సినిమా రౌడీ వార్ణింగులిస్తున్న చంద్రబాబు

చంద్రబాబు వార్ణింగులిస్తున్నాడు. ఎవరికి అని అడొగొద్దు. ఎవరికి పడితే వాళ్లకి...

నిన్నగాక మొన్న జగన్ మోహన్ రెడ్డికి, వైకాపా నాయకులకి ఎవ్వరూ ఊహించనంత భయంకరమైన ట్రీట్మెంట్ తాను సీయం అయ్యాక ఇస్తానన్నాడు. చరిత్రలో ఏ పొలీటిషియన్ కి పట్టని దయనీయమైన గతి జగన్ మోహన్ రెడ్డికి పట్టిస్తానన్నాడు. 

అంటే 2024 ఎన్నికల్లో కచ్చితంగా తాను పవర్లోకి వచ్చేస్తున్నట్టు మనసా వాచా నమ్మేస్తున్నాడు. 

కొన్ని నెలల క్రితం వరకు బాబులో ఏదో భయం ఉండేది. "మన పార్టీ బ్యాడ్ పొజిషన్లో ఉంటే మీరంతా ఇలా పని చెయ్యకపోతే ఎలా?" అని తన పార్టీ నాయకుల్ని నిలదీస్తూ, మందలిస్తూ ప్రెస్మీట్ కూడా పెట్టాడు. 

అంతకంటే చాలా ముందు మీడియా సాక్షిగా ఎక్కెక్కి ఏడ్చిన సంగతి అందరికీ తెలిసిందే. జూం మీటింగుల్లో కూడా దిగాలుగా, బెరుకుగా కనిపించేవాడు. కానీ ఇప్పుడు సినిమాటిక్ వార్ణింగులిస్తున్నాడు. 

ఇది ఎప్పటి నుంచి అంటే...ఒక్క సీటు కూడా గెలవదేమో అని బిక్కుబిక్కుమంటూ కూర్చున్నప్పుడు ఏదో కలిసొచ్చి మూడు ఎమ్మెల్సీ సీట్లు రాగానే 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తధ్యమన్నట్టు, తాను సీయం గా మళ్లీ ప్రమాణస్వీకారం చేస్తున్నట్టు ఫిక్సైపోయాడు. నిజమే..అది మానవసహజం. జుట్టంతా రాలిపోయాక బట్టతలమీద మూడు వెంట్రుకలు మొలిస్తే వాటినే ప్రేమగా దువ్వుకుంటూ తన క్రాఫ్ బాగుందని సంబరపడే సగటు మనస్తత్వమది. 

నాయకుడన్నాక లేని ఆత్మస్థైర్యాన్ని నటించాలి, లేదా ఉన్న దానిని ప్రదర్శించాలి. తప్పులేదు. కానీ తాను పదవిలోకొస్తే ప్రజాసంక్షేమం దృష్ట్యా ఏం చేస్తానో చెప్పకుండా ప్రతీకారం ఎలా తీర్చుకుంటానో ప్రకటించడం ఒక్క బాబుకే చెల్లిందేమో. 

అదలా ఉంచితే ఈ రోజు కొత్తగా టీవీ9 ని, ఎన్.టి.వి ని, సాక్షిని బ్యాన్ చేస్తానని ప్రకటించాడు. వాటిని బ్లూ మీడియాలని ప్రకటించాడు. వాళ్లకు కూడా సరైన ట్రీట్మెంట్ ఇస్తానని వార్ణింగిచ్చాడు. ఇంతకీ ఈ వార్ణింగెందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాలి. 

"మీరు పదవిలోకొస్తే గ్రామ వాలంటీర్ వ్యవస్థని ఉంచుతారా, పీకేస్తారా?" అని టీవీ9 విలేకరి బాబుని అడిగాడు. 

దానికి సమాధానం చెప్పడానికి బాబు తెల్లమొహం వేసాడు. 

"తీసేస్తాను" అని చెప్తే జనం ఛీకొడతారు. 

"ఉంచుతాను" అంటే జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వ్యవస్థ సరైనదే అని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. 

ఇలా ముందు నుయ్యి వెనుక గొయ్యి పరిస్థితిలోకి నెట్టబడి, టీవీ9 విలేకరిని తిట్టి, ఆ ఛానల్ ని బ్లూ మీడియా అని బ్రాండ్ చేసి, ఎన్.టి.వి ని, సాక్షిని కూడా ప్రస్తావించి మరీ వార్ణింగిచ్చాడు. ఎగ్జాం పేపర్ కఠినంగా వస్తే పేపర్ సెట్ చేసిన లెక్చరర్ ని తిట్టే సగటు పూర్ స్టూడెంట్ బిహేవియర్ కూడా ఇలాగే ఉంటుంది. 

ఇలాంటి మాటలు మాట్లాడితే వచ్చే సింపతీ కూడా రాకుండా పోతుంది. మూడు సీట్లు వచ్చాయని, వెనక ముప్పై మంది చప్పట్లు కొట్టే చీర్ బాయ్స్ ఉన్నారని రెచ్చిపోయి ఇలాంటి వార్ణింగులిస్తే అది కూడా బూమ్రాంగ్ అయ్యే ప్రమాదం లేకపోలేదు. 

"మా వయసు వాళ్లం కూడా మిమ్మల్ని తిట్టాల్సొచ్చేది ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడే. కాస్త సిగ్గు తెచ్చుకుని వయసుకు తగ్గట్టు బిహేవ్ చెయండి" అన్నాడు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. 

ఈ టాపిక్ మీద ఇంకా కొడాలి నాని మైకందుకోలేదు. అందుకుంటే అది చంద్రబాబు వార్ణింగ్ వీడియో కంటే పదిరెట్లు ఎక్కువ వైరలయ్యేలా ఘాటుగా ఉంటుంది. పర్యవసానంగా తన పరువు ఇంకాస్త పోగొట్టుకోవడం తప్ప ఏమీ ఉండదు. 

కొడాలి నానీయో మరొకరో ఏది పడితే అది మాట్లాడుతున్నారంటే వాళ్లు పార్టీ అధినాయకులు కాదు కనుక సహించొచ్చు. కానీ జనసేన అధినేత పవన్ వైకాపా నాయకుల్ని "నా కొడకల్లారా" అని సంబోధిస్తూ ఊర రౌడీలా మాట్లాడతాడు. 

"మీకు భయంకరమైన ట్రీట్మెంట్" ఇస్తా అంటూ చంద్రబాబు సినిమా రౌడీలాగ వార్ణింగులిస్తున్నాడు. 

ఇవి ఇలాగే కొనసాగితే 2024 తర్వాత "పార్టీ లేదు బొక్కా లేదు" అనే అచ్చన్నాయుడి ఫేమస్ డైలాగ్ నిజమైపోవడం ఖాయం. 

కొల్లి అనీల్ కుమార్

Show comments