చంద్రబాబు పాత్ర కొంచెమే, విలనీ జాస్తి!

నిజానికి తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు పోషిస్తున్న పాత్ర చాలా తక్కువ. అయినా సరే ఆయన మీద పడుతున్న దుష్ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంటోంది. చంద్రబాబును విలన్ గా ప్రొజెక్టు చేయడం ద్వారానే.. కాంగ్రెస్ కు పడగల ఓట్లకు కూడా గండికొట్టాలని తెరాస వ్యూహంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోందని... పొత్తుల వల్ల, తెలుగుదేశంతో కాంగ్రెస్ ఎంత మేర లాభపడుతుందో తెలియదు గానీ.. అంతకంటె ఎక్కువ నష్టం జరగడానికి మాత్రం అవకాశం ఉన్నదని అంతా అనుకుంటున్నారు.

సిద్ధిపేటలో హరీష్ రావు ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ... తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల్లో నెగ్గితే గనుక.. రాష్ట్రాన్ని తీసుకువెళ్లి చంద్రబాబు పాదాల వద్ద పెట్టేస్తుందంటూ విమర్శలు గుప్పించారు. నిజానికి కాంగ్రెస్ ను అంతగా ప్రభావితం చేసే సీన్ తెలుగుదేశానికి ఉందని ప్రజలు అనుకోవడం లేదు. కాంగ్రెస్ ఎన్ని సీట్లు ఇస్తే అన్నింటిలో పోటీచేసి.. అక్కడితో తృప్తిగా ఉండిపోవాలనే ఆ పార్టీ అనుకుంటోంది. అయినా సరే.. చంద్రబాబును విలన్ గా ప్రజల ముందు చూపిస్తేనే తమకు ఎన్నికల్లో లబ్ధి జరుగుతుందని తెరాస భావిస్తున్నట్లుగా హరీశ్ రావు మాటలను బట్టి అర్థమవుతోంది.

పైగా హరీశ్ రావు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని కూడా తన ప్రచారంలో వాడుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే.. తెలంగాణలోని పరిశ్రమలు అన్నీ అక్కడకు తరలిపోతాయంటూ బూచిని చూపించినట్లుగా చూపిస్తున్నారు. హోదా ఇస్తాం అని రాహుల్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో... ఆ మాటలను తెలంగాణలో ఓ ప్రచారాంశంగా వాడుకోవడానికి తెరాస ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి ప్రాణహితకు ఇవ్వకపోవడాన్ని కూడా హరీశ్ రావు ప్రస్తావిస్తున్నారు.

బిడ్డ చచ్చినా పురిటి వాసన పోలేదని సామెత. తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూడబోతే అచ్చంగా ఈ సామెత చందంగానే కనిపిస్తోంది. తెలంగాణలో ఆ పార్టీ కనుమరుగైపోయింది గానీ.. ప్రత్యర్థులు మాత్రం.. ఇంకా వారినే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు మరి.

Show comments