జగన్ వెటకారాలు నిజం చేసేలా ఉన్న చంద్రబాబు!

చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించేలా ఎలాంటి కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారో.. ఎలాంటి బూటకపు హామీలు ఇస్తున్నారో జగన్మోహన్ రెడ్డి తన మేమంతా సిద్ధం సభల్లో ప్రస్తావిస్తూనే ఉంటారు. చంద్రబాబునాయుడు చెబుతున్న హామీలు అన్నింటినీ అమలు చేయాలంటే రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, అంత సొమ్ము ఎక్కడినుంచి తేగలరని జగన్ ప్రజలకు వాస్తవాన్ని వివరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

చంద్రబాబు హామీలను అనుకరిస్తూ.. ‘ఆయన ప్రతి ఇంటికీ కిలో బంగారం ఇస్తానంటారు.. ప్రతి ఇంటికీ బెంజికారు ఇస్తానంటారు.. కిలోబంగారం, బెంజికారు ఏది ఇచ్చినా తీసుకోండి..’ అంటూ జగన్ వెటకారం చేస్తుంటారు. ఇప్పుడు చూడబోతే జగన్ చేసే వెటకారాలను చంద్రబాబునాయుడు ఈ ఎన్నికల ప్రచార పర్వం పూర్తయ్యేలోగా నిజం చేసేలాగానే కనిపిస్తోంది.

చంద్రబాబు నాయుడు వేలంపాట రాజకీయాలు చేస్తున్నారు. జగన్ అమలు చేస్తున్న అన్ని పథకాలకూ కాస్త పాట పెంచుకుంటూ.. నేను మరింత ఎక్కువ ఇస్తా.. నాకు ఓటేయండి అని చెప్పుకుంటూ పోవడమే ఈ వేలం పాట రాజకీయం.

సంక్షేమ పథకాలు అని ట్యాగ్ చేయగల ప్రతి విషయంలో జరుగుతున్నది అదే. మూడు వేలు వచ్చే పింఛను నాలుగువేలు, వికలాంగులకైతే ఆరువేలు, బీసీలకు యాభయ్యేళ్ల నుంచే పింఛను.. ఇలా చంద్రబాబు ప్రతిదీ పెంచుకుంటూ పోవడమే ఎజెండాగా సాగుతున్నారు. ఆ దిశగా రోజుకొక విషయంలో తన పాట పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా పాయకరావు పేటసభలో ఆయన పేదలకు ఇచ్చే ఇంటిస్థలాల విషయంలోనూ పాట పెంచేశారు.

Readmore!

జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇంటిస్థలాలను తన ప్రభుత్వం రద్దు చేసేది ఉండదని, జగన్ హయాంలో ఇంటి స్థలం రాని పేదలకు తాను సీఎం అయిన తర్వాత రెండేసి సెంట్ల వంతున స్థలాలు ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికే అన్ని పథకాల విషయంలోనూ పాట పెంచి.. జాస్తిగా ఇస్తానంటూ ప్రకటించేశారు చంద్రబాబు. కానీ ఎన్నికలకు ఇంకా నెలరోజుల వ్యవధి ఉంది. ముందు ముందు ఆయన ఏం ప్రకటిస్తారు.

రోజూ ఏదో ఒక అతిశయమైన హామీ ప్రకటిస్తూ ఉండే చంద్రబాబు.. చివరికి మరేమీ మిగలక.. జగన్ వెటకారం చేస్తున్నట్టుగా.. ఇంటికి కిలోబంగారం, బెంజికారు పథకాల్ని చెప్పేసినా ఆశ్చర్యం లేదని జనం జోకులేసుకుంటున్నారు.

Show comments