బురద చల్లే చాన్స్ పోయిందని చంద్రబాబు బాధ!

గోబెల్స్ ఒక్కడే ఆయనకు మార్గదర్శి. అదే పనిగా బురద చల్లుతూ ఉంటే.. కొంతకాలం గడిచిన తర్వాతైనా సరే ప్రజలు నమ్మకుండా ఉంటారా? అనేది ఆయన ఆశ. అందుకే ఎడాపెడా జగన్మోహనరెడ్డి మీద అర్థం పర్థం లేని విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. బురద చల్లుతూ ఉంటారు. తానొక్కడూ బురద చల్లడం చాలదనే ఉద్దేశంతో.. తనకు కొమ్ముకాసే  మీడియా సంస్థల నుంచి కూడా సాయం తీసుకుంటూ ఉంటారు. మరి ఆయన ప్రయత్నాలకు గండిపడితే.. ఆక్రోశం రాక ఏమవుతుంది?

అందుకే చంద్రబాబునాయుడు ... మీడియా స్వేచ్ఛ ముసుగులో... ఇప్పుడు చాలా పెద్ద రాద్ధాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మంచిచెడుల సంగతి పక్కన పెడితే ఇవాళ మీడియా సంస్థలు పార్టీలకు కరపత్రాలుగా.. గ్రూపులు గ్రూపులుగా విడిపోయి ఉన్నాయి. చంద్రబాబునాయుడు అధికారం వెలగబెట్టినప్పుడు.. ఆయన ప్రత్యర్థి పత్రికలకు ఎలా ఇబ్బందులు వచ్చాయో... ఇప్పుడు పచ్చ పత్రికలకు కూడా అంతే గడ్డు పరిస్థితి ఉంది. ప్రభుత్వం ద్వారా దండుకోగల వారి ఆదాయం పలచబడింది. ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. మరి చంద్రబాబునాయుడుకు కూడా ఈ పరిణామాలపై చాలా ఆవేదనగా ఉంది.

అందుకనే.. మీడియా స్వేచ్ఛకు ఏ విధంగా కళ్లెం వేయని.. విచ్చలవిడితనానికి మాత్రమే అడ్డుకట్ట వేసే జీఓనెంబర్ 2430 మీద ఆయన ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఆధారాలు లేకుండా.. అవాకులూ చెవాకులు పత్రికల్లో రాసేస్తే.. వారిని సంజాయిషీ అడిగే, వారి మీద కేసులు పెట్టే అవకాశాన్ని మాత్రమే జీవో 2430 కల్పిస్తుంది. నిజానికి ఇది కొత్తదేమీ కాదు. గతంలో కూడా తప్పుడు వార్తలు రాస్తే.. కోర్టుల్లో కేసులు పెట్టగల అవకాశం పుష్కలంగా ఉంది. కాకపోతే.. ఇప్పుడు దానిని వ్యవస్థలకు కూడా వర్తింపజేస్తూ మరింత పటిష్టం చేశారు.

సాధారణంగా ఇన్నాళ్లూ వ్యక్తులు అలాంటి పరువునష్టం కేసులు వేస్తుండేవాళ్లు.. ప్రభుత్వం ఎవరేం తప్పుడు వార్తలు రాసినా.. ఎందుకులే మీడియాతో పెట్టుకోవడం అనే ఉపేక్షధోరణితో ఉండేది. జగన్ కేవలం దాన్ని చట్టం చేశారంతే. అంతే తప్ప ఇందులో మీడియా స్వేచ్ఛకు ఎలాంటి హాని లేదని.. లోతుగా చూస్తే అర్థమవుతుంది. తప్పుడు వార్తలు రాయడం మీదనే బతకాలని కోరుకునే వారికి మాత్రం కంటగింపుగా ఉంటుంది. వారికోసం ఆరాటపడే చంద్రబాబుకు కూడా దుఃఖం తన్నుకొస్తున్నట్లుగా ఉంది.

Show comments