తాను మునిగి.. టోటల్ గా కూటమిని ముంచి

కలలో కూడా ఊహించని పొత్తు అది. ఏ పార్టీపై వ్యతిరేకతతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో, చుట్టూతిరిగి అదే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు అక్రమ సంబంధం పెట్టుకున్నారు. మిగతా పార్టీలను కూడా కలుపుకొని మహాకూటమిగా ఏర్పడ్డారు. ఆ అక్రమ సంబంధ ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పేరుకే ఇది మహాకూటమి తప్ప లోపలంతా లొసుగులమయం అనే విషయం తేటతెల్లమైంది.

మరీ ముఖ్యంగా మహాకూటమి పరాజయానికి ప్రధాన కారణం చంద్రబాబు ఎంట్రీ ఇవ్వడమే అనే విషయం ఇక్కడ సుస్పష్టం. విభజన సమయంలో రెండు నాల్కల ధోరణిని అవలంబించిన టీడీపీతో కాంగ్రెస్ దోస్తీ కట్టడాన్ని తెలంగాణ ప్రజలు తట్టుకోలేకపోయారు. బాబు రాకతో టీఆర్ఎస్ పార్టీ ఎత్తుకున్న ఆత్మగౌరవ నినాదానికి మరింత బలం చేకూరింది. దాని ఫలితమే ఇది.

తమ కంచుకోటగా చెప్పుకునే స్థానాల్లో కూడా కాంగ్రెస్ ఓటమి దిశగా ఉండడం కచ్చితంగా చంద్రబాబు దెబ్బగానే భావించాలి. కాంగ్రెస్ ముఖ్యనేతలంతా చంద్రబాబుకు సాగిలపడడం, అమరావతి కేంద్రంగా మహాకూటమి అభ్యర్థుల జాబితా తయారైందనే ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు నమ్మారు.

దీనికితోడు ప్రచారంలో భాగంగా తెలంగాణ గడ్డపై చంద్రబాబు చేసిన రెచ్చగొట్టే ప్రసంగాల్ని, బాబు నిలబెట్టిన అభ్యర్థుల్ని ప్రజలు నమ్మలేదు. తాజా ఫలితాల వల్ల చంద్రబాబు పట్ల తెలంగాణ ప్రజల్లో ఎలాంటి విశ్వసనీయత లేదని అర్థమైపోయింది.

హైదరాబాద్ ను తనే ప్రపంచపటంలో నిలబెట్టానన్న చంద్రబాబు పాతచింతపండు డైలాగ్స్ ను ప్రజలు నమ్మలేదు. దీనికితోడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కాంగ్రెస్ తో చేతులు కలిపామంటూ బాబు చెప్పిన సినిమా డైలాగులు అస్సలు పనిచేయలేదు.

ఓవరాల్ గా తెలంగాణ ప్రజలు చంద్రబాబుకు తాజా ఎన్నికల ద్వారా గట్టిగా బుద్ధిచెప్పారు. ఖమ్మంలో 2 నియోజకవర్గాలు మినహా మిగతా ఎక్కడా తెలుగుదేశం పార్టీకి సానుకూలత లేదంటే, తెలంగాణలో టీడీపీ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

మొత్తమ్మీద తెలంగాణలో చంద్రబాబు తను మునగడంతో పాటు.. టోటల్ కూటమినే నిండా ముంచేశారు. 

Show comments