చెన్నయ్‌ 'చంద్రం'.. కామెడీ కొనసాగుతోంది.!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారికి తెలుగు జాతి ఆత్మగౌరవం స్థానంలో కొత్తగా 'ద్రవిడ' ఆత్మగౌరవం గుర్తుకొచ్చింది. ఎందుకంటే, ఇప్పుడాయన చెన్నయ్‌ చంద్రుడు కదా.! తమిళనాడులో డీఎంకే పార్టీని గెలిపించాలంటూ చంద్రబాబు అక్కడ ప్రచారం షురూచేశారు. డీఎంకే ముఖ్యనేతలతో కలిసి మీడియా ముందుకొచ్చి, సుదీర్ఘంగా 'మీడియా బుర్ర తినేసే' పని పెట్టుకున్నారు చంద్రబాబు.!

ఏఐఏడీఎంకే పార్టీకి ఓటేస్తే నరేంద్ర మోడీకి ఓటేసినట్లేనంటూ చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు. ఇలాంటి కామెడీలు బహుశా చంద్రబాబుకే చెల్లుతాయేమో. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌కి ఓటేస్తే నరేంద్రమోడీకి ఓటేసినట్లేనని చంద్రబాబు నానాయాగీ చేసిన విషయం విదితమే. చివరికి అటు బీజేపీకీ, టీడీపీకీ, కాంగ్రెస్‌కీ తెలంగాణ ఓటర్లు ఝలక్‌ ఇచ్చారనుకోండి.. అది వేరే విషయం.

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పరిస్థితేంటన్న దానిపైనే భిన్న వాదనలున్నాయి. భిన్న వాదనలేంటి.? ఒక్కటే వాదన.. 'బాబు ఇంటికి వెళ్ళేందుకు సమయం ఆసన్నమైంది' అని అంతా ముక్తకంఠంతో తేల్చి చెబుతున్నారు. 'బై బై బాబు..' అని ఓటర్లు చెప్పేశారంటూ చాలా సర్వేలు స్పష్టం చేస్తున్నాయ్‌. ఈ తరుణంలో చంద్రబాబు, ఇతర రాష్ట్రాల్లో తన ట్రేడ్‌ మార్క్‌ పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంటే నవ్వు రాకుండా వుంటుందా.? జల్లికట్టు విషయంలో నరేంద్రమోడీ తమిళ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారంటూ చంద్రబాబు వింత వాదనను తెరపైకి తెచ్చారు.

నిజానికి జల్లికట్టు అంశాన్ని ప్రస్తావిస్తూ, పందుల పోటీ అంశాన్ని తెరపైకి తెచ్చిన ఆ నాటి కేంద్రమంత్రి సుజనా చౌదరి స్వయానా చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన టీడీపీ నేతే. చంద్రబాబు సర్కార్‌ గతంలో చిత్తూరు జిల్లాలోని తమిళ కూలీలపై తుపాకీలు ఎక్కుపెట్టడం.. ఆ ఘటనలో పలువురు కూలీలు ప్రాణవాలు కోల్పోవడంతో ఆ వ్యవహారం ఇరురాష్ట్రాల మధ్యా పెద్ద రచ్చకు కారణమవడం తెల్సిన విషయాలే.

ఆనాటి ఆ ఘటనను ఇంకా తమిళ ప్రజలు మర్చిపోలేదు. ఆ లెక్కన, చంద్రబాబు తమిళనాడుకి వెళ్ళి డీఎంకేని సపోర్ట్‌ చేయడమంటే, డీఎంకేని ఆయన ముంచేయడం దాదాపు ఖాయమేనేమో.! కొసమెరుపేంటంటే, పదేళ్ళుగా తాను ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని చంద్రబాబు చెప్పడం.

కేంద్రంలో నాలుగేళ్ళు బీజేపీతో కలిసి అధికారం పంచుకున్న చంద్రబాబు, ఏనాడైనా ఈవీఎంల విషయమై కేంద్రంపై ఒత్తిడి తెచ్చారా.? అధికారం పోతుందనే భయంతో ఇప్పుడు ఈవీఎంలపై చంద్రబాబు తెగ గుస్సా అయిపోతున్నారు. చెన్నయ్‌లోనూ చంద్రబాబు ఈవీఎంల పేరుతో గగ్గోలు పెడుతోంటే అంతా ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది.

భారీస్థాయిలో పోలింగ్ అధికార పార్టీలను గద్దెదించింది

Show comments