చంద్రబాబు అమాయకత్వం.. అస్సలేమాత్రం తట్టుకోలేం.!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అత్యంత అమాయకత్వాన్ని ప్రదర్శించేస్తున్నారు. ఓ పక్క సుదీర్ఘ రాజకీయ అనుభవం తనకే వుందంటూ సొంత డబ్బా కొట్టుకుంటూనే, ఇంకోపక్క 'అయ్యయ్యో చంద్రబాబు ఎంత అమాయకుడో.. అలాంటి వ్యక్తి మీద ఇన్ని నిందలా.?' అన్న సింపతీ జనంలో వచ్చేయాలన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు చూస్తోంటే ఎవరైనాసరే, ముక్కున వేలేసుకోవాల్సిందే. 

అసెంబ్లీలో అధికార పక్షానికి ఎంత సమయం దొరుకుతుంది.? ప్రతిపక్షానికి ఎంత సమయం దొరుకుతుంది.? ఏ పార్టీకి సభలో సీట్ల కేటాయింపు ఎలా వుంటుంది.? ఇలాంటి విషయాలన్నీ చంద్రబాబు ఎప్పుడో ఔపోసన పట్టేశారు. 'మాకు తగినంత సమయం ఇవ్వాలి..' అని చంద్రబాబు అడగడంలో తప్పులేదు. కానీ, చంద్రబాబు అలా అడిగేందుకు అవకాశం లేకుండా, అధికార పక్షమే ముందుగా నిర్ణయం తీసేసుకుంది.. ప్రతిపక్షానికి తగినంత సమయం ఇచ్చేందుకు. 

కానీ, చంద్రబాబు తన దారిన తాను చేయాల్సిన యాగీ చేసుకుంటూ పోతున్నారు. 'సభా సంప్రదాయాలు పాటించాలి..' అంటూ పదే పదే చంద్రబాబు, అధికార పార్టీని టార్గెట్‌ చేస్తున్నారు. నిజానికి, సభలో సంప్రదాయాల్ని తుంగలో తొక్కిందే చంద్రబాబు. అప్పట్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను లాక్కుని, వారి మెడలో పచ్చ కండువాలు వేయడమే కాదు.. మంత్రులుగా అధికార పక్షంలో కూర్చోబెట్టిన చంద్రబాబు, సంప్రదాయాల గురించి మాట్లాడితే ఎలా.? 

'అప్పుడు మీరేం చేశారు.?' అని అధికార వైసీపీ నుంచి ఓ ప్రశ్న వస్తే చాలు, 'అప్పుడు మేం అలా చేశామని, ఇప్పుడు మీరు రివెంజ్‌ తీర్చుకుంటున్నారా.?' అంటూ అమాయకత్వం ప్రదర్శించేస్తున్నారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిగారిలో ఇంత గొప్ప నటుడున్నాడనే విషయం తెలియనివారెవరైనా వుంటే, ఇప్పుడాయనగారి వ్యవహార శైలిని చూసి ఆయనలోని నటుడ్ని గుర్తించి తీరాల్సిందే.