చేతులెత్తేసిన సోమిరెడ్డి.. ప్రచారం ఇలాగేనా.?

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేశారు. క్షణాల్లో ఆయన రాజీనామాకి ఆమోదం కూడా లభించింది. అక్కడికేదో 'త్యాగం' అనే బిల్డప్‌ ఇస్తూ, నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ముందుకెళ్ళారాయన. ఈ నియోజకవర్గం నుంచే రానున్న ఎన్నికల్లో పోటీచేయబోతున్నారు సోమిరెడ్డి. 'ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశా.. అదీ, మీ మీద నమ్మకంతోనే సుమీ.. ఎమ్మెల్యేగా గెలిపిస్తే, అనూహ్యమైన అభివృద్ధిని చేసి చూపిస్తా..' అంటున్నారు ఈ మంత్రిగారు.

త్యాగం అంటే, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంకాదు.. మంత్రిపదవిని వదులుకోవడం.! పాపం ఆ మాత్రం లాజిక్‌ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి తెలియలేదేమోగానీ, జనానికి అర్థమవుతోంది వ్యవహారం. సర్వేపల్లిలో టీడీపీకి అనుకూల ఫలితాలు వస్తాయంటూ చంద్రబాబుకి అందిన 'సర్వే నివేదికల' నేపథ్యంలోనే, అత్యంత వ్యూహాత్మకంగా 'త్యాగం' అంశాన్ని తెరపైకి తెచ్చి, సోమిరెడ్డితో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించారు. కానీ, పరిస్థితులు ఇప్పుడక్కడ ఏమాత్రం సానుకూలంగా లేవట సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి.

'మీ కోసం త్యాగం చేశా..' అంటూ పదే పదే ఒకటేమాట చెబితే, ఎవరికైనా ఒళ్ళు మండిపోతుంటుంది. ఎన్నికల వేళ ఏ నాయకుడి చిత్తశుద్ధి ఎంత.? అన్నదానిపై జనం ఓ అవగాహనకి వస్తారు. గెలిపించాలా.? వద్దా.? అనేదానిపై ఖచ్చితమైన నిర్ణయమూ తీసుకుంటారు. ఆ సంగతి, సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న సోమిరెడ్డికి తెలియకుండా వుంటుందని ఎలా అనుకోగలం.!

ఎమ్మెల్సీగా వుంటూనే అసెంబ్లీకి పోటీచేసినా పెద్దగా తేడా ఏమీవుండదు. అయినా, 'త్యాగం' అంటూ పబ్లిసిటీ స్టంట్‌ షురూ చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సర్వేపల్లిలో ఎదురవుతున్న నిలదీతలతో సోమిరెడ్డికే కాదు, టీడీపీ అధినేత చంద్రబాబుకీ ముచ్చెమటలు పడ్తున్నాయట. 'పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేదు.. సోమిరెడ్డి చేతులెత్తేసినట్లే..' అంటూ స్థానికంగా తెలుగు తమ్ముళ్ళే గుసగుసలాడుకుంటుండడం గమనార్హం.

రాయలసీమ రైతుల పుండుపై కారం

Show comments