చంద్ర పోటు: నొప్పి తెలిసిందా పవన్‌.?

నమ్మించి గొంతు కోయడంలో 'నిప్పు' నారా చంద్రబాబునాయుడి గొప్పతనమేంటో సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కి కాస్త ఆలస్యంగా తెలిసొచ్చినట్టుంది. 'వద్దు పవన్‌, చంద్రబాబు వెన్నుపోటుని తట్టుకోలేవ్‌.. జాగ్రత్త..' అని ఎవరు హెచ్చరించినా, పవన్‌కళ్యాణ్‌ 'ఏం, నేనంత అమాయకుడినా.?' అంటూ ఎదురుదాడికి దిగారు. తన గురించి తాను చాలా ఎక్కువ ఊహించుకున్నారు. రాజకీయాల్లో చంద్రబాబు కారణంగా 'వెన్నుపోటు'కి గురైనవారి లెక్క తీస్తే, అది చాంతాడంత వుంటుంది.

స్వర్గీయ ఎన్టీఆర్‌ కావొచ్చు, జాతీయ పార్టీ బీజేపీ కావొచ్చు, ఎర్రదండు (అదేనండీ వామపక్షాలు) కావొచ్చు, తెలంగాణ రాష్ట్ర సమితి కావొచ్చు.. ఇంకో పార్టీ కావొచ్చు.. ఇవన్నీ చంద్రబాబు వెన్నుపోట్లకు విలవిల్లాడినవే. ఆ అనుభవంతోనే పవన్‌కళ్యాణ్‌కి చాలామంది సలహాలిచ్చారు 2014 ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత కూడా. కానీ, అప్పట్లో చంద్రబాబు 'మాయ'లో కొట్టుమిట్టాడిన పవన్‌, ఆ 'మైకం' నుంచి బయటకు రాలేకపోయారు. బయటకొచ్చాక.. పవన్‌కళ్యాణ్‌కి 'చంద్ర పోటు' తాలూకు నొప్పి ఏంటో తెలుస్తోంది.

తాజాగా చెన్నయ్‌ వెళ్ళిన పవన్‌, అక్కడినుంచి తాను వెన్నుపోటుకి గురైన విషయాన్నీ, చంద్రబాబులోని 'రెండు కోణాల్నీ' తలచుకుంటూ ఆవేదన చెందారు. 'చంద్రబాబు ఎప్పుడు శతృవుగా వ్యవహరిస్తారో, ఎప్పుడు మిత్రుడిలా వ్యవహరిస్తారో అర్థం చేసుకోలేం. తనకు ఎలాక్కావాలంటే అలా చంద్రబాబు మార్చేసుకుంటారు.. చంద్రబాబుకి విలువల్లేవ్‌.. విశ్వాసం లేదు..' అంటూ పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యానించడంతో ఎవరూ పెద్దగా అవాక్కవలేదుగానీ, కాస్త లేటుగా పవన్‌కళ్యాణ్‌కి జ్ఞానోదయం అయ్యిందని మాత్రం అనుకుంటున్నారు.

'చంద్రబాబుతో స్నేహం వద్దు మొర్రో..' అని స్వయానా చిరంజీవే, చెప్పినా పవన్‌కళ్యాణ్‌ వినలేదాయె. అన్నయ్య మాటని సైతం తమ్ముడు పవన్‌ లెక్క చేయనంతగా చంద్రబాబు తనదైన 'మాయ'లో ఇరికించేశారు మరి. రెండు మూడేళ్ళ క్రితం చంద్రబాబు గురించి పవన్‌కళ్యాణ్‌ తెలుసుకుని వుంటే, తెలుసుకుని.. రాజకీయంగా తన పంథా మార్చుకుంటే పరిస్థితి ఇంకోలా వుండేదేమో. అఫ్‌కోర్స్‌.. చంద్రబాబు మాయలో పడి, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరించిన పవన్‌.. ఇప్పుడు తాను వెన్నుపోటుకు గురయ్యానంటూ 'నొప్పి'తో విలవిల్లాడటంలో అర్థం లేదనుకోండి.. అది వేరే విషయం.

Show comments