చంద్రబాబుపైనా ఐటీదాడులు జరుగుతాయా.?

ఓటుకు నోటు కేసుకు సంబంధించి కాస్త ఆలస్యంగా ఐటీశాఖ రంగంలోకి దిగింది. రేవంత్‌రెడ్డి ఒకప్పుడు టీడీపీలో ముఖ్యనేత. ఇప్పుడు కాంగ్రెస్‌లో ముఖ్యనేతగా మారారు. అయినా, ఆయనకి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఐటీశాఖ సోదాల నేపథ్యంలో తాను అరెస్ట్‌ అవక తప్పదని రేవంత్‌రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చేశారుగానీ.. అరెస్టుల వ్యవహారమేమీ జరగలేదు. ఇదీ అత్యంత వ్యూహాత్మకమేనన్న ప్రచారం జరుగుతోంది సర్వత్రా.

ఇక, వరుసగా టీడీపీ నేతల ఇళ్ళపై ఐటీసోదాలు షురూ అయ్యాయి. బీద మస్తాన్‌ రావు, సీఎం రమేష్‌ ఇళ్ళ మీద, కార్యాలయాల మీదా ఐటీసోదాలు అందులో భాగమేనన్న ప్రచారం జరుగుతోంది. అదెంత నిజం.? అన్నది వేరే విషయం. రాజకీయంగా ఈ తరహా అనుమానాలు వెల్లువెత్తడం సహజమే. ఈ సోదాలు ముందు ముందు ఇంకా ఉధృతం కాబోతున్నాయంటూ టీడీపీ వర్గాల్లోనే అనుమానాలు వ్యక్తమువుతండడం గమనార్హం.

తాజాగా, ఈ ఐటీ సోదాల విషయమై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ స్పందించారు. 'ఐటీ సోదాలు వ్యాపారస్తుల మీద జరుగుతున్నాయి.. ముఖ్యమంత్రి మీద జరగలేదు కదా..' అని తేల్చేశారాయన. అంటే, జనసేన - చంద్రబాబు మీద కూడా ఐటీసోదాలు జరగాలని ఆశిస్తున్నట్లే వుంది. ఎక్కడో ఢిల్లీలో ఇలాంటివి కుదురుతాయిగానీ.. ఇతర రాష్ట్రాల్లో అంత తేలికైన వ్యవహారం కాదు మరి. అయినాగానీ, ఆ అవకాశాన్ని పూర్తిగా కొట్టి పారేయలేం.

చాలా ముఖ్యమైన అంశాలపై స్పందించాల్సి వచ్చినప్పుడు, చాలా తేలిగ్గా స్పందించేస్తుంటారు పవన్‌కళ్యాణ్‌. ఆ కోవలోనే, చంద్రబాబుపై ఐటీ దాడులు జరగడంలేదు కదా.. అనేశారుగానీ, చంద్రబాబుపై ఐటీ దాడులు జరిగితే పరిస్థితి ఏంటి.? అన్న ఆందోళన ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో బయల్దేరింది.

ఇది పరువు సమస్య. ఐటీ అధికారులు వచ్చి, ఏవో నాలుగు పత్రాలు తీసుకెళ్ళి.. వాటికి మరో పది విషయాలు లీకుల రూపంలో బయటకు వచ్చి.. ఆ తర్వాత జరిగే రచ్చ ఓ రేంజ్‌లో వుంటుంది. అయితే, ఇదంతా 'ఓవర్‌ ది బోర్డ్‌' వ్యవహారమే.

ఒక్కటి మాత్రం నిజం.. 2019 ఎన్నికలకు ముందర నరేంద్రమోడీ సర్కార్‌ పెద్దగా రిస్క్‌ చేయకపోవచ్చు. ఐటీ సోదాలతో కొంత గందరగోళానికి అయితే కేంద్రం తెరలేపిన మాట వాస్తవం. కానీ, 'ఓటుకు నోటు' అనే లూప్‌ హోల్‌ వుంది గనుక.. టీడీపీ నేతలపై జరిగే సోదాల్లో 'కక్ష సాధింపు చర్యలు' అన్న ప్రస్తావనకు ఎక్కువమంది ఓటేయలేని పరిస్థితి.

Show comments