చినరాజప్పపై బాబు గురి?

హోంమంత్రి చినరాజప్ప మృదుస్వభావి. కాంట్రావర్సీల జోలికపోరు పార్టీకి విదేయుడై వుంటారు. అందుకే ఆయనను ఉపముఖ్యమంత్రిగా ఎంచుకున్నారు చంద్రబాబు. కానీ ఆయన అంటే చినబాబు లోకేష్ కు ఎందుకో పెద్దగా అనాసక్తి అని ఆరంభంలో గ్యాసిప్ లు వచ్చాయి.

తరువాత తరువాత మరేం వినిపించలేదు. అయితే ఇప్పుడు మంత్రి చినరాజప్పపై ముఖ్యమంత్రి చంద్రబాబు గురిపెట్టారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనివెనుక ఆయనపై కోపం ఏమీలేదని, ఆ జిల్లాలో రాజకీయ ప్రయోజనాల కోసమే ఇదంతా అని టాక్.

విషయం ఏమిటంటే, ఈస్ట్ గోదావరిలో కాపు ప్రజా ప్రతినిధులు కాస్త చెప్పుకోదగ్గ సంఖ్యలో వున్నారు. వీళ్లలో సీనియర్లు కూడా వున్నారు. కానీ ఎంత మందికి మంత్రి పదవులు ఇవ్వగలరు. దాంతో కేవలం చినరాజప్పను దరి చేర్చుకోవడం వల్ల మిగిలిన వారిలో కనిపించని అసంతృప్తి పేరుకుంటోంది. ఇలా అసంతృప్తి పెరిగి కొందరు జంప్ జిలానీ అంటారని అనుమానాలు కూడా బయటకు వచ్చాయి.

ఇంకోపక్క అదే జిల్లాలో కాపులకు పోటీగా కమ్మ సామాజికవర్గం కూడా వుంది. కానీ ఈక్వేషన్ల రీత్యా వీళ్లకు సరైన విధంగా టికెట్ లు ఇవ్వడం కుదరడం లేదు. ఈసారి పరిస్థితి చూస్తుంటే కాపులు కాస్త గట్టిగానే పట్టుకునేలా వున్నారు. వైకాపా కాపుల పట్ల నిబద్దత ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తుంది. అందువల్ల అదే పరిస్థితి టీడీపీకి తప్పదు.

ఇలాంటి నేపథ్యంలో ఓ బహుళార్థక రాజకీయ ప్రయోజన సాధక పథకానికి చంద్రబాబు తెరవెనుక శ్రీకారం చుట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి. చినరాజప్పపై సరైన అభ్యర్థిని జనసేన ద్వారా పోటీకి నిలిపి, ఆయనను కట్ చేయగలిగితే, పదవులు ఆశిస్తూ, జంప్ చేస్తామని అంటున్నవారిని బుజ్జగించి, తరువాత అవకాశం కల్పించవచ్చు. చినరాజప్ప గెలిస్తే మళ్లీ ఆయనకే అవకాశం ఇవ్వక తప్పదు. అలా అని టికెట్ ఇవ్వకుండా వుండలేరు.

అందుకే గతంలో చినరాజప్పకు బదులుగా టికెట్ ఆఖరి నిమిషంలో చేజారిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి జనసేన తీర్థం ఇప్పించి, అక్కడ పోటీకి నిలెబెట్టాలనే వ్యూహానికి శ్రీకారం చుట్టారని వినిపిస్తోంది. జనసేన కాబట్టి కమ్మ సామాజికవర్గానికి చెందిన వారికి టికెట్ ఇచ్చినా సమస్యరాదు. అదే టీడీపీ అయితే కాపులకు అన్యాయం చేసిందన్న అపవాదు వస్తుంది. పైగా వేరే పార్టీల్లో టికెట్ లు ఇప్పించడం, తమవారిపైన తను అనుకున్నవారిని ఇండిపెండెంట్లుగా నిలపడం ఇలాంటి అన్నీ బాబుకు అలవాటైన వ్యూహాలే.

ఇలా చేయడం వల్ల ఇద్దరు కాపు అభ్యర్థులతో ఢీకొని కమ్మ సామాజిక వర్గం అభ్యర్థి గెలవడం, ఆ వర్గానికి ఓ సీటు పెరగడం, చినరాజప్ప స్థానంలో తోట త్రిమూర్తులు లేదా ఇంకా మిగిలిన వారికి అవకాశం ఇవ్వడం, ముఖ్యంగా లోకేష్ కు అభిమాన పాత్రుడిగా వున్న కళా వెంకటరావు లాంటి వాళ్లకు మంచి పదవి ఇవ్వడం లాంటి వ్యవహారాలు సాధ్యం అవుతాయి.

ఈస్ట్ లో ఇలాంటి చమక్కులు చాలా వాటికి చంద్రబాబు తన చాణక్యంతో వ్యూహరచన చేస్తున్నారని ఆ జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కృష్ణ, గుంటూరు తమకు అనుకూలంగా వుంటాయని దేశం భావిస్తోంది. వాటి తరువాత ఎక్కువ దృష్టి పెట్టాల్సింది ఈస్ట్ మీదే అని భావిస్తోంది. పైగా జనసేనకు కాస్త ఆదరణ వుండే జిల్లాల్లో ఇది ఒకటి కూడా. అందుకే తెరవెనుక బంధాలతో అక్కడ సరైన వ్యూహం రచించే పనిమీద బాబు బిజీగా వున్నారని టాక్.

ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగానే వున్నాయి. కానీ పెద్దాపురం నియోజకవర్గాన్ని చాలా శ్రద్దగా అభివృద్ది చేసారు చినరాజప్ప అని టాక్. మరి జనం ఆయనకే మళ్లీ పట్టం కడితే..ఈ వ్యూహాలన్నీ గల్లంతయిపోతాయేమో?