'చంద్రన్న' బుజ్జగింపులు.. అక్కడే ఎందుకు.?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి వేదికగా 'చంద్రన్న బుజ్జగింపుల' పర్వం కొనసాగుతోంది. అదీ, తెలంగాణ టీడీపీ నేతలకు సంబంధించిన బుజ్జగింపుల పర్వం కావడమే విశేషమిక్కడ. తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికలకు సంబంధించి టిక్కెట్లు దక్కించుకోలేకపోయిన అసంతృప్తుల్ని అమరావతికి పిలిచి మరీ చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. టిక్కెట్లు దక్కనివారు, టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లోకి వెళ్ళి.. తిరిగి టీడీపీలోకి రావాలనుకుంటున్నవారు.. 'ఛలో అమరావతి' అంటూ, అమరావతికి పరుగులు తీస్తుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

అధినేత చంద్రబాబు, అమరావతిలో వున్నారు గనుక.. అక్కడికి వెళ్ళడం మామూలే. కానీ, చంద్రబాబుకి వాళ్ళందరినీ అమరావతికి రప్పించడం కంటే, ఆయనొక్కరూ హైద్రాబాద్‌లో కొన్ని రోజులపాటు వుండి వెళ్ళడం తేలిక. అమరావతికి - హైద్రాబాద్‌కీ మధ్య ప్రయాణం చంద్రబాబుకి పెద్ద కష్టంకాదు. ప్రత్యేక విమానాల్లో తిరిగే చంద్రబాబుకి రోజూ, విమానంలో ఓ గంట అలా హైద్రాబాద్‌ వచ్చి వెళ్ళొచ్చు. కానీ, ఎందుకో చంద్రబాబు.. తెలంగాణ టీడీపీ నేతల్ని అమరావతికి రప్పించుకోవడమే బెటర్‌ అని నిర్ణయించుకుని.. అక్కడే అన్ని వ్యవహారాలూ చక్కబెట్టేస్తున్నారు.

ఇక, చంద్రన్న బుజ్జగింపుల గురించి తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఓటుకు నోటు కేసు విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు కదా.! బుజ్జగింపుల పర్వం కూడా అలాగే వుంటుంది. హైద్రాబాద్‌లో బుజ్జగింపుల ఎపిసోడ్‌ నడిస్తే ఇంకేమన్నా వుందా.? చంద్రబాబు పనైపోయినట్లే. అందుకే, అత్యంత వ్యూహాత్మకంగా చంద్రబాబు, అమరావతికి తెలంగాణ టీడీపీ నేతల్ని రప్పించుకుంటున్నారన్నమాట.

అమరావతికి వెళ్ళేదాకా తెలంగాణ టీడీపీ అసంతృప్త నేతలు అగ్గిమీద గుగ్గిలమైపోతున్నారు. అమరావతికి వెళ్ళొచ్చాక.. చంద్రబాబుని ఓ రేంజ్‌లో పొగిడేస్తున్నారు. అంతలా 'చంద్రన్న బుజ్జగింపుల పర్వం'లో ఏ 'ఘట్టం' వారిని ఇంతలా మార్చేస్తుందో ఏమో.! సీబీఐకి ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ అనుమతిని నిరాకరించిందీ, 'మీకు ఏసీబీ వుంటే, మాకూ ఏసీబీ వుంది..' అని చంద్రబాబు దర్పం ప్రదర్శించిందీ, తెలంగాణలో ఏపీ ఇంటెలిజెన్స్‌ అధికారులతో హల్‌చల్‌ చేయించిందీ.. ఈ 'బుజ్జగింపుల' కోసమేనా.? ఏమో, చంద్రబాబుకే తెలియాలి.

బిడ్డా రాస్కో.. తెలంగాణ‌లో అధికారం మాదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments