చేతులు కాలాక ఆకులు!

మామూళ్ళ మత్తులో అధికారులు
పాలకులకు పట్టని ప్రజా సంక్షేమం
దురదృష్టకర దుర్ఘటనలకు కేరాఫ్‌ 'తూర్పు'

తూర్పు గోదావరి జిల్లా దురదృష్టకర దుర్ఘటనలకు కేరాఫ్‌గా మారింది. ప్రభుత్వ యంత్రాంగం అలసత్వం, పాలకుల నిర్లక్ష్య వైఖరి ఫలితంగా ఈ జిల్లాలో దారుణ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జిల్లాలో జరిగిన పలు దుర్ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. తాజాగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలోనూ ఇదే దుస్థితి కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా ఉండేది! ఇటీవలి జిల్లా మరణఘోషలకు మరో వేదికగా మారింది. గతంలో కోనసీమలోని నగరంలో గ్యాస్‌ పైపులైన్‌ ప్రేలుడు దుర్ఘటన నుండి తాజాగా గోదావరిలో విహారయాత్రకు వెళ్ళిన వశిష్ట బోటు మునక వరకూ అనేక దుర్ఘటనలకు తూర్పుగోదావరి జిల్లా ప్రతిష్ఠను దిగజారుస్తున్నాయి.

జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ ప్రకటిస్తున్నాయి. దీంతో స్థానిక, స్థానికేతర పర్యాటకులు జిల్లాలో విహరించేందుకు వచ్చిన పక్షంలో వారి క్షేమానికి ఇక్కడ భద్రతలేనట్టు తాజా పరిణామంతో తేటతెల్లమయ్యింది. గత ప్రభుత్వంలో మహా పుష్కరాల ప్రారంభం రోజు జరిగిన తొక్కిసలాట దుర్ఘటన యావత్‌ భారతాన్ని కుదిపేసింది. ఈ దుర్ఘటన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షిగా జరిగింది. దారుణానికి బాధ్యలపై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు!

చంద్రబాబు హయాంలోనే మరో దురదృష్టకర దుర్ఘటన తునిలో రత్నాచల్‌ రైలు దగ్ధం! కాపుల ఉద్యమంలో భాగంగా మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం పిలుపుమేరకు తునిలో కాపుల ఐక్యక గర్జన జరిగింది. పరిస్థితి అదుపుతప్పడంతో ఐక్యగర్జన కాస్తా తీవ్ర విద్వంసాన్ని మిగిల్చింది. రత్నాచల్‌ రైలు సహా రెండు పోలీస్‌స్టేషన్లు, అనేక వాహనాలను ఆందోళనకారులు  ధ్వంసం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కోట్లాది రూపాయల ఆస్తులకు నష్టం వాటిల్లింది. ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, నిఘాలోపం, ఇంటెలిజన్స్‌ వైఫల్యం తదితర కారణాలతో ఈ దుర్ఘటన జరిగినట్టు తేటతెల్లమయ్యింది.

టీడీపీ హయాంలోనే లోయలో బస్సు బోల్తా, పాపికొండల విహారంలో పడవబోల్తా వంటి భారీ దుర్ఘటనలు సహా అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఏదైనా ప్రమాదం సంభవించినపుడే శాఖల అధికారులు ఆగమేఘాలపై స్పందిస్తూ తనిఖీలు, సోదాలతో హడావుడి చేస్తుండటం పరిపాటి! అనేక ప్రాణాలు అర్థాంతరంగా గాలిలో కలిశాక గానీ అధికారుల్లో చలనం ఉండటం లేదని, పాలకులు దృష్టి సారించిన దాఖల్లేవని ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

తాజాగా పాపికొండల వద్ద వశిష్ట బోటు మునిగిపోయిన దుర్ఘటనలోనూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు పర్యాటకులు మృతిచెందారు. వాస్తవానికి గతంలోనూ ఇటువంటి అనేక దుర్ఘటనలు పాపికొండలు విహారంలో సంభవించాయి. ప్రమాదం జరిగినపుడు మాత్రమే అధికార యంత్రాంగం తీవ్రంగా స్పందించి ఎడాపెడా సోదాలు నిర్వహిస్తోంది. కాకినాడ రేవుల శాఖ ఆధీనంలో పర్యాటక బోట్లకు పర్మిషన్లు ఇస్తారు.

అధికారులు అన్ని విధాలుగా ధ్రువీకరించిన తర్వాతే ఏ బోటుకైనా ఫిట్నెస్‌ సర్టిఫికెట్‌ జారీచేయాల్సి ఉంటుంది. అలాగే ఆయా రేవుల నుండి బయలుదేరే బోట్లు లేక లాంచీల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, నిబంధనల ప్రకారం తగిన సేఫ్టీ మెటీరియల్‌ లేకపోవడం, అసలు బోట్ల రిజిస్ట్రేషన్‌ రెన్యువల్‌ లేకుండానే రాకపోకల సాగడం వంటి అక్రమాల వెనుక అధికారుల చేతివాటమే ప్రధాన కారణమని, రాజకీయ నాయకులు సైతం అక్రమార్కుల పక్షాన ఉండడం మరో కారణంగా జనం ఆందోళన చెందుతున్నారు.

వ్యాపారం కోసం ప్రమాణాలకు తిలోదకాలు

Show comments