చందు చేసిన పొరపాట్లు?

ఓ డైరక్టర్ నిర్మాతల దర్శకుడు అని ఎప్పుడు అనిపించుకుంటాడు? సినిమా నిర్మాణంలో నిర్మాతలను కూడా దృష్టిలో వుంచుకున్నపుడు. సినిమా బాగుండడం, బాగా లేకపోవడం, హిట్, ఫ్లాప్ అదంతా చాలా ఫ్యాక్టర్ల మీద ఆధారపడి వుంటుంది. కానీ సినిమా ఇలా తీయాలి. ఇంతలో తీయాలి. అన్నది మాత్రం డైరక్టర్ చేతిలో వుంటుంది. అనవసరపు ఖర్చులకు కళ్లెంవేయడం, కథలో చిన్న చిన్న ఛేంజెస్ తో ఖర్చులు తగ్గించడం వంటివి.

ఈ విధంగా చూస్తే దర్శకుడు చందు మొండేటి చాలా తప్పులు చేసినట్లే కనిపిస్తోంది. నాగచైతన్య లాంటి హీరోను తీసుకుని, ఆ హీరో మార్కెట్ ఎంత? ఆ హీరో రేంజ్ ఎంత? ఆ హీరో ఏ జోనర్ చేస్తే జనం చూస్తున్నారు? ఏ జోనర్ చేస్తే, బాక్స్ లు వెనక్కు తిప్పి పంపుతున్నారు? వంటివి పట్టించుకోలేదు. దాదాపు ముఫైకోట్లు ఖర్చు పెట్టించేసారు.

పాపం, మైత్రీ నిర్మాతలను మెచ్చుకోవాలి. చందు మొండేటి లాంటి జస్ట్ రెండు సినిమాల డైరక్టర్ ను నమ్మి, ఏమి అడిగితే అవి ఇచ్చి, ఎంతచెబితే అంత ఖర్చు చేసినందుకు. సినిమా చూసినవాళ్లు, ముఖ్యంగా ఇండస్ట్రీ జనాలు ఈ ఖర్చు గురించే మాట్లాడుకుంటున్నారు.

అసలు అమెరికా షూటింగ్ కు ఎందుకు వెళ్లారు. ఆ ఎపిసోడ్ కు అర్థంవుందా? అది అనవసరపు ఖర్చు కాదా?

కేవలం అటు ఇటు తిరిగుతూ ఫోన్ మాట్లాడడం కోసం మాధవన్ కు పేద్ద సెట్ వేసారు. కోట్లు ఖర్చు చేసి.

హీరో, ఇద్దరు ఫ్రెండ్స్ మందుకొట్టే సీన్ కోసం సెట్ వేసేసారు.

ఈ సినిమాకు కీరవాణి లాంటి పేద్ద మ్యూజిక్ డైరక్టర్ అవసరమా? ఇప్పుడు అడియోనే కదా సినిమాకు వీక్ అయింది? అన్నది మరో ప్రశ్న.

ఈ ఖర్చులు అన్నీ తగ్గించుకుంటే కనీసం ఓ అయిదారు కోట్లు తగ్గివుండేవి కదా? అన్న సలహాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

ఇక సబ్జెక్ట్ రీత్యా చందు చేసిన అతి పెద్దతప్పు, ఎడంచేయి హీరోకి బలహీనత అవ్వాలి కానీ బలం అయితే ఇంకేం వుంటుంది మజా అన్నది? మహానుభావుడు, భలే భలే మగాడివోయ్ సినిమాల్లో వాళ్ల డిజార్డర్లే వాళ్లని ఇబ్బంది పెడతాయి.

అంత ఎందుకు? కన్నడలో ఎడంచేయి కాన్సెప్ట్ తో వచ్చిన సంకష్టకర గణపతి సినిమా మొదలు నుంచి చివరి వరకు ఎడంచేయినే హీరోను నానా ఇబ్బంది పెడుతుంది. దాదాపు అదే అతని పాలిట విలన్ అయిపోతుంది. ఈ సినిమాలో సీన్లు ఒకటి రెండు సవ్యసాచి కోసం లేపేసారు కూడా.

సినిమా ఆరంభంలో పావుగంట సినిమా హాలీవుడ్ సినిమా నుంచి లేపేసారు. మొత్తం 132 రోజులు వర్కింగ్ డేస్ చేసారు. చైతన్య లాంటి హీరో సినిమాకు అన్ని వర్కింగ్ డేస్ నా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ జనాల ప్రశ్న.

నిజానికి ప్రేమమ్ సినిమా తరువాత సవ్యసాచి సినిమా అన్నది చందు మొండేటికి ఒక అద్భుత అవకాశం. ఇది హిట్ చేసుకుని వుంటే, పెద్ద సినిమాలు చేసే అవకాశం వచ్చివుండేది. దాన్ని ఆయన తన చేతులారా పాడుచేసుకున్నారు.

ఇప్పుడు చందు మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకోవాలంటే, తన స్టామినా ను మళ్లీ మరోసారి చూపించాలి. తక్కువ బడ్జెట్ లో మంచి సినిమా తీసి చూపించాలి. అప్పుడే మళ్లీ చందు కెరీర్ ముందుకు వెళ్తుంది.

తమ్ముడి రాజకీయం కోసం చిరు సహకారం.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్  

Show comments