ఈ రెండు భేటీలకే చంకలు గుద్దుకోవాలా?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు తెగ మురిసిపోతున్నారు. ఆయన కోటరీ మొత్తం కూడా.. బాబుగారి కార్యశూరత్వం గురించి బహుబాగా ప్రచారం చేసుకుంటూ పండగ చేసుకుంటున్నారు. చంద్రబాబునాయుడు అంతటి సమర్థుడు గనుక.. భాజపాకు వణుకు పుట్టించేలా.. అన్ని పార్టీలను ఒక్కతాటి మీదకు తీసుకువచ్చే పనిని చిటికెనవేలితో సాకారం చేస్తున్నారని వారంతా ప్రచారం చేస్తున్నారు.

అయితే ఇప్పటిదాకా ఒక భాజపా-వ్యతిరేక కూటమిని రూపుదిద్దడంలో చంద్రబాబు సాధించిన ఘనత ఎంత? కేవలం దక్షిణాదిలోని రెండు ప్రాంతీయ పార్టీలతో భేటీలు జరిపి- అక్కడితో చంకలు గుద్దుకోవడం ఎందుకో అర్థంకావడం లేదు.

చంద్రబాబునాయుడు ఢిల్లీలో పలువురు నాయకుల్ని కలిశారు. కానీ వారందరూ కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి తాము కూడా జైకొడుతున్నట్లు ప్రకటించడం మాత్రం జరగలేదు. నిజానికి మాయావతి లాంటి నాయకురాల్ని చంద్రబాబు కలిసిన తర్వాత.. ఆమె ఇంటి బయట వరకు వచ్చి.. చంద్రబాబును ఆశీర్వదించారే తప్ప.. తానుగా కాంగ్రెస్ సారథ్య కూటమిలోకి వస్తున్నట్లు ఇంకా ప్రకటించలేదు.

ఇప్పుడు బాబు- 22వ తేదీన ఢిల్లీలో అన్ని పార్టీల సమావేశం పెట్టడానికి ఉద్యుక్తులు అవుతున్నారు. ఇదంతా ఒకఎత్తు కాగా, నిర్దిష్టంగా.. ఆయన ప్రయత్నానికి మద్దతిస్తున్నట్లుగా ఆయనతో భేటీ అనంతరం ప్రకటనలు కూడా చేసినది కర్నాటకలోని డీఎంకే అధినేత స్టాలిన్, కర్నాటకలోని జేడీఎస్ అధినేత దేవేగౌడ మాత్రమే.

ఇవి బాబు సాధించిన విజయాలుగా జరుగుతున్న ప్రచారం చూస్తే నవ్వు వస్తుంది. నిజానికి ఈ రెండు పార్టీలు ఇప్పటికే కాంగ్రెస్ కూటమిలోనే ఉన్నాయి. వీరితో కలయికల ద్వారా చంద్రబాబు కొత్తగా సాధించేది ఏముంటుంది? వారు కాంగ్రెస్ కు పాతమిత్రులే కదా? అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది.

అలాంటి నేపథ్యంలో ఇక్కడికే తేను భాజపాకు దడ పుట్టించేసేలా చాలా సాధించేసినట్లు చంద్రబాబు టముకు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ సారథ్య కూటమికి మమతా బెనర్జీ జైకొడతారో లేదో క్లారిటీలేదు. మాయావతి ఇంకా తేల్చలేదు. 22న చంద్రబాబు ప్లాన్ చేసిన భేటీకి ముందుగా మమతను బతిమాలడానికి విడిగా ఆయన ఓ భేటీ పెట్టుకున్నారు.

వాస్తవంగా అయితే చంద్రబాబునాయుడు ప్రయత్నాలు ఇన్ని బాలారిష్టాల్లో ఉండగా.. పార్టీ వర్గాలు మాత్రం ఈ రెండు భేటీలను భారీగా ప్రచారం చేసుకుంటుండడమే తమాషా.

మీటూ... సంచలనంగా మొదలైందో.. అంతే చప్పున చల్లారిందా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments