ప్రజావేదిక.. చంద్రబాబు, టీడీపీ క్షమాపణలు చెప్పాలి

తమ హయాంలో ఇలా ఒక అక్రమ కట్టడం కట్టినందుకు, దాని కోసం భారీఎత్తున ప్రజల ధనం వాడుకున్నందుకు.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అంతేకాదు.. ప్రజావేదిక కట్టడానికి అయిన ఖర్చుతో సహా, కూల్చడానికి అయిన ఖర్చును కూడా చంద్రబాబు నాయుడు ఖాతా నుంచి, తెలుగుదేశం పార్టీ ఖజానా నుంచి వసూలు చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఈ అంశంపై ఎవరైనా కోర్టుకు వెళ్లవచ్చు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసి.. ఈ అక్రమ కట్టడం కట్టడానికి, కూల్చి వేయడానికి అయిన ఖర్చును చంద్రబాబు నాయుడు వ్యక్తిగత ఖాతా నుంచి తీసుకోవాలని కోర్టును కోరితే తగిన న్యాయం జరిగే అవకాశాలున్నాయి.

ప్రజా వేదిక అక్రమ కట్టడం అని ప్రభుత్వమే నిర్ధారణ చేసింది. ఒకవైపు అక్రమ కట్టడాలను అరికట్టాల్సిన ప్రభుత్వ ఆధీనంలోనే ఈ నిర్మాణం జరగడం శోచనీయం. చిన్న చిన్న పట్టణాల్లో కూడా కాస్త రోడ్డుకు వచ్చి కట్టారని మెట్లను, కాంపౌండ్లను కూల్చి వేస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలు నిబంధనలను ఏమాత్రం అతిక్రమించినా మున్సిపాలిటీలు, ప్రభుత్వాలు ఉపేక్షించవు. చాలా నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి ప్రభుత్వమే ఇలా ఎనిమిది కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేసి ఒక అక్రమ కట్టడం నిర్మించడం అంటే అంత కన్నా నేరం ఏముంది? 

ప్రభుత్వమే అక్రమ కట్టడం కడితే.. ఆ చుట్టుపక్కల ప్రైవేట్ వ్యక్తులు ఊరికే ఉంటారా? రెచ్చిపోయి.. భారీ కట్టడాలకు తెరలేపరా? ఈ మాత్రం ఇంగితం కూడా లేకుండా చంద్రబాబు నాయుడు పాలన సాగిందనే విషయాన్ని తేటతెల్లం చేసింది 'ప్రజా వేదిక'. ఈ అంశంగురించి తెలుగుదేశం పార్టీ చాలా బాధపడుతూ ఉంది. అక్రమ కట్టడం కట్టకూడదా, చంద్రబాబుకు ఆ హక్కు లేదా? అన్నట్టుగా తెలుగుదేశం నేతల వాదనలు సాగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఇంకా తన తీరును మార్చుకోలేదు అనే సంకేతాలను ఇస్తున్నాయి ఈ వాదనలు.

తెలుగుదేశం కథ ముగిసిందా?.. బడాయికి పోతున్న బీజేపీ

Show comments