చిచ్చు పెట్టిన మోడీ.. బాబుకి ఏదీ క్లారిటీ.!

తెలుగుదేశం పార్టీకీ, తెలంగాణ రాష్ట్ర సమితికీ మధ్యన ప్రధాని నరేంద్రమోడీ చిచ్చుపెట్టారట.. ఇది చంద్రబాబు ఆరోపణ. ఈ ఆరోపణని తెలంగాణ రాష్ట్ర సమితి లైట్‌ తీసుకుంది. 'టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేయాలని టీడీపీకి వున్నా.. ప్రభుత్వ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ కలిసి ముందడుగు వేయాలన్నా.. చంద్రబాబు, కేసీఆర్‌తో ఆ దిశగా చర్చలు జరిపి వుండాల్సింది.. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా వున్న విభజన సమస్యలపై ఎప్పుడూ చంద్రబాబు సానుకూలంగా స్పందించలేదు.. అలాంటప్పుడు రెండు రాష్ట్రాలు కావొచ్చు, రెండు పార్టీలు కావొచ్చు.. ఎలా సానుకూల వాతావరణంలో చర్చలు జరుపుతాయి.?' అంటూ టీఆర్‌ఎస్‌ గట్టిగా ప్రశ్నిస్తోంది.

నిజానికి టీఆర్‌ఎస్‌ - టీడీపీ మధ్య ఒకానొక దశలో సానుకూల వాతావరణమే కన్పించింది. అప్పట్లో ప్రధాని నరేంద్రమోడీ కావొచ్చు, అప్పటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కావొచ్చు.. చంద్రబాబు - కేసీఆర్‌ మధ్య సయోధ్యకు కృషి చేశారన్నది ఓపెన్‌ సీక్రెట్‌. అయితే, ఆ తర్వాతే వ్యవహారం తేడాకొట్టేసింది. అంతకు ముందు చంద్రబాబుని, తాను చేపట్టిన చండీ యాగానికి కేసీఆర్‌ ఆహ్వానించడం.. అమరావతి శంకుస్థాపనకు చంద్రబాబు, కేసీఆర్‌ని ఆహ్వానించడం.. వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.

అయితే, తెలంగాణలో రాజకీయంగా బలపడే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీని దూరంపెట్టింది. టీఆర్‌ఎస్‌తో వైరాన్ని మరింత పెంచుకుంది. ఈ విషయంలో టీఆర్‌ఎస్‌ తక్కువేమీ తిన్లేదనుకోండి.. అది వేరే విషయం. హైకోర్టు విభజన వంటి అంశాల్లో చంద్రబాబు సానుకూలంగా స్పందించని మాట వాస్తవం. దాన్ని టీఆర్‌ఎస్‌ హైలైట్‌ చేస్తూ, తెలంగాణలో టీడీపీని నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకుంది. చంద్రబాబు - కేసీఆర్‌ పరస్పరం ఆధిపత్య పోరు నడుపుతూనే వచ్చారు.

మరోపక్క, రాజకీయ కోణంలో ఒకటి రెండు సందర్భాల్లో టీఆర్‌ఎస్‌తో టీడీపీ పొత్తు దిశగా కొంత సానుకూల వాతావరణం ఏర్పడితే, దాన్ని టీడీపీలో ఓ వర్గం తీవ్రంగా పరిగణించింది. దాంతో మళ్ళీ వ్యవహారం మొదటికొచ్చేసింది. ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్‌, కేంద్రంతో సందర్భోచితమైన స్నేహం చేశారు. అది టీఆర్‌ఎస్‌కీ, బీజేపీకీ.. జాతీయ స్థాయిలో చిన్నపాటి సఖ్యతకు మార్గం సుగమం చేసింది. టీడీపీ - బీజేపీ విషయంలో వ్యవహరించిన తీరు వేరు. అవసరార్ధం పొత్తుపెట్టుకుని, అవసరం తీరాక వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు.

అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుకి ఏ కథలు చెప్పడానికైనా అవకాశముంది గనుక ఆయన కథలు చెబుతూనే వున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు కంటే, టీఆర్‌ఎస్‌ని బతిమాలుకుని ఓ ఐదారు సీట్లు గెల్చుకున్నా.. టీడీపీ ఇమేజ్‌ తెలంగాణలో కాస్తో కూస్తో పెరిగేదే. కానీ, చంద్రబాబుకి ఏ విషయమ్మీద అయినా అంత క్లారిటీ వుంటే ఇకనేం.? పైకి చెప్పే మాటలకీ, చేసే పనులకీ అస్సలేమాత్రం పొంతన వుండదు.. అదే చంద్రబాబు ప్రత్యేకత.

Show comments