చంద్రబాబు అబద్ధాలకోరా..?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధాకోరా? కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న ఆర్థికసాయంపై ఆయన అవాస్తవాలు చెబుతున్నారా? 'అవును' అని చెప్పడానికి రుజువు దొరికింది. ఇప్పుడు దీనిపై టీడీపీ-బీజేపీ మధ్య రచ్చరచ్చ అవుతోంది. కేంద్రం రాష్ట్రానికి గత రెండేళ్లలో తగినంత ఆర్థికసాయం చేసిందని ఎవరో చెప్పింది కాదు. ఈమధ్యనే అంటే గత నెలాఖరులో పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌ కుమార్‌ చెప్పారు.

మొత్తం పరిపాలనా వ్యవహారాలను చూసుకునే ప్రధాన కార్యదర్శి చెప్పాక అది నిజం కాకుండా ఎలా ఉంటుంది? ఆయన రిటైరై వెళ్లిపోతూ తన పదవీకాలంలో సాధించిన విజయాలను, రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలను గురించి వివరిస్తూ ఓ నోట్‌ తయారుచేశారు. అది బయటపడటంతో బీజేపీ మండిపడుతోంది.

గత రెండేళ్లలో రాష్ట్రం గరిష్టస్థాయిలో కేంద్రం నుంచి ఆర్థికసాయం పొందింది. కేంద్రం అరకొర సాయం చేస్తోందని ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు, ఆయన మంత్రులు దినేష్‌ కుమార్‌ నోట్‌ను కూడా అంగీకరించడంలేదు. అన్ని రాష్ట్రాలకు సాధారణంగా చేసే సాయమేనని, ప్రత్యేకంగా సాయం చేయడంలేదని అంటున్నారు.

మాజీ ప్రధాన కార్యదర్శి తన నోట్‌లో గత రెండేళ్లలో కేంద్రం చాలా వేగంగా ఆర్థికసాయం చేసిందని పేర్కొన్నారు. యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు ఇవ్వగానే వెంటనే నిధులు విడుదల చేసిందన్నారు. అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి గత ఏడాది రాష్ట్రనికి 9,700 కోట్లు అందగా, ఈ ఏడాది 17,500 కోట్లు అందాయన్నారు.

ఈ ఏడాది సెప్టెంబరు వరకు 10,372 కోట్లు అందాయన్నారు. ఇది గత ఏడాది కంటే 33 శాతం ఎక్కువన్నారు. ఈ నిధులు అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఇచ్చారని, ప్రత్యేకంగా ఇవ్వలేదని టీడీపీ చెబుతోంది. రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏమిచ్చారని ప్రశ్నిస్తోంది.

ప్రత్యేకహోదా ఇస్తామని ఇవ్వలేదని ఆరోపించింది. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రానికి 16,500 కోట్ల లోటు బడ్జెటు ఉందని కాగ్‌ చెప్పగా కేంద్రం ఇప్పటివరకు 500 కోట్లు మాత్రమే ఇచ్చిందని టీడీపీ ఆరోపించింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గత ఏడాది డీపీఆర్‌ సమర్పించి 55 వేలకోట్లు అడగ్గా ఇప్పటివరకు దాన్ని ఆమోదించకపోవడంతో నిధులు విడుదల కాలేదని చెప్పింది.

రాజధాని నిర్మాణానికి 11,500 కోట్లు అడిగితే ఇప్పటివరకు 1500 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని తెలిపింది. టీడీపీ చెప్పినదంతా బీజేపీ ఖండించింది. కేంద్రంపై చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడింది.

Show comments