పోలవరం అంచనా వ్యయం అదే.. కేంద్రం ఆమోదం!

పోలవరం ప్రాజెక్ట్‌ సవరించిన అంచనా వ్యయం ప్రతిపాదనకు ఎట్టకేలకు కేంద్రం పచ్చజెండా ఊపింది. 2017-18 నాటి ధరల ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్ట్‌ అంచనా వ్యయాన్ని 55 వేల 548 కోట్లుగా కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. రాజ్య సభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జల శక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ రతన్‌ లాల్‌ కటారియా రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు.

గత ఏడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి సవరించిన అంచనా వ్యయం ప్రతిపాదనలను కేంద్ర జల వనరుల సంఘానికి సమర్పించింది. జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సలహా సంఘం ఈ ప్రతిపాదనలను పరిశీలించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 11న జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన సవరించిన అంచనా వ్యయం ప్రతిపాదనను ఆమోదించడం జరిగింది. 2017-18 ధరల ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్ట్‌కు సవరించిన అంచనా వ్యయం 55548.87 కోట్లుగా నిర్ధారించి ఆ మేరకు ఆమోదం తెలిపినట్లు మంత్రి వెల్లడించారు.

సవరించిన అంచనా వ్యయం ప్రకారం పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు 4318.97 కోట్లు, ఎడమ ప్రధాన కాలువకు 4202.69 కోట్లు, హెడ్‌ వర్క్స్‌కు 9734.34 కోట్లు, పవర్‌ హౌస్‌ పనులకు 4124.64 కోట్లు, భూ సేకరణ, పునరావాసం, పునర్నిర్మాణ పనులకు 33168.23 కోట్ల రూపాయలు అంచనా ఖర్చులకు ఆమోదం తెలిపినట్లు మంత్రి వివరించారు.

కేంద్ర సాయం 6764 కోట్లు...
పోలవరం ప్రాజెక్ట్‌లోని వివిధ విభాగాల పనుల నిర్వహణ నిమిత్తం 2014 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ, కేంద్ర జల వనరుల సంఘం ఆమోదం మేరకు కేంద్ర సహాయం కింద 6764.16 కోట్ల రూపాయలు విడుదల అయినట్లు మంత్రి వెల్లడించారు. తదుపరి నిధుల విడుదల కోసం 2014 మార్చి 31 వరకు చేసిన ఖర్చుకు సంబంధించి ఆడిట్‌ నివేదిక సమర్పించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికి రెండు సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

ఆడిట్‌ నివేదిక సమర్పించిన తర్వాత మాత్రమే తదుపరి నిధుల విడుదల జరగుతుందని మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్‌ పనులకు జీఎస్టీ వర్తింపచేస్తున్నారు. పోలవరం పనులకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన తమకు అందలేదని మంత్రి కటారియా చెప్పారు.

అమరావతి రింగ్‌ రోడ్డు ఎంవోయూకు సిద్ధం
విజయవాడ/అమరావతి చుట్టూ రింగ్‌ రోడ్డు అభివృద్ధి చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీ తెలిపారు. సోమవారం రాజ్య సభలో వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ అమరావతిలో రింగ్‌ రోడ్డు అభివృద్ధి చేసే ప్రాజెక్ట్‌కు తాము ఏనాడో ఆమోదం తెలిపామని చెప్పారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన భూసేకరణ జరగనందున ప్రాజెక్ట్‌ పనులు ఆరంభం కాలేదని తెలిపారు.

భూసేకరణ ఖర్చును నూరు శాతం భరించడానికి తొలుత అంగీకారం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఈ వ్యయంలో 50 శాతం కేంద్రమే భరించాలని అభ్యర్ధించింది. నాటి ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనకు అంగీకరించినప్పటికీ ప్రభుత్వం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొత్త ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌పై ముందుకు వస్తే వారితో ఎంవోయూ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని గడ్కరీ సభకు తెలియచేశారు.

అలాగే అమరావతి-అనంతపురం గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే 384 కిలోమీటర్ల మేర నిర్మించాలని ప్రతిపాదించాం. ఈ ప్రాజెక్ట్‌ భూసేకరణకు అయ్యే ఖర్చులో 50 శాతం కేంద్రమే భరిస్తుంది. ప్రాజెక్ట్‌కు అవసరమైన పర్యావరణం, అటవీ, వన్యప్రాణుల మొదలైన చట్టపరమైన అనుమతులను మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే తెచ్చుకోవలసి ఉంటుందని ఆయన చెప్పారు.     

చంద్రబాబు వ్యూహాలే ఇప్పుడు ఆయనకు పాశాలా

Show comments