చంద్రబాబు ఖాళీ చేస్తారా.? చేయించాల్సిందేనా.!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా వున్న సమయం నుంచీ వినియోగిస్తోన్న అధికారిక నివాసంపై అప్పట్లోనే చాలా విమర్శలు వెల్లువెత్తాయి. నిబంధనలకు విరుద్ధంగా వున్న భవనంలో ముఖ్యమంత్రి నివసిస్తోంటే, పరిపాలన పట్ల ప్రజల్లో విశ్వసనీయత ఎలా కలుగుతుందంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేసిన విమర్శల్ని ఎలా మర్చిపోగలం.? ఎవరెన్ని విమర్శలు చేసినా, ఆ లింగమనేని గెస్ట్‌ హౌస్‌ని మాత్రం చంద్రబాబు విడిచిపెట్టలేదు.

అయితే, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, లింగమనేని గెస్ట్‌ హౌస్‌ విషయంలో తాజాగా మరోమారు స్పష్టతనిచ్చారు. తొలుత ప్రజా వేదికతో అక్రమ నిర్మాణాల కూల్చివేతల్ని ప్రారంభించాలంటూ నిన్ననే అధికారులకు ఆదేశాలిచ్చిన వైఎస్‌ జగన్‌, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం గురించి ఈ రోజు ప్రస్తావించారు. ఎలాంటి అనుమతులూ లేకుండా ఆ భవనం నిర్మితమైతే, అందులో ముఖ్యమంత్రి నివాసం వుండడమేంటని వైఎస్‌ జగన్‌ విస్మయం వ్యక్తంచేశారు.

మొత్తం కరకట్టని ఆనుకుని వున్న అక్రమ కట్టడాలన్నిటినీ కూల్చేయాల్సిందేనని తాజాగా మరోమారు అధికారులకు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. దాంతో, అతి త్వరలోనే చంద్రబాబు నివాసం కూడా కూల్చివేతకు గురి కాబోతోందన్న విషయం స్పష్టమవుతోంది. అయితే, టీడీపీ నేతలు మాత్రం ఇదంతా కక్షపూరిత చర్యల్లో భాగంగా నడుస్తున్న వ్యవహారమంటూ గగ్గోలు పెడుతున్నారు.

'చంద్రబాబు లేని టైమ్‌ చూసి.. ఆయన ఇంటిని పగలగొడతారా.?' అని టీడీపీ నేతలు అప్పుడే యాగీ షురూ చేశారు. ఎన్నికల్లో ఓడిపోతూనే, ఇకపై తన పెత్తనం చెల్లదన్న విషయాన్ని చంద్రబాబు తెలుసుకుని వుండాలి. ఎంతైనా సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న సీనియర్‌ పొలిటీషియన్‌ కదా.! కానీ, చంద్రబాబు ఆ విజ్ఞతను ఏమాత్రం ప్రదర్శించలేదు సరికదా.. తాను ఇంకా ఆ అక్రమ కట్టడంలోనే నివసిస్తానంటూ మొండితనం ప్రదర్శిస్తే ఎలా.?

జగన్‌ ఆదేశాల్ని అధికారులు పక్కాగా ఫాలో అయితే.. రేపట్నుంచే కూల్చివేతలు షురూ అవుతాయి. మరి, ఆ కూల్చివేతల్లో చంద్రబాబు ఇల్లు వుంటుందా.? ప్రభుత్వం స్పీడు చూసి చంద్రబాబు, తన ఇంటిని ఖాళీ చేసేస్తారా.? లేదంటే, సెంటిమెంట్‌ కోసం తనదైన స్టయిల్లో యాగీ చేస్తారా.? బలవంతంగా చంద్రబాబుతో ఆ ఇంటిని ఖాళీ చేయించాల్సి వస్తే.. తదనంతరం మారే రాజకీయ పరిణామాలు ఎలా వుండబోతున్నాయి.? వేచి చూడాల్సిందే.  

చంద్రబాబు వ్యూహాలే ఇప్పుడు ఆయనకు పాశాలా

Show comments