ఇంతకీ జగన్.. 'సైరా'ను చూడబోతున్నారా?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తన సమావేశం గురించి వివరాలను మీడియాకు ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. తన తాజా సినిమా 'సైరా నరసింహారెడ్డి' గురించి సీఎంకు వివరించడానికి ఆయనను కలవడానికి అపాయింట్ మెంట్ అడిగినట్టుగా చిరంజీవి వివరించారు. తమను సతీసమేతంగా రావాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతిలు ఆహ్వానించారని చిరంజీవి పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనానికి రావాలని పిలిచినట్టుగా ఆయన చెప్పారు.

ఈ నేపథ్యంలో తాము వెళ్లి కలవడం జరిగిందని, సమావేశం సందర్భంగా సినిమా గురించి వివరించినట్టుగా చిరంజీవి పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన, తొట్టతొలి స్వతంత్ర సమరయోధుడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి తన  తనయుడు ప్రొడ్యూస్ చేసిన సినిమాగా తను జగన్ కు సినిమా గురించి చెప్పినట్టుగా చిరంజీవి ప్రకటించారు. ఆ సినిమాను చూడాల్సిందిగా జగన్ ను కోరినట్టుగా తెలిపారు.

దానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టుగా చిరంజీవి వివరించారు. ఇక సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాల గురించి కూడా సీఎంతో చర్చించినట్టుగా చిరంజీవి ప్రకటించారు. నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని రెండు సంవత్సరాలుగా నిర్వహించని విషయాన్ని జగన్ కు గుర్తు చేశారట చిరంజీవి. గత ప్రభుత్వ హయాంలో నందీ అవార్డుల ప్రకటన అయితే జరిగింది కానీ, అవార్డుల ప్రదానం మాత్రం జరగలేదని చిరంజీవి పేర్కొన్నారట. ఆ విషయంపై జగన్ మోహన్ రెడ్డి స్పందించారట.

అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు పెద్దలు సీఎంతో సమావేశం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారట చిరంజీవి. దానికి కూడా జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. వైఎస్ జగన్, భారతిల ఆతిథ్యం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, వారిని కలవడం కుటుంబ సభ్యులను కలిసిన అనుభూతి కలిగించిందని చిరంజీవి ఈ సమావేశం గురించి వివరించడం గమనార్హం.

రాంగ్ రూట్లో బాబు ఆత్మశోధన

Show comments