చిరు బర్త్ డే.. హోరెత్తిన "దేశం"

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఎక్కువగా, రాజకీయ నాయకులు కాస్త తక్కువగా  అతడికి శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఎంతమంది ఎన్ని విధాలుగా చిరంజీవికి శుభాకాంక్షలు చెప్పినప్పటికీ.. ఈ ఏడాది ఓ విచిత్ర పరిణామం కొట్టొచ్చినట్టు కనిపించింది. అదే తెలుగుదేశం పార్టీలో మార్పు. అవును.. చిరంజీవి పుట్టినరోజును తమ సొంత పార్టీ నేత పుట్టిన రోజుగా సెలబ్రేట్ చేసింది తెలుగుదేశం. అధ్యక్షుడు చంద్రబాబు, తనయుడు చినబాబు నుంచి చాలామంది మంది టీడీపీ నేతలు చిరుకు శుభాకాంక్షలు అందించడానికి ఎగబడ్డారు. మరీ ముఖ్యంగా బాబు, చినబాబు ప్రత్యేకంగా ట్వీట్స్ పెట్టడంతో చర్చ రసకందాయంలో పడింది.

జనసేన అధ్యక్షుడు పవన్ కోసం చంద్రబాబు అర్రులు చాస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పవన్ ను దువ్వేందుకే అన్నయ్య చిరంజీవికి ట్విట్టర్ లో శుభాకాంక్షలు చెప్పి ఉంటారని చాలామంది భావిస్తున్నారు. ఈ యాంగిల్ లో సోషల్ మీడియాలో కొన్ని కౌంటర్లు కూడా పడ్డాయి. చిరంజీవిని మీరు ఎంత పొగిడినా రాజకీయంగా మీకు పవన్ పడడంటూ తెలుగుదేశం పార్టీని తగులుకున్నారు జనసైనికులు. అసలే సోషల్ మీడియాలో శతఘ్ని టీమ్ పవర్ ఫుల్. ఈరోజు వాళ్ల ధాటి స్పష్టంగా కనిపించింది.

ఇవన్నీ ఒకెత్తయితే.. లోకేష్ పెట్టిన ట్వీట్ మరోఎత్తు. చిరంజీవికి శుభాకాంక్షలు అందిస్తూనే, చిరు ఫొటోను కూడా చినబాబు పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. రీసెంట్ గా బాలయ్య తన పుట్టినరోజు చేసుకున్నప్పుడు కూడా లోకేష్ ఇంత ఎలివేషన్ ఇవ్వదేంటూ ట్విట్టర్ లో ఆయన్ను చెడుగుడు ఆడుకున్నారు నెటిజన్లు. "ఒక ఓటమి నీకు చాలామందిని గుర్తుచేసింది. మంగళగిరి ప్రజలకు థ్యాంక్స్." అంటూ మరో నెటిజన్ సెటైర్ వేశారు. మీరు ఎన్ని స్టంట్స్ చేసినా కాపు ఓటర్లు మీవైపు రారంటూ మరో సెటైర్ కూడా పనిలోపనిగా పేలింది.

ఇలా ఒకటికాదు, రెండు కాదు.. చంద్రబాబు, లోకేష్ పై వేలల్లో సెటైర్లు పడ్డాయి. ఎంత సోప్ కొట్టినా పవన్ కల్యాణ్ టీడీపీకి పడడంటూ వచ్చిన కామెంట్సే ఎక్కువగా కనిపించాయి. మరోవైపు రాజకీయాల్లో నెగ్గుకురాలేకపోయిన చంద్రబాబు, లోకేష్.. సోషల్ మీడియాలో తమ ట్రాఫిక్ ను పెంచుకునేందుకే ఇలా చిరంజీవి పుట్టినరోజును వాడుకున్నారంటూ మరికొందరు వ్యాఖ్యలు చేశారు. మరికొందరు మాత్రం ఈ పుట్టినరోజు సాక్షిగా టీడీపీ-జనసేన బంధం బయటపడిందంటూ కామెంట్స్ చేశారు.

మొత్తమ్మీద చిరంజీవి పుట్టినరోజు, తెలుగుదేశం పార్టీలో ఓ సరికొత్త చర్చకు దారితీసింది. గతంలో పవన్ కల్యాణ్, టీడీపీకి మద్దతిచ్చినట్టు.. ఈసారి పవన్-చిరు కలిసి టీడీపీకి మద్దతిచ్చే అవకాశం ఉందంటూ కొత్త డిస్కషన్ మొదలైంది. చంద్రబాబు-పవన్, చంద్రబాబు-చిరు గతంలో కలిసిన ఫొటోలు నెట్ లో లెక్కలేనన్ని షేర్ అయ్యాయి.

జగన్నాటకంలో మంత్రులకు సీన్‌ సితారే? 

Show comments