సినిమా రివ్యూ: తెనాలి రామకృష్ణ

సమీక్ష: తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్‌.
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: ఎస్‌ఎన్‌ఎస్‌ క్రియేషన్స్‌
తారాగణం: సందీప్‌ కిషన్‌, హన్సిక మోత్వాని, వరలక్ష్మి శరత్‌కుమార్‌, మురళి శర్మ, సప్తగిరి, ప్రభాస్‌ శ్రీను, వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళి, అయ్యప్ప శర్మ, రఘుబాబు, అన్నపూర్ణ తదితరులు
కథ: రాజసింహ
మాటలు: భవాని ప్రసాద్‌, నివాస్‌
సంగీతం: సాయి కార్తీక్‌
కూర్పు: చోటా కె. ప్రసాద్‌
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌
నిర్మాతలు: అగ్రహారం నాగిరెడ్డి, కె. సంజీవ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ ఇందుమూరి, రూప జగదీష్‌
కథనం, దర్శకత్వం: జి. నాగేశ్వరరెడ్డి
విడుదల తేదీ: నవంబర్‌ 15, 2019

వాదించడానికి కేసులు రాక, 'ఒక కేసు వాదిస్తే మరొకటి ఫ్రీ' అంటూ ఎన్ని ఆఫర్లు పెట్టినా ప్రాక్టీస్‌ లేక, చివరకు వాదించడం మానేసి కోర్టు బయట కాంప్రమైజ్‌లు చేసుకునే 'చెట్టుకింద ప్లీడర్‌' లాంటి హీరో తెనాలి రామకృష్ణ. ఈ క్యారెక్టరైజేషన్‌ వింటే వెంటనే మనకి స్ఫురణకి వచ్చే హీరో అల్లరి నరేష్‌. కానీ జి. నాగేశ్వరరెడ్డి అలా ఆలోచించకుండా సందీప్‌ కిషన్‌తో 'బిఏ.బిఎల్‌.' చేయించాడు. సందీప్‌ కిషన్‌ ఏమో అల్లరి నరేష్‌ తరహా సినిమాలా కాకుండా దీన్నో మహేష్‌బాబు సినిమాలా మార్చేసాడు. ఒక తెలివైన వీక్‌ లాయర్‌, ఒక కిరాతకమైన పవర్‌ఫుల్‌ పొలిటీషియన్‌ని ఢీకొంటే కాస్త ఆసక్తికి చోటిచ్చినట్టయ్యేది. అలా ఇవ్వడం దర్శకుడికి, కథానాయకుడికీ నచ్చలేదో ఏమో... ఈ కథని కనీస ఆసక్తి కూడా కలిగించని విధంగా మార్చడానికి ఎలా వీలుందో అలా పట్టుబట్టి మరీ మార్చేసారు.

ఎప్పుడయితే మామిడి తోటలో చొక్కా మడతేసి అంతమంది రౌడీలని నేలకేసి బాదేసాడో... అక్కడే కామెడీ అవ్వాల్సిన తెనాలి రామకృష్ణ కాస్తా తెలుగు సినిమా హీరో రామకృష్ణ అయిపోయాడు. పాత చింతకాయ కథని తీసుకుని దానికి కాంటెంపరరీ పొలిటికల్‌ సెటైర్లు జోడిస్తే కొత్త ఆవకాయ కాదని నాగేశ్వరరెడ్డి గ్రహించలేకపోయాడు. దీంతో కామెడీ సినిమాగా ప్రచారం పొందిన ఈ చిత్రంలో హాస్యం జాడలు వెతుక్కోవాల్సి వచ్చింది. ఎక్కడైనా ఓ జోకు చెవిన పడితే అదే ఒక అరగంటసేపు నెమరు వేసుకుంటే తప్ప కాలక్షేపం కానంత నిండైన వినోదం పండింది. ఒక చెట్టుకింద ప్లీడరు ఒక పెద్ద కేసుని పట్టి హీరోగా మారడమనేది చాలా రొటీన్‌ పాయింట్‌. దీనిని ఇంకెంత రొటీన్‌గా చెప్పవచ్చని రచయితలతో కలిసి గట్టిగా కృషి చేసినట్టున్నాడు జి. నాగేశ్వరరెడ్డి. ఎక్కడైనా పొరపాటున కొత్తదనం ఎటునుంచి అయినా జారి కథలో పడితే దానిని తీసి కనిపించనంత దూరానికి విసిరేసారనిపిస్తుంది.

అనేకానేక పాత్రలు వండితే... మాటల్ని పాటలుగా పాడే సత్యకృష్ణన్‌ చేసిన పాల్‌ క్యారెక్టరొకటీ కాస్త పండింది. నవ్వించడానికి నలభై విధాలుగా ట్రై చేస్తే ఒక నాలుగైదు సార్లు నవ్వొచ్చింది. ఇదే చిత్రాన్ని అల్లరి నరేష్‌ చిత్రం తరహాలో చేసినట్టయితే, హీరోని కండబలం వాడే వాడిలా కంటే బుద్ధి బలం చూపించే లాయర్‌లా చూపించినట్టయితే ఖచ్చితంగా ఇంతకంటే చాలా మెరుగ్గా వుండేది. అలాగే విలన్‌కి లుక్స్‌ పరంగా తీసుకున్న శ్రద్ధలో సగమయినా ఆ పాత్ర చిత్రణలో పెట్టినట్టయితే కార్టూన్‌లా కనిపించనివ్వకుండా వుండే అవకాశముండేది. ఒకానొక టైమ్‌లో ఇక ఈ చిత్రాన్ని నిలబెట్టాలంటే జబర్దస్త్‌ తరహా కామెడీ చేయాల్సిందేనంటూ చమ్మక్‌ చంద్రని లేడీ గెటప్‌లో దించి ద్వందార్థ సంభాషణలు చెప్పించాల్సి వచ్చింది. హీరో అయిన సందీప్‌ కిషన్‌ని కూడా కనిపించనివ్వకుండా చేసి కమెడియన్లతో పావుగంట నడిపించినా కానీ అనవసరపు శ్రమ తప్ప హాస్యానికి తావు లేకపోయింది.

సందీప్‌ కిషన్‌ వివిధ జోనర్లు ట్రై చేస్తూ ఈసారి కామెడీ వైపు వచ్చాడు కానీ... ఇందులో తనని హీరోలా చూపించకుండా తనే అడ్డు పడి వుండాల్సింది. పూర్తి కామెడీ హీరో తరహా పాత్ర చేసినట్టయితే ఈ ప్రయత్నానికి కాస్తయినా ఫలితముండేది. హన్సిక నటన రాకపోయినా గ్లామర్‌తో ఇన్నాళ్లు నెట్టుకొచ్చేసింది కానీ ఇప్పుడు అదీ కళ తప్పింది. వరలక్ష్మి శరత్‌కుమార్‌ రెప్పలాడించకుండా విలనీ చూపించే ప్రయత్నంలో సగం డైలాగులు నమిలేసింది. మురళి శర్మ పాత్ర పరమ రొటీన్‌గా వుంటే, సప్తగిరి, వెన్నెల కిషోర్‌ల వల్ల అడిషినల్‌ ఫుటేజీ తప్ప కామెడీ కరువయింది.

సాయి కార్తీక్‌ డెబ్బయ్‌ అయిదవ చిత్రంలో తన పనితనం 'వినిపించాలనే' తపనలో అవసరానికి మించి ఎఫర్ట్స్‌ పెట్టడం వల్ల బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ పలుమార్లు శ్రుతి మించింది. 'పేద ప్రజలకి ఇళ్ల పట్టాలు పంచినట్టు ఈమెకి లాయర్‌ పట్టా పంచేసినట్టున్నారు' లాంటి ఒకటీ అరా డైలాగులు పేలాయి. కోడికత్తి, జైలుకెళ్లిన నాయకుల పొలిటికల్‌ ఫ్యూచర్‌ నాగార్జున సిమెంట్‌తో కట్టినంత స్ట్రాంగ్‌గా వుంటుంది, సహజీవనం చేసి సెటిల్‌మెంట్‌ చేసుకోవడం లేటెస్ట్‌ ఫ్యాషన్‌ లాంటి కాంటెంపరరీ విషయాలతో పండించిన హాస్యం ఓకే అనిపిస్తుంది. సాంకేతిక విభాగంలో సాయి శ్రీరామ్‌ ఛాయాగ్రహణం ఒక్కటీ స్కోర్‌ చేస్తుంది. నాగేశ్వరరెడ్డి ఆలోచనలు, దర్శకత్వ శైలి ఎప్పుడో కీప్యాడ్‌లతో కూడిన నోకియా ఫోన్ల కాలంలోనే అప్‌డేట్‌ కాకుండా అలా వుండిపోయింది.

కాలం చెల్లిపోయిన కథ, కామెడీతో ఇప్పటి మాస్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకోవచ్చు అనుకోవడమూ అత్యాశే అనాలి. పది నిమిషాల పాటుండే జబర్దస్త్‌ స్కిట్‌ పండించడానికే చాలా ఎఫర్ట్స్‌ పెడుతూ, క్రియేటివిటీ చూపిస్తోన్న రోజులివి. చేతి వేళ్ల చివర ప్రపంచం నలుమూలల నుంచీ కాంటెంట్‌ని ఎంచుకుని మరీ ఎంటర్‌టైన్‌ అవుతోన్న టైమ్‌లో ఇంకా ఈ ముతక కామెడీలతో థియేటర్లకెలా వస్తారు తెనాలీ?

బాటమ్‌ లైన్‌: ఔట్‌డేటెడ్‌ కామెడీ!

- గణేష్‌ రావూరి