోటీ చేయనిది ఎక్కడ నుంచి? అనంతపురం నుంచి, ఏలూరు నుంచి, తిరుపతి నుంచి.. ఇలా అన్ని సీట్ల నుంచి కూడా పవనే పోటీ చేస్తాడన్నట్టుగా ఆ పార్టీ వార్తలుంటాయి.

మరి తిరుపతి నుంచి పవన్ పోటీ చేస్తాడో చేయడో కానీ.. తిరుపతి నుంచి జనసేన ఛాన్సు కోసం అటు సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఇటు టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ ప్రయత్నాలు సాగిస్తున్నారు. వీరిద్దరూ పైకి లేదంటున్నా లోలోన మాత్రం అదే ప్రయత్నం సాగుతోందని సమాచారం.

ఇక తిరుపతి వరకే కాదు.. చిత్తూరు జిల్లాలోని ఇతర నియోజకవర్గాల విషయంలో కూడా ఆశావహులు కనిపిస్తున్నారు. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ టికెట్ కు నిరాకరింపబడిన వాళ్లు జనసేన వైపు చూస్తున్నారని తెలుస్తోంది. పీలేరులో కిషోర్ కుమార్ రెడ్డికి టికెట్ ఖరారు చేశాడు చంద్రబాబు. దీంతో అక్కడ మొన్నటి వరకూ టీడీపీ ఇన్ చార్జిగా ఉండిన ఇక్బాల్ జనసేన వైపు చూస్తున్నాడు. అలాగే.. జిల్లాలోని మరి కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది.

Show comments