చట్టసభలంటే చంద్రబాబుకెందుకంత చులకన.?

తీర్మానం అంటే తిరుగులేనిదని అర్థం. ఒక్కసారి తీర్మానించుకున్నాక, వెనక్కి తగ్గే ప్రసక్తే వుండకూడదు. చట్టసభల్లో తీర్మానం అంటే అది శాసనం కిందే లెక్క. అలాంటి తీర్మానానికి చంద్రబాబు సర్కార్‌ మకిలి పట్టించేస్తోంది. చీటికీ మాటికీ చట్టసభల్లో తీర్మానాలు పాస్‌ చేయించేస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. ప్రత్యేకహోదా కోసం ఓసారి తీర్మానించిన చంద్రబాబు, ఆ హోదా దండగ అంటూ, అదే అసెంబ్లీలో ప్రత్యేక ప్యాకేజీకి అనుకూలంగా తీర్మానం చేసేశారు. ఆ తర్వాత మళ్ళీ ప్లేటు ఫిరాయించి, ప్రత్యేక హోదాకి అనుకూలంగా తీర్మానం చేయించి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

చట్టసభలు తీర్మానిస్తే, ఆ తీర్మానాలకి ఎంత విలువ వుండాలి.? దురదృష్టవశాత్తూ చంద్రబాబు చేతుల్లోపడి 'చట్ట సభల్లో తీర్మానం' అభాసుపాలైపోతోంది. కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానం చేసేసింది.. కానీ, ఇప్పుడు ఆ రిజర్వేషన్ల వ్యవహారమేమయ్యింది.? తీర్మానాలకి ఇంతటి దుర్గతి పట్టించడం చంద్రబాబుకి మాత్రమే చెల్లిందని అనుకోవాలేమో. అధికారం చేతుల్లో వుంటే, తనకు నచ్చినట్టు ఏదైనా చేసేయ్యొచ్చని చంద్రబాబు అనుకుంటున్నారనడానికి ఇదొక నిదర్శనం మాత్రమే.

ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాలకి ప్రజల్లో విలువ శూన్యం. ప్రశ్నించేదే ప్రతిపక్షం. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది అధికార పక్షం. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా ప్రతిపక్షానికి చెందిన 20 మందికి పైగా ఎమ్మెల్యేలను అధికార పార్టీల్లోకి లాక్కున్న ఘనత చంద్రబాబుదే. ఆ ఎమ్మెల్యేల్ని, పచ్చ కండువాలు కప్పి అసెంబ్లీలో తన పక్కనే కూర్చోబెట్టుకున్న చంద్రబాబు.. ప్రతిపక్షం అసెంబ్లీకి రావాల్సిన అవసరమే లేదన్నట్టు వ్యవహరిస్తుండడం హాస్యాస్పదంకాక మరేమిటి.?

ఎటూ, ప్రతిపక్షం చట్టసభల్లో కన్పించడంలేదు గనుక, తాను ఆడిందే ఆట.. పాడిందే పాట.. అన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ప్రశ్నించాల్సిన బీజేపీ సైతం, చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరిస్తోంది చట్ట సభల్లో. అందుకే మరి, చంద్రబాబు అడ్డగోలు తీర్మానాలతో చట్టసభల తాలూకు క్రెడిబులిటీనే దెబ్బ తీసేస్తున్నారు.

ఇదే అసెంబ్లీలో ప్రత్యేకహోదాపై తాను గతంలో ఏం మాట్లాడిందీ, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నదీ చంద్రబాబు ఒక్కసారి ప్రశ్నించుకుంటే.. తాను చేసిన, చేస్తున్న తీర్మానాలు ఎంత హాస్యాస్పదమైనవో ఆయనకే అర్థమవుతుంది.

ఫార్టీ ఇయర్స్‌ పాలిటిక్స్‌.. అని చెప్పుకునే చంద్రబాబు, ఈ నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో తాను రాజకీయంగా ఎదగడానికి చట్టసభల విలువని బజారుకీడ్చేశారు తప్ప.. ఏనాడూ వాటి గౌరవాన్ని పెంచింది లేదు.

Show comments