చిద్దూ అరెస్ట్ : కటకటాల్లో కాంగ్రెస్ పరువు!

కాంగ్రెస్ పార్టీ పరువు పోయింది. ఆ పార్టీ కీలక నాయకుడు.. వ్యూహకర్తల్లో ఒకడు పళనియప్పన్ చిదంబరం ప్రస్తుతం కటకటాల్లో ఉన్నారు. బుధవారం రాత్రి పెద్ద హైడ్రామా నడుమ చిదంబరంను సీబీఐ అధికారులు డిల్లీలోని ఆయన ఇంటిలో అరెస్టు చేశారు. కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య తరలించారు. కొన్ని రోజులుగా రక్తికట్టిస్తున్న ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. చివరికి కాంగ్రెసు పార్టీ పరువు కటకటాల వెనకకు చేరింది.

చిదంబరం చుట్టూ రేగుతున్న వార్తలకు బుధవారం రాత్రి తెరపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆర్థికమంత్రిగా ఉన్న రోజుల్లో ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణంలో భారీ అవినీతికి పాల్పడినట్లుగా చిదంబరం మీద కేసు నమోదై ఉంది. ఈ కేసులో సీబీఐ తనను అరెస్టు చేయకుండా.. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కొన్ని రోజులుగా చిదంబరం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ మేరకు ఆయన వినతిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. అత్యవసరంగా విచారణ జరపవలసిన పిటిషన్ గా పేర్కొంటూ.. తనకు ముందస్తు బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ‘అత్యవసరంగా విచారించాలనే’ అభ్యర్థనను వారు కూడా తోసిపుచ్చారు.

అప్పటిదాకా బెయిల్ మీద ఆశతో.. అజ్ఞాతంలోకి వెళ్లిన చిదంబరం.. ఇక గత్యంతరం లేకపోవడంతో.. బుధవారం మీడియా ముందుకు వచ్చారు. ఏఐసీసీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు. తన మీద ఆరోపణలు బనాయించారని, ఎఫ్ఐఆర్ గానీ, ఛార్జిషీటు గానీ లేవనిచెప్పారు. కక్షసాధింపు అన్నారు. చెప్పదలచుకుంది చెప్పేసి.. విలేకర్ల ప్రశ్నలను పట్టించుకోకుండా.. వెళ్లిపోయారు. ఆయన ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లినప్పుడు.. ప్రహరీ తలుపులు తీయకుండా బిడాయించుకున్నారు. అధికారులు గోడదూకి లోపలకు వెళ్లి.. ఆయనను అరెస్టు చేయాల్సి వచ్చింది.

తాను ఆర్థికమంత్రిగా ఉన్న రోజుల్లో చిదంబరం పాల్పడిన అక్రమాలపై చాలా ఆరోపణలు ఉన్నాయి. సంస్థలకు అనుచిత లబ్ధిచేకూరేలా సహకరించడం, దానికి ప్రతిగా తన కుమారుడికి దక్కేలా డొల్ల కంపెనీల్లోకి ముడుపుల డబ్బు స్వీకరించడం వంటి అక్రమాలకు చిదంబరం పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. ఆయన మాత్రం సహజంగానే తాను తప్పుచేయలేదంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్  పార్టీ పరువు మాత్రం బజార్నపడ్డట్టుగా కనిపిస్తోంది.

జగన్నాటకంలో మంత్రులకు సీన్‌ సితారే?