త‌న చేత‌గాని త‌నానికి త‌నే బ్రాండ్ అంబాసిడ‌ర్!

కుప్పానికి హంద్రీనీవా నీటిని చేర్చ‌డం గురించి డిమాండ్ చేశారు ఆ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే చంద్ర‌బాబు నాయుడు. ఒక‌వేళ ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే త‌న నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌స్య గురించి ఇలా మాట్లాడి ఉంటే అది స‌బ‌బే. ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా ఎమ్మెల్యేలు ఇలా మాట్లాడుతూ ఉంటారు. రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని నిందించ‌డానికి మాట్లాడుతూ ఉంటారు.

అయితే అల్లాట‌ప్పా ఎమ్మెల్యే అలా మాట్లాడితే అందులో విడ్డూరం లేదు కానీ, ఇలా ఒక మాజీ ముఖ్య‌మంత్రి మాట్లాడ‌టం మాత్రం సిస‌లైన కామెడీ. అది కూడా ఒక‌టి కాదు రెండు కాదు..14 సంవ‌త్స‌రాల పాటు సీఎంగా చేసి.. ద‌శాబ్దాలుగా కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ.. ఆ నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌స్య‌లు ఇప్ప‌టికి చంద్ర‌బాబుకు గుర్తురావ‌డం కామెడీ గాక మ‌రేమిటి?

కుప్పానికి నీళ్లు ఇవ్వాలి.. అనే ఆలోచ‌నే చంద్ర‌బాబుకు ఉంటే.. ముఖ్య‌మంత్రిగా ఏం చేసిన‌ట్టు! ఇటీవ‌లే చంద్ర‌బాబు నాయుడు ఒక మాట మాట్లాడారు.. అదేదో 'పీక‌డం' అంట‌. ఆయ‌న భాష‌లోనే ఇప్పుడు కుప్పం జనాలు గొణుక్కొంటూ ఉండ‌వ‌చ్చు.. 'ఇన్నాళ్లూ ఏం పీకిన‌ట్టు?' అని! జ‌నాలు ఇప్పుడు అనుకోవ‌డంలో పెద్ద విచిత్రం లేదు!

త‌న తొలి తొమ్మిదేళ్ల ట‌ర్మ్ లో హంద్రీనీవా ప్రాజెక్టును చంద్ర‌బాబు నాయుడు ఏం చేశారో ఎవ‌రికీ తెలియ‌నిది కాదు. ఎన్టీఆర్ హ‌యాంలో దానికి శంకుస్థాప‌న జ‌రిగింద‌ని ఇప్ప‌టికీ చంద్ర‌బాబు చెప్పుకుంటూ ఉంటారు. మ‌రి ఎన్టీఆర్ ను దించి సీఎం అయిన త‌ను హంద్రీనీవాను తొమ్మిదేళ్ల పాటు ఏం చేశారు?

వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి సీఎం అయ్యే వ‌ర‌కూ హంద్రీనీవా ప్రాజెక్టు ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా ఎందుకుండిపోయింది? ఆ పై..వైఎస్ఆర్ పోయాకా హంద్రీనీవా ప‌ట్ల కిర‌ణ్ స‌ర్కారు చొర‌వ చూప‌కపోవ‌డాన్ని ఎందుకు ప్ర‌శ్నించ‌లేదు!

అదంతా అయిన త‌ర్వాత అప్ప‌టికే అనంత‌పురం జిల్లా పొలిమేర‌లు దాటి వ‌చ్చిన హంద్రీనీవా ప‌నుల‌ను త‌న గ‌త ఐదేళ్ల ట‌ర్మ్ లో చంద్ర‌బాబు నాయుడు ఎందుకు ముందుకు సాగ‌నీయ‌లేదు? ప‌ట్టిసీమ చూపిన చొర‌వ‌లో పావువంతు చూపి ఉంటే.. హంద్రీనీవా కాలువ‌లు పూర్త‌య్యేవి కావా?  కుప్పానికి నీళ్లు అందేవి కావా!

ఇంత చ‌రిత్ర ఎవ్వ‌రికీ తెలియ‌న‌ట్టుగా.. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఓడిపోయాకా కుప్పానికి వెళ్లి.. నీళ్లు అందించ‌లేదంటూ మాట్లాడటం ద్వారా చంద్ర‌బాబు నాయుడు కేవ‌లం త‌న చేత‌గాని త‌నానికి త‌నే బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ప్ర‌చారం చేసుకుంటున్న‌ట్టుగా ఉన్నారు!

లోకేష్‌కు  పిచ్చి పీక్స్‌కు చేరిపోయింది

నారావారి కుటుంబంలో మాన‌సిన స‌మ‌స్య ఉంది

Show comments