వాళ్లంతా వస్తున్నా.. బాబు బాగా బిజీ!!

తెలంగాణ ముందస్తు ఎన్నికలు కొన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం. కొన్ని పార్టీలకు ప్రాణసంకటం. కొన్ని పార్టీలకు మనుగడ కోసం పోరాటం. మొదటి కేటగిరీలో భారతీయ జనతా పార్టీ ఉంటే... మూడో కేటగిరీలో తెలుగుదేశం ఉంటుంది. కేంద్రంలో మోడీ హవా బలంగా ఉందని... మోడీకి దేశమంతా నీరాజనాలు పడుతూ ఉన్నదని భాజపా నాయకులు తరచూ చాటుకుంటూ ఉంటారు. తెరాసకు ప్రత్యామ్నాయం కాగల ఏకైక పార్టీ మాదే అని చెప్పుకుంటూ ఉంటారు. తెరాసను దించి.. మేం గద్దె ఎక్కుతాం అన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకే వారు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.

ఇక మూడో కేటగిరీకి చెందిన తెదేపా పరిస్థితి. ఇప్పుడు కాసిని సీట్లు సంపాదించుకోకపోతే.. ఇక ఎప్పటికీ సాధ్యం కాదు! అనేది వారి సిద్ధాంతం. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలుగుదేశం  శ్రేణులు పదేళ్లపాటూ అధికారానికి దూరంగా ఉండిపోయాయి. తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక అలాంటి దుస్థితి మరో అయిదేళ్లు కొనసాగింది. ఈలోగా పార్టీ మొత్తం తెరాస వారి వలసల వ్యూహాలకు కకావికలం అయిపోయింది. కొందరు కీలక నాయకులు మాత్రమే పార్టీలో మిగిలారు. ఇలాంటి తరుణంలో ఎంత దిగజారి అయినా సరే కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకుని మనుగడ కాపాడుకోవాలనేది వారి ప్రయాస.

ఈ రెండు పార్టీలు ఇలాంటి పరిస్థితిలో ఉండగా.. ప్రచారంలో ఎవరెంత శ్రద్ధ పెడుతున్నారనేది కీలకం.

ఒకవైపు భారతీయ జనతా పార్టీ మాత్రం పూర్తిస్థాయిలో ప్రచారం హోరెత్తించి లబ్ది పొందాలని చూస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభించి దాదాపు 50 ప్రచార సభలు నిర్వహించాలనేది వారి ఆలోచన. ఈ ఎన్నికలను పూర్తిగా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా పర్యవేక్షించబోతున్నారు. ప్రచారంలో గరిష్టంగా పాల్గొంటారు. భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ముఖ్యమైన వారందరినీ కూడా ప్రచారంలో పాల్గొనేలా చూడాలని అనుకుంటున్నారు. యూపీ, గుజరాత్ సీఎంలు తప్పక ప్రచారంలో ఉంటారని కూడా అనుకోవచ్చు. ప్రధాని మోడీ కూడా కొన్ని సభలు నిర్వహిస్తారు.

భాజపా సీఎంలు ఇందరు వస్తుండగా.. పొరుగున ఉన్న ఏపీ సీఎం మాత్రం.. తాను రానని అంటున్నారట. ప్రచార సభలకు నాకు ఖాళీ లేదు అని బాబు చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. నిజానికి బాబు తెలంగాణలో ప్రచారం అంటే భయపడుతున్నారని పలువురు భావిస్తున్నారు. తెలంగాణ లో పార్టీ కి ఎదురుకాగల ప్రతికూల ఫలితాలు.. ఏపీలో కూడా తనని దెబ్బకొడతాయని.. అసలు తాను ‘బిజీ’ సాకు చెప్పి ప్రచారానికి వీలైనంత దూరంగా ఉంటే.. నష్టాన్ని కాస్త పూడ్చుకోవచ్చునని ఆయన ఆలోచన అంటున్నారు. మరి ఈ వ్యూహాలు ఎలా సాగుతాయో చూడాలి.

RELATED చంద్ర పోటు: నొప్పి తెలిసిందా పవన్‌.?