కేసీఆర్‌ బాటలో చంద్రబాబు..!

ఉమ్మడి ఆంధ్రా విడిపోయినప్పటి నుంచి పరిపాలన, పథకాల విషయంలో చంద్రబాబు, కేసీఆర్‌ ఒకరినొకరు కాపీ కొట్టుకోవడం జరుగుతూనే ఉంది. తెలంగాణలో ఓ మంచి పథకం ప్రవేశపెట్టి కేసీఆర్‌ ఆదరణ పొందితే, అలాంటి పథకాన్నే చంద్రబాబు ప్రవేశపెట్టిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఎన్నికల విషయంలోనూ కేసీఆర్‌ను అనుసరిస్తే మంచిదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు సమాచారం. ఇంతకూ ఇది ఏ విషయంలో అనుకుంటున్నారా?

అభ్యర్థులను ప్రకటించే విషయంలో. ప్రతిపక్షాలను కంగుతినిపించడమే కాకుండా చావుదెబ్బ కొట్టాలనే లక్ష్యంతో కేసీఆర్‌ చాలా జాగ్రత్తగా మూడోకంటికి తెలియకుండా పావులు కదిపి హఠాత్తుగా ముందస్తు ఎన్నికలు ప్రకటించడమే కాకుండా 105 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించేసి ప్రతిపక్షాలు తత్తరపడేలా చేశారు. జాబితా ప్రకటించిన వెంటనే మీ నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారం ప్రారంభించండి అని అభ్యర్థులను ఆదేశించారు. తాను కూడా పెద్ద ప్రచారసభ నిర్వహించారు. ఈవిధంగా ప్రచారంలోకి చాలావేగంగా దూసుకెళ్లారు.

తెలంగాణ ఎన్నికల్లోకి ప్రత్యక్షంగా వచ్చే ధైర్యం చేయలేని చంద్రబాబు నాయుడు ఇదంతా గమనించి డంగైపోయి తాను కూడా ఇదేమార్గం అనుసరించాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఏపీలో షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయనే సంగతి తెలిసిందే కదా. ఎన్నికలకు కనీసం మూడునెలల ముందే టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల (మంత్రులు సహా) పనితీరుపై అధ్యయనం చేస్తున్నారు.

సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో ఎంతమందిని మార్చాలనే విషయమై ముందే నిర్ణయం తీసుకుంటారట. ఇప్పటినుంచే ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోవాలని, నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. అలాగే బీజేపీ-వైకాపా మధ్య అపవిత్ర, అనైతిక పొత్తు ఉన్నట్లు జనాల్లో బాగా ప్రచారం చేయాలన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వని బీజేపీతో వైకాపా పొత్తు పెట్టుకొని రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని జనం మనసుల్లో నాటుకోవాలనే చంద్రబాబు ఉద్దేశం. సాధారణంగానే అధికారులను పరుగులెత్తించే చంద్రబాబు ఇప్పుడు మరింత వేగంగా పనిచేయాలని వారిని ఆదేశించారు.

రాష్ట్రంలో విస్తృతంగా తిరిగి ప్రభుత్వ పథకాలపై ప్రజాభిప్రాయం తెలుసుకోవాలని ఆదేశించారు. సంక్షేమ పథకాలు ప్రజలకు నిజంగా ప్రయోజనం కలిగిస్తున్నాయా, వారు ఆ పథకాల అమలు పట్ల సంతోషంగా ఉన్నారా అనే విషయంలో సమాచారం అందించాలన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి అనేక పథకాలపై సమీక్షలు చేస్తున్నారు. పథకాల అమలు విషయంలో జాగ్రత్తగా ఉండాలని మంత్రులను హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ గెలిచి, ఆంధ్రాలో తాను గెలవకపోతే బాబుకు పరువు పోయినట్లుగా ఉంటుంది. అందుకే ఇప్పటినుంచే పరుగులు పెడుతున్నారు.

Show comments