చంద్రబాబుకు మూసుకుపోయిన రాజ్యసభ డోర్లు!

మరోసారి 'మాజీ ముఖ్యమంత్రి' హోదాకు పరిమితం అయ్యారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. గతంలో పదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు 'మాజీ ముఖ్యమంత్రి' అనే ట్యాగ్ తో గడిపారు. ఇప్పుడు మళ్లీ ఆయనకు అదే ట్యాగే వచ్చి పడింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబును 'మాజీ'ని చేస్తే, ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ పని చేశారు. ఇలా చంద్రబాబుకు వైఎస్ కుటుంబీకులు  సింహస్వప్నంగా మారారు.

ఇప్పటి వరకూ సరే, ఇకపై ఏంటి? అనేదే మరో చర్చ. తెలుగుదేశం అధినేతగా చంద్రబాబు నాయుడు గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూర్చుని.. మళ్లీ తను ప్రతిపక్షంలో కూర్చోవడం అంటే చంద్రబాబుకు అంత కన్నా అవమానం లేదు. అసలే తన గొప్ప అంత.. ఇంత.. అంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ ఉంటారు. తనది నలభై యేళ్లకు మించిన అనుభవం అని రోజూ దీర్ఘాలు చేసే వ్యక్తి చంద్రబాబు. మరి ఇప్పుడు నలభై యేళ్ల వయసున్న వ్యక్తి  సీఎంగా కూర్చుంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తోంది.

ఏ రకంగా చూసినా చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ఎదురైనది మామూలు పరాభవం కాదు. ఈ పరాభవానికి కొనసాగింపుగా  తదుపరి  పరిణామాలు ఉండబోతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూర్చున్నా, లేక ఆ హోదాను మరొకరికి ఇచ్చి తను ప్రతిపక్ష పార్టీ సభ్యుల్లో ఒకరిగా కూర్చున్నా ఆయన పరాభవాన్ని అది పదే పదే గుర్తు చేసింది. అప్పుడు తండ్రి(వైఎస్), ఇప్పుడు కొడుకు(జగన్)..లు చంద్రబాబును ప్రతిపక్షంలో కూర్చోబెట్టారనే విషయంల ప్రజల్లో కూడా పదే పదే చర్చకు వస్తూ ఉంటుంది.

అందుకే చంద్రబాబు నాయుడు ఒక పని చేయబోతున్నారట. తను అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదాను తీసుకోవడం లేదట చంద్రబాబు నాయుడు. ఆ బాధ్యతను మరొకరికి ఎవరికైనా అప్పగిస్తారట. తద్వారా జగన్ ముందు ప్రతిపక్ష నేతగా కూర్చోవాల్సిన అవసరాన్ని చంద్రబాబు నాయుడు తప్పించుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే చంద్రబాబుకు అంతకు మించిన ఛాన్స్ అయితే లేదు.

ప్రతిపక్ష పార్టీ నేతగా కాకపోయినా.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగాల్సిందే! అదీ చంద్రబాబు పరిస్థితి. అలా కాదు.. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి తన అహంకారాన్ని ప్రదర్శిస్తూ చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారా? అనేది ఒక ఆసక్తిదాయకమైన చర్చ.

కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా నెగ్గారు. గతంతో పోలిస్తే చాలా వరకూ మెజారిటీ తగ్గిపోయింది. ఈ పరిణామాల మధ్యన చంద్రబాబు నాయుడు అక్కడ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగక తప్పదు. ఇప్పుడు గనుక చంద్రబాబు నాయుడు అహంభావానికి పోయి కుప్పం ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేసి, మంగళగిరిలో ఓడిన  తనయుడు నారా లోకేష్ ను పోటీ చేయిస్తే..పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం ఏమీ కాదు.

చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో, ముఖ్యమంత్రి అభ్యర్థిగా కనిపించారు కాబట్టి కుప్పం పదే పదే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నిలుస్తూ వచ్చింది. అలా కాకుండా… చంద్రబాబు నాయుడు ఏదైనా అహంభావానికి వెళ్లి రాజీనామా చేసి, ఉప ఎన్నికల తెస్తే మాత్రం పరిస్థితి మరోలా ఉంటుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు అంత సాహసం చేయకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇంత ఊపు కనిపిస్తున్న పరిణామాల్లో కుప్పంకు చంద్రబాబు నాయుడు ఉప ఎన్నికే తీసుకు వస్తే  అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజిల్స్ వేస్తూ నెగ్గుకు వస్తుంది. లోకేషో, భువనేశ్వరో అక్కడ పోటీ చేస్తే ఆ తర్వాత కుప్పం  అనే కంచుకోట అని చెప్పుకోవడానికి కూడా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉండకపోవచ్చని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. 

అంతకూ తెగించి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా.. ఆయన ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. ఆఖరికి ఎమ్మెల్యే హోదా అనేది కూడా లేకుండా పోతుంది. ఎందుకంటే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఏ రాజ్యసభ ఎంపీగానో ఢిల్లీకి వెళ్లే ప్రయత్నం చేసే అవకాశం కూడా లేదు తెలుగుదేశం అధినేతకు!

ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దక్కిన ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను బట్టి చూస్తే.. ఆ పార్టీకి రాబోయే ఐధేళ్లలో కనీసం ఒక్క రాజ్యసభ సీటు కూడా దక్కే అవకాశాలు లేవు. గత ఐదేళ్లలో ప్రతిపక్షంలో ఉండిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు రాజ్యసభ సీట్లను తన సొంతం చేసుకోగలిగింది. అయితే తెలుగుదేశం పార్టీకి దక్కింది కేవలం ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లే కాబట్టి.. ఆ పార్టీకి కనీసం ఒక్క రాజ్యసభ సీటు కూడా దక్కే అవకాశం ఉండదు.

రాబోయే ఐదేళ్ల పాటు ఏపీ కోటాలో పదికి పైగా రాజ్యసభ సీట్లకు ఎన్నిక ఉంటుంది. అవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతమే అవుతాయి. తెలుగుదేశం పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కే అవకాశం ఉంది కాబట్టి.. ఏ రాజ్యసభ సభ్యత్వంతో అసెంబ్లీని వీడటానికి చంద్రబాబు నాయుడుకు అవకాశం లేదు!

ఇక చంద్రబాబును ఏవైనా ఇతర రాష్ట్రాల నుంచి, ఏవైనా  ఇతర పార్టీలు  రాజ్యసభకు పంపిస్తాయా.. అంటే  అంత సీనూ లేదు! బీజేపీయేతర పక్షాల్లో వేటికీ అంత సీన్ లేదు. ఇలా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ తలుపులా అలా మూసుకుపోయాయి. సీఎం రమేష్ లు, సుజనా చౌదరులు కూడా ఈ సారి టర్మ్ ముగిస్తే ఇంటిదారి పట్టాల్సిందే అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

ఏతావాతా చంద్రబాబు నాయుడు అయితే ఎమ్మెల్యేగా కొనసాగక తప్పని పరిస్థితి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఆయనకు ఏపీ పట్ల ఎంత నిబద్ధత ఉందో కూడా అర్థం  అవుతుందని  విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యమంత్రి పదవి ఉంటే అసెంబ్లీకి వెళ్లడం అది పోయింది కాబట్టి.. ఇక ఏపీ అసెంబ్లీతో తనకు పని లేదన్నట్టుగా వ్యవహరిస్తే చంద్రబాబు నాయుడు మరింతగా విమర్శల పాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

లోకేష్ పరిస్థితి ఏమిటి?
తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ ఆశాకిరణం నారా లోకేష్. తన తనయుడికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని, అతడే పార్టీకి భవిష్యత్ నాయకుడు అని చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. గత ఐదు సంవత్సరాల్లో నారా లోకేష్ బాబు అనధికార ముఖ్యమంత్రిగా చలామణి అయ్యారు. పార్టీ తన ప్రైవేట్ ప్రాపర్టీ అన్నట్టుగా ఆయన వ్యవహరించారు కూడా. ఎమ్మెల్సీ కాకముందు, మంత్రి కాక ముందే లోకేష్ బాబు అన్ని శాఖల వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటూ వచ్చారు.

మంత్రులకు అధికారాలను చెలాయించే అవకాశం కూడా లేకుండా నారా లోకేష్ బాబు అన్ని  శాఖల్లోనూ అంతా తాను అయ్యాడనే విశ్లేషణ మొదట్లోనే వినిపించింది. ఉపముఖ్యమంత్రులకుకూడా అధికారాలు లేవని.. అంతా చంద్రబాబు నాయుడి కనుసన్నల్లోనే నడుస్తూ వచ్చిందని వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత లోకేష్ కు టీడీపీలో చాలా బాధ్యతలే పెరిగాయి. అయితే ప్రజలు మాత్రం లోకేష్  కనీసం ఎమ్మెల్యేగా కూడా పనికిరాడు అని తేల్చారు. తాము ఎంతో డెవలప్ చేసేసిన రాజధాని ప్రాంతం అని.. అక్కడ తమకు తిరుగు ఉండదని మంగళగిరిలో పోటీ చేస్తే.. అక్కడి ప్రజలు లోకేష్ ను చిత్తుగా ఓడించారు.

మొదట్లో నామినేటెడ్ పదివి తీసుకుని నవ్వుల పాలైన, కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయిన ఇతడు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడు అవుతాడా? జగన్ ను ఎదుర్కొంటూ పార్టీని నడించేంత సమర్థత లోకేష్ ఉందా? మీడియా జాకీలు లోకేష్ ను ఇంకా ఎన్నాళ్లు నిలబెడతాయి? అనే అంశాలకు త్వరలోనే సమాధానాలు లభించే అవకాశాలున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

పదేళ్ల రాజకీయ ప్రస్థానం అద్భుత మలుపు