చంద్రబాబు ఒకప్పటి ముఖ్యమంత్రి: మోహన్‌బాబు

సినీ నటుడు మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మీద. అసలు చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రే కాదని తేల్చేశారు. భవిష్యత్తులోనూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే అవకాశమూ లేదని స్పష్టం చేశారు మోహన్‌బాబు. 'చంద్రబాబు ఒకప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు కాదు. ఇకపై కాబోరు' అంటూ మోహన్‌బాబు, ట్విట్టర్‌ వేదికగా చేసిన కామెంట్స్‌ ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. 

నిజానికి మోహన్‌బాబు మాటల్లో కొంత వాస్తవం లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి గనుక, ఫలితాలు వచ్చేవరకూ చంద్రబాబు జస్ట్‌ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే. కీలకమైన నిర్ణయాల్ని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తీసుకోవడానికి వీల్లేదుగానీ, ఆయన ముఖ్యమంత్రిగానే 'గౌరవాన్ని' అందుకుంటారు, ఎన్నికల ఫలితాలొచ్చేవరకు. అయితే, నైతికంగా మాత్రం చంద్రబాబు 'మాజీ' అయిపోయినట్లే. ఎన్నికల్లో గెలిస్తే, మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వొచ్చుగాక.. కానీ, చంద్రబాబుకే ఆ విషయమై పూర్తి నమ్మకం లేదాయె. 

ఇక, మోహన్‌బాబు కర్నాటకలోని మాండ్య లోక్‌సభ నియోజకవర్గ ప్రజల్ని ఉద్దేశించి చేసిన ట్వీట్‌లో చంద్రబాబు అంశాన్ని ప్రస్తావించారు. తన స్నేహితుడు అంబరీష్‌ సతీమణి అయిన సుమలత స్వతంత్ర అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన దరిమిలా, మోహన్‌బాబు ఆమెను గెలిపించాలని మాండ్య ప్రజలకు పిలుపునిచ్చారు. అంబరీష్‌తో అవసరం వున్న ప్రతిసారీ తనను అభ్యర్థించి, చంద్రబాబు ఆయన్ని రప్పించుకునేవారని మోహన్‌బాబు చెప్పుకొచ్చారు. 

'చంద్రబాబుకి కనీస విజ్ఞత లేదు. సుమలతకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు మాటల్ని విశ్వసించొద్దు..' అంటూ మాండ్య ప్రజల్ని అలర్ట్‌ చేశారు మోహన్‌బాబు. సుమలత మన తెలుగింటి ఆడపడుచే. నటిగా ఎన్నో సినిమాల్లో నటించిన సుమలత, నటుడు అంబరీష్‌ని పెళ్ళాడిన విషయం విదితమే. అంబరీష్‌, రాజకీయాల్లోనూ రాణించారు. ఇటీవల అనారోగ్యంతో ఆయన కన్నుమూసిన విషయం తెల్సిందే.