చంద్రబాబుకు ఓ బెడద వదిలిపోతోంది

రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో చీఫ్ సెక్రటరీ పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సర్వాధికారి ముఖ్యమంత్రి అయినప్పటికీ.. వ్యవహారాలు అన్నీ నడిచేది చీఫ్ సెక్రటరీ రూపంలో మాత్రమే. అలాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రికి/ ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీతో సఖ్యత ఉండడం అనేది చాలా తప్పనిసరి. అందుకే తమకు ట్యూన్ అయిన చీఫ్ సెక్రటరీలకు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొన్నినెలల ఎక్స్ టెన్షన్ ఇవ్వడమూ లేదా, అంతకంటె కీలకంగా వారి సేవలను ఉపయోగించుకునేలా ఇతర పదవులు, హోదాలు కట్టబెట్టడమూ చేస్తుంటారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం దినేష్ కుమార్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఆ వెంటనే అక్టోబరు 1వ తేదీ నుంచి విధుల్లోకి వచ్చేలా.. సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠాను చీఫ్ సెక్రటరీగా నియమించడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీలుగా పనిచేసిన వారు ఆయనపట్ల అనన్య గౌరవాభి మానాలతో ఉన్న సందర్భాలు తక్కువ. రాష్ట్ర విభజన తర్వాత చీఫ్ సెక్రటరీగా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు విధుల్లో ఉండగా అంతా సవ్యంగానే నడిచింది గానీ.. రిటైరయ్యాక.. బాబు వ్యవహార సరళిపై ఎన్నెన్ని ఆరోపణలు చేశారో అందరికీ తెలుసు. అమరావతి రాజధాని ఎంపిక ఒక కులం లబ్ధికోసం చేసిన ప్రక్రియగా ఆయనే బయటపెట్టారు.

ఈ రకంగా ప్రభుత్వం చేసే ప్రతి పనిలోని అంతరార్థం చీఫ్ సెక్రటరీకి తెలిసిపోతుంటుంది గనుక.. ప్రభుత్వాలు తమకు అనుకూలురను నియమించుకోవడమూ, లేదా, ఆ పదవిలోకి వచ్చిన వారితో సఖ్యంగా ఉండడమూ చేస్తుంటాయి. ఐవైఆర్ తో చంద్రబాబుకు బెడిసిన తర్వాత.. ఆ ఆరోపణల్లో చాలా భ్రష్టుపట్టారు.

తాజా విషయానికి వస్తే.. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ దినేశ్ కుమార్ ముక్కుసూటిగా వెళ్లే వ్యక్తి. ఆయన కేంద్రంలోని మోడీ సర్కారుకు, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండే వ్యక్తి అనే అనుమానం తెలుగుదేశం పార్టీలో కొందరికి ఉంది. గతంలో సీఎస్ గా ఉన్న టక్కర్ కు చంద్రబాబు రెండు పర్యాయాలు అంటే ఆరునెలల పాటు ఎక్స్ టెన్షన్ ఇచ్చారు. దీనివలన ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ అయిన అజేయకల్లం కేవలం ఒక నెలలోనే పదవిలోంచి దిగిపోవాల్సి వచ్చింది.

ప్రస్తుతం దినేశ్ కుమార్ కు ఎక్స్ టెన్షన్ ఉండదని.. ఆయన పదవీవిరమణ వెంటనే.. అక్టోబరు 1వతేదీ నుంచి అనిల్ చంద్ర పునేఠ కొత్త చీఫ్ సెక్రటరీ అవుతారని అమరావతి వర్గాల ద్వారా తెలుస్తోంది.