చంద్రబాబు స్వయంకృతం-జగన్‌ కష్టార్జితం

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు ఊహించినట్లే వచ్చాయి. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఒక వ్యాసం రాస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్‌ ముఖ్యమంత్రి అయితే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అది వార్త కాదని పేర్కొన్నాను. సరిగ్గా అది వాస్తవరూపం దాల్చుతూ ఫలితాలు వచ్చాయి. ఇందుకు రెండు కారణాలు స్పష్టంగా ఉన్నాయి. ఒకటి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పాలన చేసిన చంద్రబాబు స్వయంకృతాపరాధం, రెండు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్‌ చేసిన పోరాటాలతో పాటు ఆయన తెచ్చుకున్న పాజిటివ్‌ ఇమేజీ కూడా బాగా పనిచేశాయని చెప్పాలి. జగన్‌ శ్రమ ఫలించింది. ముందుగా చంద్రబాబు అపరాదాలు అనండి.. స్వయంకృతాపరాధాలు అనండి.. అవేమిటో చూద్దాం.

చంద్రబాబు తాను ఒంటరిగా గెలవలేదని, బీజేపీ, జనసేనల సాయంతో గెలిచానన్న సంగతి మర్చిపోయారు. అంతా తన ఇమేజీ వల్లే అధికారంలోకి వచ్చానని ఆయన భ్రమించారు. అంతేకాదు.. అనేక ఆచరణ సాధ్యంకాని వాగ్ధానాలను కూడా ఆయన ఇచ్చి వాటిని అమలు చేయడంలో వైఫల్యం చెందారు. ముఖ్యంగా రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ కాపు రిజర్వేషన్‌, నిరుద్యోగ భృతి వంటి అనేక విషయాలలో ఆయన హామీలు నెరవేర్చుకోవడం సంగతి అలా ఉంచి ఆయా అంశాలలో ప్రజలను డబాయించడానికో, మభ్య పెట్టడానికో యత్నించారు. తన వాగ్ధానాలను కేంద్ర ప్రభుత్వమో, రిజర్వు బ్యాంకో తీర్చాలన్నట్లుగా వ్యవహరించారు.

రాజధాని పేరుతో అరాచకాలకు పాల్పడ్డారు. విజయవాడ పరిసరాలలో రాజధాని అనిచెప్పి ప్రజలను మోసంచేశారు. చాలామంది అమాయకులు ప్రభుత్వ భూములు ఉన్నచోట  రాజధాని వస్తుందని నూజివీడు వైపు భూములు కొనుగోలు చేసుకుంటే ఈయన మూడు పంటలు పండే ప్రైవేటు భూములు ఉన్న తుళ్లూరు ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. అయినా ఫర్వాలేదు. కాని అవసరం లేకుండానే ముప్పైమూడు వేల ఎకరాలు సేకరించానని గొప్పలు చెప్పుకున్నారు. భూములు ఇవ్వడం ఇష్టంలేని రైతులను నానాబాధలు పెట్టారు. కొందరి పంటలను కూడా తగులబెట్టించారు. పైగా దానిని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పైకి నెట్టేయత్నం చేశారు.

కాపు రిజర్వేషన్‌లు రాష్ట్ర పరిధిలోనివి కాకపోయినా హామీ ఇచ్చి ప్రజలను మోసంచేసే యత్నంచేశారు. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం ఉద్యమిస్తే దానిపై ప్రభుత్వపరంగా దారుణంగా వ్యవహరించారు. కాపులంతా అవమానానికి గురయ్యేలా చేశారు. తుని వద్ద రైలు దగ్గం అయితే దానిని ఆర్పే చర్యలు తీసుకోవలసిందిపోయి మీడియా ముందుకు వచ్చి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పైన, రాయలసీమ వారిపై ఆరోపణలు చేశారు. తన వైఫల్యాన్ని ఎదుటివారిపై నెట్టేయత్నం చేశారు. గోదావరి పుష్కరాలలో ఇరవైతొమ్మిది మంది తన ప్రచారయావ వల్ల మరణిస్తే ఒక్కరిపై కూడా చర్యలేదు. కేసూ లేదు. జన్మభూమి కమిటీలను మాఫియా కమిటీలుగా మార్చారు.

ఎమ్మెల్యేల అరాచకాలకు అండగా నిలబడ్డారు. చింతమనేని ప్రభావకర్‌ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే వారిపై చర్య తీసుకోకపోగా, వారికి మద్ధతుగా మాట్లాడి రాజధర్మాన్ని విస్మరించారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను వదులుకోవలసిన పరిస్థితి ఆయన వల్లే వచ్చింది. తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం ప్రయత్నించి ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నారు. ప్రత్యేకహోదాతో సహా అనేక అంశాలపై ఆయన ఎన్నిసార్లు మాటమార్చారో ఆయనకే తెలియదు. ఏపీని ఒక అబద్ధాల సమాజంగా, మోసాల రాజకీయ వ్యవస్థగా మార్చారు. ప్రజలు వీటిని అర్థం చేసుకోలేరని ఆయన నమ్మారు. ఆ ఊబిలో ఆయనే కూరుకుపోయి ఇప్పుడు ఫలితాన్ని చవిచూశారు. ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి.

ఇక జగన్‌ వైపు పాజిటివ్‌ పాయింట్లు చూద్దాం. జగన్‌ గతసారి అధికారంలోకి రాలేకపోయినా హుందాగా వ్యవహరించారు. ఈవీఎంలను, మరొకటనో ఆరోపణలు చేయలేదు. ఆ తర్వాత ఆయా ప్రజా సమస్యలపై నిత్యం ప్రజలలో ఉన్నారు. ప్రత్యేకహోదాపై ఆయన చేసినన్ని కార్యక్రమాలు మరెవరూ చేయలేదు. ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టిన సందర్భంలో కోర్టు మినహాయింపు ఇవ్వకపోయినా, ఎంతో శ్రమకోర్చి దానిని పూర్తిచేశారు. నవరత్నాల పేరుతో తనకంటూ ఒక ప్రత్యేక కార్యక్రమాలను పెట్టుకుని వాటిని ప్రజలలోకి తీసుకువెళ్లారు. చంద్రబాబు కూడా వాటిలో కొన్నిటిని కాపేకొట్టే పరిస్థితి తెచ్చారు.

జగన్‌ తనపై విశాఖపట్నంలో హత్యాయత్నం జరిగినా ఎక్కడా సంయమనం కోల్పోకుండా వ్యవహరిస్తే చంద్రబాబు దానిని ఎద్దేవా చేసిన తీరు అందరిని విస్మయానికి గురిచేసింది. జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలి అని ప్రజలంతా అనుకునే విధంగా ఆయన నడుచుకున్నారు. అంతేకాక ఎన్నికలలో పోటీచేసే అభ్యర్దుల విషయంలో కాని, ఇతరత్రా కాని ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకోగలిగారు. అభ్యర్థుల ఎంపికలోనే ఆయన సక్సెస్‌ అయ్యారనే అభిప్రాయం కలిగింది.

తెలుగుదేశంకు అండగా ఉంటారనుకునే వెనుకబడిన తరగతుల వారిని జగన్‌ తన డిక్లరేషన్‌ ద్వారా ఆకట్టుకున్నారు. అన్నిటికి మించి ముప్పైవేల కోట్ల జనం డబ్బుతోనే జనం ఓట్లు కొని గెలవాలన్న చంద్రబాబు దుర్మార్గపు ప్రయత్నాన్ని ప్రజలు ఓడించారు. ప్రజాస్వామ్యం లేకుండా నియంతృత్వంగా వ్యవహరించిన చంద్రబాబుకు జనం గుణపాఠం చెప్పారు.

చరిత్ర ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. ప్రజలు ఎల్లవేళలా మోసపోరు. అనడానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పెద్ద నిదర్శనం అవుతాయి. అందుకే ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి నా వందనాలు.

-కొమ్మినేని శ్రీనివాసరావు

పదేళ్ల రాజకీయ ప్రస్థానం అద్భుత మలుపు