చరిత్ర సృష్టించిన జననేత జగన్‌

పీఆర్‌పీ బాటలో టీడీపీ... ప్రజాశాంతి దారిలో జనసేన...
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సాధించిన ఘన విజయాన్ని దేశ రాజకీయ చరిత్రలోనే ఓ సంచలన ఘట్టంగా రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర రాజకీయ చరిత్రను తిరగరాశారంటూ జగన్‌ను అభినందిస్తున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీని నాటి ప్రజారాజ్యం పార్టీతోనూ, జనసేనను ప్రజాశాంతి పార్టీతోనూ పోల్చి చూస్తున్నారు. 2019లో చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించి ఎన్నికల బరిలోకి దిగారు. 18 అసెంబ్లీ సీట్లు సాధించారు. ఇపుడు చంద్రబాబు కూడా కాస్త అటూ ఇటుగా ఆ స్థాయిలోనే సీట్లు సాధించి ప్రజారాజ్యాన్ని మరపించారని జనం చెప్పుకుంటున్నారు.

ఇక పవన్‌కళ్యాణ్‌ పరిస్థితి చూసి మరింత జాలిపడాల్సి వస్తోందని, ప్రజాశాంతి పార్టీకి పవన్‌ పార్టీ ఏ విధమైన తేడాలేదని తేల్చిచెబుతున్నారు. మొత్తంమీద జగన్‌ ఘన విజయం సాధించి సంచలన చరిత్రకు తెరతీశారు. వైకాపా విజయం సాధించిన చోట్ల తెలుగుదేశం రెండోస్థానంలో నిలవగా జనసేన మూడోస్థానానికి పరిమితమైంది. అనేక నియోజకవర్గాల్లో జనసేన పాత్ర నామమాత్రం కావడం గమనార్హం! కాపు సామాజికవర్గం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో సైతం జనసేన గెలుపుదిశగా పయనించకపోవడం విశేషం!

గోదావరి జిల్లాలు కాపు సామాజికవర్గానికి కంచుకోటగా ఉన్నాయి. ఈ జిల్లాలలోని పలు నియోజకవర్గాల్లో పవన్‌కళ్యాణ్‌ స్వయంగా పర్యటించి జనసేన అభ్యర్ధులను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. గోదావరి జిల్లాల్లో పార్టీ విజయాన్ని ప్రతిష్ఠాత్మకంగా ఆయన భావించారు. అయితే స్వంత సామాజికవర్గం నుండే జనసేనకు చుక్కెదురైనట్టు ఈ ఎన్నికలు స్పష్టంచేశాయి. కాపు సామాజికవర్గం ఓట్లు జనసేనకు కొన్ని నియోజకవర్గాల్లో ఆశించి స్థాయిలో పోల్‌ అయినప్పటికీ అవి పార్టీని విజయం వరకూ నడిపించలేకపోయాయి. కాపుల ఓట్లలో చీలిక కారణంగా అటు తెలుగుదేశానికి, ఇటు వైకాపా సైతం ఆ సామాజికవర్గం ఓట్లు దక్కించుకోగలిగాయి.

మరోవైపు బీసీ, దళిత, గిరిజన ఓట్లలో సింహభాగాన్ని వైకాపా సాధించింది. అలాగే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు గుత్తగా వైకాపా చేజిక్కించుకున్నట్టు తెలుస్తోంది. తటస్థ ఓటర్లు, ఉద్యోగులు సైతం వైకాపాకు ఏకపక్షంగా అండగా నిలిచిన కారణంగానే ఇంతటి ఘన విజయం సాధ్యమైనట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే ఎన్నికలకు ముందు చంద్రబాబు అనుసరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. నాలుగు సంవత్సరాల పాటు బీజేపీతో అంటకాగి ఆనక వారితో తెగతెంపులు చేసుకోవడం టీడీపీకి పెద్ద మైనస్‌గా జనం చెప్పుకుంటున్నారు. అలాగే వివిధ వర్గాలను లక్ష్యంగా చేసుకుని, ఎన్నికలకు నాలుగైదు నెలలకు ముందుగా ప్రకటించిన సంక్షేమ పథకాలనూ జనం నమ్మలేదన్న విషయం బట్టబయలయ్యింది.

జగన్మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగిన తర్వాత కోడికత్తి పార్టీ అంటూ చంద్రబాబు సహా టీడీపీ నేతలు చేసిన విమర్శలు, వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య అనంతరం జగన్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలనూ ప్రజలు తిరస్కరించినట్టు స్పష్టమయ్యింది. అలాగే ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు ఎదుర్కొన్న ఆరోపణలు, హైదరాబాద్‌పై పదేళ్ళపాటు హక్కు ఉన్నప్పటికీ రాత్రికి రాత్రే అమరావతికి తరలివచ్చి తాత్కాలిక భవనాలు నిర్మించడం వంటి పరిణామాలు ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైనట్టు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదిలావుంటే జగన్మోహన్‌రెడ్డి గత తొమ్మిదేళ్ళలో చేసిన ప్రజా పోరాటాలే ఆయనకు ఈ స్థాయిలో జనాదరణ లభించేందుకు కారణమైనట్టు వైకాపా నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మృతి చెందినప్పుడు చేపట్టిన ఓదార్పుయాత్ర నుండి ఇటీవలి కాలంలో ముగించిన ప్రజా సంకల్పయాత్ర వరకూ ఆయన ప్రజల్లో మమేకమై ఇంతటి ఘన విజయాన్ని అందుకున్నారని జనం చర్చించుకుంటున్నారు.

దివంగత నేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు తర్వాత అంతటి ఘన విజయాన్ని జగన్‌ అందుకున్నారని చెబుతున్నారు. వాస్తవానికి వైకాపా నేతలు సైతం ఇంతటి అఖండ విజయాన్ని ఆశించలేదు. తీరా ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యేసరికి తీరా ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యేసరికి అనూహ్య విజయం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.

పదేళ్ల రాజకీయ ప్రస్థానం అద్భుత మలుపు

Show comments