తమ మాటలు వంచన కాదా చంద్రబాబూ!

సక్సెస్ హేజ్ మెనీ ఫాదర్స్ అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంటుంది. ఒక విజయం నమోదు అయినప్పుడు.. అదంతా తన వల్లనే జరిగిందని పగల్భాలు పలికే వారు అనేక మంది ఉంటారు. అలాంటి కుటిల విద్యలో చంద్రబాబు నాయుడు ను మించిన వారు లేరు.

చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ అనేది తన వల్లనే సాధ్యమవుతుంది అన్నట్లుగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు గప్పాలు కొడుతున్నారు. తెలుగుదేశంతో కూడిన ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం ద్వారా మాత్రమే అది అమలులోకి వస్తుందని చంద్రబాబు అంటున్నారు. సమకాలీన వ్యవహారాలను వార్తలను పరిశీలించని వారు ఎవరైనా ఉంటే ఇలాంటి కాకమ్మ కబుర్లు నమ్ముతారేమోగాని, మిగిలిన వారు చంద్రబాబు నాయుడు ఎంత మోసగాడో అబద్ధాలు చెప్పి ప్రజలను ఎలా మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటాడో ఈ మాటలతో అర్థం చేసుకుంటారు.

మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ బిల్లు ఏనాడో పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందింది. అయితే దీనిని అమలు చేయడంలో ఉండే సాధకబాధకాలను దృష్టిలో ఉంచుకుని 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి అమలులోకి తీసుకు వస్తాం అని ప్రభుత్వం అప్పట్లోనే ప్రకటించింది. ఈ బిల్లుకు అనుకూలంగా తెలుగుదేశం మాత్రమే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరిన్ని ఇతర పార్టీలు కూడా ఓటు చేశాయి.

అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఒంటరిగా సిద్ధపడే ధైర్యం లేక భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకున్న చంద్రబాబు నాయుడు.. ఎప్పుడో ఆమోదం పొందిన బిల్లు గురించి కూడా తన ఘనత అన్నట్లుగా డప్పు కొట్టుకోవడం చాలా చీప్ ట్రిక్ అనే విమర్శలు వినవస్తున్నాయి. 

Readmore!

ఈ రకంగా తనకు సంబంధం లేని విషయాలకు కూడా తాను క్రెడిట్ కోరుకోవడం అనేది చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. కంప్యూటర్ను తానే కనిపెట్టానని, బిల్ గేట్స్ కు తానే కంప్యూటర్ నేర్పించానని, బిల్ క్లింటన్ ను తానే గెలిపించానని రకరకాలుగా చంద్రబాబు నాయుడు కోతలు కోస్తుంటారని జనం జోకులు వేసుకుంటూ ఉంటారు. అలాంటి వంచనాత్మకమైన అబద్ధపు మాటలు తనకు అలవాటే అన్నట్లుగా చంద్రబాబు తాజాగా మహిళా రిజర్వేషన్ బిల్లులు తానే తీసుకువచ్చాను అనే స్థాయిలో బిల్డప్ ఇస్తున్నారు.

ప్రజలందరికీ బాగా తెలిసిన ఇలాంటి విషయాలలో కూడా అబద్ధాలు చెప్పడం అనేది ఆయన పరువు తీస్తుంది కదా అని ప్రజలు అనుకుంటున్నారు.

Show comments