ఎమ్బీయస్‌: ప్రజాకూటమికి 65 వస్తాయా?

రాజగోపాల్‌ సర్వే ఫలితాలు వెల్లడించాక, చాలా చర్చే జరుగుతూ వచ్చింది. 8-10 స్వతంత్రులు గెలుస్తారని ముందు చెప్పారు. ఆ తర్వాత మొత్తం 10 పాత జిల్లాలలో 4టిలో కూటమి, 3టిలో తెరాస, ఒక దానిలో మజ్లిస్‌ లీడ్‌లో ఉండగా, రెండింటిలో హోరాహోరీ ఉందని చెప్పారు. 68% కంటె ఓటింగు శాతం పెరిగిందంటే అది అధికార పార్టీకి ముప్పేననీ, ప్రజా ఫ్రంట్‌ గెలుస్తుందని అన్నాడాయన. 68% కంటె తక్కువ ఓట్లు పోలయితే హంగ్‌ వస్తుందన్నారు. ఎప్పుడైతే కెటియార్‌ దాన్ని కొట్టి పడేశారో, దానికి సమాధానం యిస్తూ లగడపాటి ప్రభుత్వవ్యతిరేకతకు కారణాలివి అంటూ బోల్డు ఏకరువు పెట్టారు.

గతంలో టిడిపికి 20% ఓట్లు ఉండగా అది చాలావరకు తెరాసకు మళ్లిందని, కాంగ్రెసు తోడు దొరకడంతో అది మళ్లీ ప్రజాకూటమికి చేరుతోందని కూడా అన్నారు. 65% ఎమ్మేల్యేలపై వ్యతిరేకత ఉందని తన సర్వేలో తేలిందని చెప్పారు. గత 15 రోజుల్లో ఓటర్ల మనోగతంలో శరవేగంగా మార్పు వచ్చిందన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ తర్వాత అంకెలు చెప్పేశారు. ప్రజాకూటమికి 65 ప్లస్‌ ఆర్‌ మైనస్‌ 10 అనీ, తెరాసకు 35 ప్లస్‌ ఆర్‌ మైనస్‌ 10 అనీ చెప్పారు. మజ్లిస్‌కు 6-7, బిజెపికి 7 ప్లస్‌ ఆర్‌ మైనస్‌ 2, స్వతంత్రులు 7 ప్లస్‌ ఆర్‌ మైనస్‌ 2 అనీ అన్నారు. ఈ అంకెలు చెప్పడానికి ముందు రోజే తెరాస బాగా దెబ్బ తిందని, కూటమి బాగా పుంజుకుందని చెప్పారు. 80% జిల్లాలలో కూటమిదే ముందంజ అన్నారు.

దీనికితోడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా తెరాస బాగా డీలా పడిపోయిందని రాస్తున్నారు. ఇవన్నీ చూస్తే ఫలితాలపై ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటిదాకా తెరాస ఎలాగూ గెలుస్తుందని అనుకుంటూ పట్టించుకోని వారు సైతం ఏవిటి, కూటమి గెలుస్తుందా? నిజమేనా? అని మేల్కొని చూసేట్లు ఉంది. నిజానికి కెసియార్‌కు నియంత పోకడలు, కుటుంబపాలన, ఏకపక్ష నిర్ణయాలు, ప్రచారార్భాటం గమనించినవారికి యీ అంచనాలు చాలా సంతోషాన్నిస్తాయి. బోల్డు ప్రజాధనం ఖర్చు పెట్టి, ముందస్తు ఎన్నికలకు వెళ్లినందుకు మాబాగా అయింది అని చంకలు గుద్దుకునేట్లు చేస్తుంది. రాబోయే పాలకులకు కూడా కెసియార్‌ పాలన ఒక గుణపాఠంగా నిలుస్తుంది. కెసియార్‌తో అంటకాగుతున్న బిజెపి కంగు తిన్నట్లు అవుతుంది. ఇక్కడ కాంగ్రెసు గెలుపు మోదీ వ్యతిరేకులను ఉత్సాహపరుస్తుంది.

అయితే ప్రజా కూటమి నిజంగా పుంజుకుందా? అయితే ఏ మేరకు అని ఆలోచించడానికే యీ రచన. గతంలో నేను తెరాసకు 80కు 5 అటూ, యిటూగా వస్తాయని రాసినపుడు చాలామంది టిడిపి అభిమానులు విరుచుకుపడ్డారు. కెసియార్‌ అధ్వాన్న పరిపాలనను వెనకేసుకుని వస్తున్నావన్నారు. బాబు తనే తెరాసతో జట్టు కట్టాలని ఉవ్విళ్లూరారని వారు మర్చిపోయారు. ఆ విషయం బాబే స్వయంగా చెప్పుకున్నారు. ఆ సందర్భమేమిటో కెటియార్‌ యిప్పుడు చెప్పేశారు కూడా. హరికృష్ణ పోయినప్పుడు వెళితే, బావమరిది శవం దగ్గర రాజకీయాలు మాట్లాడారని, పొత్తు ప్రస్తావన తెచ్చారని చెప్పారు. బాబు యిప్పుడు కెసియార్‌ను నియంత, అతని పాలన ఘోరం వగైరా వగైరా చాలా అంటున్నారు. మరి అలాటి పాలకుడితో పొత్తు కోసం ఎందుకు వెంపర్లాడినట్లు? నాతో పొత్తు కాదని బిజెపితో పెట్టుకున్నాడని ఎందుకు వాపోయినట్లు?

టిడిపి, తెరాసల మధ్య పెళ్లి కుదర్చడానికి చాలామంది పేరయ్యలే పని చేసినట్లున్నారు. లగడపాటి 'మీరు కలిస్తే వార్‌ వన్‌సైడ్‌ అయిపోతుంది అని చెప్పా' అని వెల్లడించారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా నవంబరు 3 నాటి ''కొత్తపలుకు''లో యిదే మాట అన్నారు. టిడిపి-తెరాస కలిస్తే వార్‌ వన్‌సైడే అని. టిడిపికి ఆరేడు సీట్లు యిచ్చి వుంటే సరిపోయేది అని కూడా అన్నారు. కేవలం ఆరేడు సీట్లు టిడిపికి ఎవరిస్తే వాళ్లే విజేతలు, కాకపోతే పరాజితులు అని వీరి భావం. కేవలం ఆరేడు సీట్లలో పోటీ చేయగల సత్తా మాత్రమే ఉన్న పార్టీకి యింత ప్రాధాన్యత యివ్వడం వలన వీరి మాటలపై నాకు విశ్వాసం కలగడం లేదు. నాకు తెరాస అంటే ఎంత వ్యతిరేకత ఉన్నా యిప్పటికీ నేను తెరాసకు సంపూర్ణ మెజారిటీ వస్తుందనే నమ్ముతున్నాను.

గతంలో 80కు అటూ, యిటూ అనుకున్నాను. ఇటీవల కెసియార్‌ స్వరంలో మార్పు గమనించాక 70కి 5 అటూ, యిటూ అనుకుంటున్నాను. స్థానిక ఎమ్మేల్యేల పట్ల వ్యతిరేకత తెరాసకు పెద్ద మైనస్‌ పాయింటు అని ప్రముఖంగా చెప్తున్నారు. బయటా అదే వినబడుతోంది. అయినా లగడపాటి చెప్పినంతగా 65% ఉండకపోవచ్చు. కానీ వీటన్నిటినీ అధిగమించేది పార్టీ అధినాయకుడి యిమేజి. ఆంధ్రలో కూడా ఎమ్మేల్యేల పని తీరు బాగా లేదని రిపోర్టులు వస్తూనే ఉంటాయి. కొంతమంది 'తటస్థ' మేధావులు బలే తమాషాగా రాస్తూ ఉంటారు. ఆంధ్రలో ఎమ్మేల్యేల అవినీతి పెరిగింది, మంత్రుల్లో చాలామంది అవినీతిపరులున్నారు. అధికారుల్లో అలసత్వం, అవినీతి పెరిగాయి. అయినా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు కాబట్టి ఆయన్ను సమర్థించాలి అంటారు.

చుట్టూ యింతమంది అవినీతి పరులను పెట్టుకుని, పెంచి పోషిస్తున్న వ్యక్తిని ఏమనడానికి నోరు రాదు వాళ్లకి. 'రాజకీయాలు కుళ్లిపోయాయి, అందరూ చెడిపోయారు. ఉన్నవాళ్లలో బాబు మెరుగు కాబట్టి ఆయన్ని గెలిపించాలి' అని ముక్తాయిస్తారు. నింద వేయాల్సి వచ్చినపుడు పక్కవాళ్లను నిందించి, ఆయన్ను కాపాడతారు. రేపు ఆంధ్రలో ఎన్నికలు జరిగినపుడు స్థానిక ఎమ్మేల్యేలపై అసంతృప్తి అంశం వచ్చినపుడు 'వారి మాట ఎలా వున్నా బాబు నాయకత్వంపై విశ్వాసంతో ఓటర్లు టిడిపికే  ఓటేస్తారని ప్రజానీకం అనుకుంటున్నారు' అని రాస్తారు చూడండి. టిడిపితో పొత్తు పెట్టుకుని ఉండకపోతే కాంగ్రెసుకు యీ మీడియా సపోర్టు ఉండేది కాదు. కాంగ్రెసులో లుకలుకలు బాగా హైలైట్‌ అయివుండేవి. ఇది తెలుసు కాబట్టే కెసియార్‌ టిడిపిని తెలంగాణ నుంచి తరిమివేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారు.

టిడిపికి 6,7 సీట్లు యివ్వడం కష్టమేదీ కాదు. కానీ అలా చేస్తే బాబుకి మళ్లీ యిక్కడ స్థానం కల్పించడమే అవుతుంది. కాంగ్రెసు ప్రతిపక్షంగా ఎలాగూ తప్పదు, తెలంగాణ యిచ్చి నష్టపోయిన పార్టీగా దానికి తెలంగాణలో సింపతీ ఉంది. అది ఒక్కటీ చాలు, టిడిపి కూడా ఎందుకు? దాన్ని పూర్తిగా పెకలించి పడేయాలన్న కోరికతోనే ఆ పార్టీ నాయకులందరినీ కలుపుకుని, ఆ క్యాడర్‌ నంతా లాక్కున్నాడు. కాంగ్రెసు పార్టీ 2014లో 21 గెలిస్తే యిప్పుడు 14 మంది మిగిలారు. అంటే 66%. మరి టిడిపి? 15 గెలిస్తే యిద్దరు మిగిలారు. అంటే 13% మంది! ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా, రేపు అధికారపక్షంలో వస్తామనే ఆశ కాంగ్రెసు ఎమ్మెల్యేలలో ఉన్నట్లుగా టిడిపి వాళ్లలో లేకపోయిందన్నమాట.

బాబు తెలంగాణలో పార్టీని గాలికి వదిలేశారని వాళ్లు భావించడం వలననే యిది జరిగింది. అలా పార్టీకి మంగళగీతం పాడేశాక యిప్పుడు మళ్లీ చేజేతులా కెసియార్‌ టిడిపికి ఊపిరి పోస్తారా? అసంభవం. ప్రచారంలో కూడా 13 సీట్ల బాబును తిట్టినంతగా 94 సీట్ల కాంగ్రెసును తిట్టలేదు, ఎందుకంటే టిడిపికి ఆంధ్ర ముద్ర కొట్టడం యీజీ, కాంగ్రెసును కాదు. టిడిపి ప్రాంతీయపార్టీ కాగా, కాంగ్రెసు జాతీయ పార్టీ. ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీతో కలవడం సహజం కానీ మరో ప్రాంతీయ పార్టీతో కలవడం విడ్డూరం. కాంగ్రెసుతో కెసియార్‌కు వైరం కాబట్టి, బిజెపితో చేతులు కలిపాడు. కెసియార్‌ బిజెపికి బి-టీము అని కాంగ్రెసు, కాంగ్రెసుకు బి-టీము అని మోదీ అని మనను కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నారు కానీ కెసియార్‌కు బిజెపితో దోస్తీ ఉందనేది బహిరంగ రహస్యం. లేకపోతే ముందస్తు ఎన్నికలు సాధ్యపడేవి కావు.

బిజెపి తను పోటీ చేయని స్థానాల్లో తన ఓట్లను తెరాసకు బదిలీ చేసిందని తేలినా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే దానికి టిడిపి, కాంగ్రెసు రెండూ బద్ధశత్రువులే. బిజెపిని మచ్చిక చేసుకుంటున్న కెసియార్‌ దానితో ఉప్పు, నిప్పూగా ఉన్న టిడిపితో చేతులు కలపడం జరిగే పని కాదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా ఉంటూనే కేంద్ర స్థాయిలో బిజెపియేతర, కాంగ్రెసేతర కూటమి కడతానని కెసియార్‌ చెప్పే మాటలు నమ్మనక్కరలేదు. గతంలో ప్రయత్నించినప్పుడు అంబ పలకలేదు. ఎన్నికలు కాగానే బహిరంగంగా బిజెపితో పొత్తు పెట్టుకోవడం, పార్లమెంటు ఎన్నికలలో దానికి ఎక్కువ సీట్లు కేటాయించడం జరుగుతుందని సులభంగా ఊహించవచ్చు. కెసియార్‌ పాలన గురించి విశ్లేషిస్తూ చాలామంది 'తిరస్కరించాల్సినంత చెడ్డగానూ లేదు, మళ్లీ ఎన్నుకోవాల్సినంత గొప్పగానూ లేదు' అని అన్నారు. మంచి పరిశీలన.

మంచి ప్రత్యామ్నాయం కనబడి వుంటే హోరాహోరీ ఉండేదేమో, కానీ ప్రత్యామ్నాయం లేకపోయిందనే బాధ. ఈ రోజు అతి చురుగ్గా వ్యవహరిస్తున్న ప్రజా కూటమి పార్టీలు గత నాలుగేళ్లగా ఏమీ చేయలేదని గమనించాలి. కెసియార్‌ పాలనలో ఎన్నో అవకతవకలున్నాయి. అవన్నీ కమ్ముకోవడానికి కెసియార్‌ విపరీతంగా పబ్లిసిటీ యిచ్చుకున్నారు. యాడ్స్‌ ద్వారా మీడియాను కొనేశారు. విమర్శించినవాళ్లను అణచివేశారు, ఎండగట్టారు. దాంతో హైదరాబాదులో ఆస్తులున్న ప్రతీవారు భయపడ్డారు. తెలుగు ప్రముఖులందరికీ హైదరాబాదులో ఆస్తులున్నాయి. కాస్త నోరున్న రాజకీయ నాయకులందరినీ భ్రమపెట్టో, భయపెట్టో తన పార్టీలో కలిపేసుకుని నిర్వీర్యం చేసేశారు.

కాబినెట్‌లో ఎవరికీ నోరు లేదు. తను సెక్రటేరియట్‌కు రాడు. ఇష్టమైతే ఎపాయింట్‌మెంట్‌, లేకపోతే లేదు. రాచరికపు వ్యవస్థ కంటె అన్యాయంగా పాలన సాగింది. మిషన్‌ భగీరథలో అక్రమాలు జరిగాయి. అయితే దీన్ని యీ ప్రజాకూటమి పార్టీలు ఎంతవరకు ఎదిరించాయి అనేది ప్రశ్న. ఎన్నికల వేళలో వారి దగ్గర కూడా వందల కోట్లు పట్టుబడుతున్నాయి. పట్టుబడకుండా ఉన్నదెంతో ఊహించుకోవాల్సింతే. రాజగోపాల్‌ పదేపదే చెప్పిన మాట ఒకటుంది - ఈ ఎన్నికను ధనం విపరీతంగా ప్రభావం చేసిందని. దీనివలన గెలిచిన పార్టీ డబ్బుతో గెలిచిందనే నింద పడుతుంది. కాంగ్రెసు కూటమి గెలిస్తే వారిపై బిజెపి వారి ఐటీ దాడులు తథ్యమన్నమాట. ఇప్పుడింత డబ్బు బయటకు లాగిన కూటమి వారు యీ డబ్బుతో వాళ్లు ఒక పేపరు పెట్టో, ఒక టీవీ ఛానెల్‌ పెట్టో కెసియార్‌ పాలనలోని అవకతవకలను ప్రజలకు ఎందుకు వివరించలేదు? కేవలం ఒక మీడియా సమావేశం పెట్టి విమర్శించడమో, లేదా టీవీ ఛానెల్‌ వాళ్లు పిలిస్తే చర్చావేదికలో పాల్గొనడమో చేస్తే సరిపోతుందా?

ఇన్నాళ్లలో ఓ అరడజను మంది కాంగ్రెసు నాయకులు గట్టిగా మాట్లాడేరేమో, మిగతావాళ్లంతా ఏం చేశారో భగవంతుడికి తెలియాలి. ప్రజా ఉద్యమాలు చేశారా? సమావేశాలు పెట్టి జనాల్ని ఎడ్యుకేట్‌ చేశారా? పోనీ కెసియార్‌ను విమర్శించే పత్రికలకు, టీవీ ఛానెళ్లకు కాంగ్రెసు తన సమర్థకులైన పెట్టుబడిదారుల చేత, వ్యాపారస్తుల చేత యాడ్స్‌ యిప్పించి ఆదుకుందా? ఏమీ లేదు, అధికారంలోకి వస్తేనే చురుగ్గా వుంటాం, లేకపోతే మా పని మేం చూసుకుంటాం అన్నట్లు ప్రవర్తించింది. నిరంతరం తమలో ఉండేవాడినే ప్రజలు పట్టించుకుంటారు. ఇక టిడిపి అయితే పూర్తిగా బబ్బుంది. బాబు, లోకేశ్‌ యిటువైపు తొంగి చూడలేదు. పైగా అమరావతి ఆవిష్కరణకు కెసియార్‌ను పిలిచి, అతని పేరు శిలాఫలకాల్లో రాయించి, మన్నించి పంపారు. ఇక యిక్కడి టిడిపికి కేడర్‌కు ఎలాటి సంకేతం వెళుతుంది?

బాబు టి-యూనిట్‌ను యిన్నాళ్లూ పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చి తెగిపోయి ఎక్కడికో ఎగిరిపోయిన దారాన్ని వెతికి పట్టుకుని పికప్‌ చేయగలడా? ఇన్నాళ్లూ తెలంగాణలో టిడిపి యాక్టివిటీస్‌ ఏమున్నాయి? బాబు అనుకూల మీడియా కూడా బాబు అమరావతిలో అది చేశారు, యిది చేశారు అని అవే కబుర్లు చెపుతోంది తప్ప తెలంగాణలో టిడిపి కార్యకలాపాలను కవర్‌ చేసిందా? పాపం వాళ్లని అనడానికీ లేదు, వీళ్లు అసలేమైనా చేస్తే కదా! ఇప్పుడు ప్రచారంలో కూడా బాబుకి ఎంతసేపూ నేను హైదరాబాదుకి యింత చేశాను, అంత చేశాను అని చెప్పుకోవడంతోనే సరిపోతోంది. ఈ మధ్య సైబరాబాదు అనే సవరణ చేశారు. తన ఘనకార్యాల గురించి తండ్రి చెపితే వినడానికి కొడుక్కే విసుగు. గతం సరే, యిప్పుడేం చేస్తావు చెప్పు, టూ వీలర్‌ కొనిస్తావా? ఫోర్‌ వీలరా? అని అడుగుతాడు.

ఈ ఎన్నికల ప్రచారంలో కూడా బాబుది ఎప్పుడూ పాడే దంపుళ్లపాటే. తన పాలనకు ముందువి, తర్వాతివి కూడా కలుపుకుని చెప్పేసుకున్నాడాయన. 'ఇవన్నీ చూసే నిన్ను పదిహేనేళ్లుగా ప్రతిపక్షంలో పెట్టాం లేవయ్యా, ఇకనైనా నీ సొద ఆపి, నా గురించి చెప్పు' అని అడగబుద్ధవుతుంది తెలంగాణ ఓటరుకి. కెసియార్‌ ఎక్కడ తప్పు చేశాడు, మేం వస్తే ఏం చేస్తాం అని చెప్తే చాలు. కెసియార్‌ నాలుగేళ్లగా ప్రజాధనాన్ని దుబారా చేస్తూ వుంటే నువ్వేం చేశావ్‌? ఇద్దరు ఎమ్మెల్యేలే మిగిలినా, ఊరూరా క్యాడర్‌ ఉందన్నావు కదా, కొన్ని కులాలు నీకు వత్తాసుగా యిప్పటికీ వున్నాయంటున్నావు కదా, కెసియార్‌ చేతుల్లో మేం నానా అవస్థలూ పడుతూ ఉంటే మమ్మల్ని కాపాడడానికి బదులుగా ఎక్కడో దాక్కుని, యిప్పుడే దర్శనమిచ్చావేం? అని అడిగితే సమాధానమేది?

మీడియాను మేన్‌టేన్‌ చేయడం చాలా ఖర్చుతో కూడిన పని. అధికారపక్షం దగ్గర అవినీతి కారణంగా పోగుపడిన డబ్బుంది, మా దగ్గర లేదు అని యీ ప్రతిపక్షాలంటే 'పోనీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారా?' అని అడగబుద్ధవుతుంది. అదైతే ఖర్చు లేని వ్యవహారం కదా. కొంతమంది కమిటెడ్‌ క్యాడర్‌ ఉంటే చాలు, ప్రతీ తప్పునీ హైలైట్‌ చేసి చూపిస్తూ కనీసం కొన్ని వర్గాలలోనైనా చైతన్యం తీసుకురావచ్చు. అదీ చేయలేదు కదా. తెరాసకు వ్యతిరేకంగా ఏవైనా సోషల్‌ మీడియా యాక్టివిటీ ఉందంటే అది కొందరు వ్యక్తులు వ్యక్తిగతంగా చేసినది తప్ప పార్టీల పరంగా ఏమీ జరగలేదు. ఇప్పుడు వచ్చి ఒక్కసారిగా ప్రజాభిప్రాయం మార్చగలదా? కెసియార్‌ ఏమీ చేయలేదని నమ్మించగలదా? అంతేకాదు, ఎవరైనా లీడర్లను ప్రొజెక్టు చేయడమూ జరగలేదు.

కెసియార్‌ కానీ అతని కుటుంబం కానీ కరిజ్మా ఉన్నవారు. తెలంగాణ మొత్తంలో కెసియార్‌ పేరు వినబడినంతగా, కాంగ్రెసు తరఫున ఎవరి పేరైనా వినబడిందా? పోనీ గతంలో లాగ, బస్సు యాత్రలంటూ ఉధృతంగా చేసి, సమైక్యంగా ఉన్నామని చాటుకున్నారా? ఇప్పుడు పార్టీల పేరు చెప్పి ఓట్లు అడగడం తగ్గిపోయింది. కెప్టెన్ల పేరుతోనే ప్రచారం నడుస్తోంది. కేంద్రంలో మోదీ, తెలంగాణలో కెసియార్‌, ఆంధ్రలో బాబు.. యిలా. సంబంధిత మంత్రుల పేర్లు కూడా పైకి రానీయటం లేదు. ఇలాటి పరిస్థితుల్లో మా ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు యిప్పుడే ప్రకటించం అనడం సెల్లింగ్‌ పాయింటు కాదు. కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెసు యీ ఉపాయంతో నెగ్గి ఉండవచ్చు. కానీ పంజాబ్‌లో అమరీందర్‌ పేరు చెప్పి వుండకపోతే నెగ్గేది కాదన్నారు. తెలంగాణలో మాత్రం పేరు చెప్పి వుండాల్సింది ఎందుకంటే యిక్కడ ఆశావహులు కుప్పలుతిప్పలుగా ఉన్నారు. తెలంగాణ వస్తుందనగానే ప్రతీవాడూ రెడీ అయిపోయి, మొత్తానికి చెడగొట్టుకున్నారు.

మొన్నటికి మొన్న కర్ణాటకలో ఏం జరిగింది? సిద్ధరామయ్య యిప్పటికీ అగ్గి రాజేస్తూనే ఉన్నాడు. ఇక్కడా అదే కథ జరుగుతుందా? నిజంగా కాంగ్రెసుకు తెరాసతో సమానంగా సీట్లు వస్తే ఏమవుతుంది? గోవాలో ఏం జరిగింది? బిజెపి కంటె ఎక్కువ ఓట్లు వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి అనే అంశంపై కొట్టుకుంటూ కూర్చుంటే బిజెపి తక్కినవాళ్లను ఆకర్షించి, ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు తెరాస కూడా స్వతంత్రులను లాక్కుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మజ్లిస్‌ ఎలాగూ ఉంది, కారుకి యింజను నేనే అంటూ! బిజెపి అంశాలవారీగా మద్దతు అనవచ్చు. కాంగ్రెసు నోటి దగ్గర కూడు పోగొట్టుకోవడం ఖాయం. తమ హిస్టరీ యిలా వుంది కాబట్టి కాంగ్రెసు నిర్ద్వంద్వంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి ఉండాల్సింది. లేకపోతే దానికి వేసే ఓటు వేస్టనిపిస్తుంది.

టిడిపితో జతగూడి కాంగ్రెసు నష్టపోయిందో లేదో ఫలితాలు తేలుస్తాయి. నా మట్టుకు నాకు నష్టపోతుందనే అభిప్రాయం. కాంగ్రెసు, టిడిపి ఎన్నడూ సఖ్యంగా లేవు. కానీ తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెసు బాబుకి చాలా గౌరవమే యిచ్చింది. రాహుల్‌ పక్కన బాబు ఫోటోయే వేశారు. రేపు ఆంధ్రలో పొత్తు పెట్టుకున్నపుడు బాబు యిదే తరహా సమాన గౌరవం యిస్తారా అనేది చూడాలి. ఇప్పుడు కాంగ్రెసు టిడిపికి గౌరవం యివ్వడానికి కారణం డబ్బు కోసమే అని తెరాస ప్రచారం చేస్తోంది. దానికి తగ్గట్టు ప్రజాకూటమి అభ్యర్థుల దగ్గర కూడా వందల కోట్లు డబ్బు దొరుకుతోంది. ఈ డబ్బంతా టిడిపిదే అని సులభంగా అనేయవచ్చు. ఎందుకంటే కాంగ్రెసు పార్టీ దేశంలో చాలా తక్కువ చోట్ల అధికారంలో ఉంది.

పాలిస్తున్న రాష్ట్రాల నుంచి డబ్బు తరలించారనుకున్నా, అది బిజెపితో ముఖాముఖీ తలపడుతున్న, అవకాశాలు ఎక్కువ ఉన్న రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాలకు వెళుతుంది తప్ప, తెలంగాణకు పెద్దగా రాదని అందరికీ తెలుసు. మరి ఈ డబ్బు ఆంధ్రదే కావాలి. ఈ అనుమానాన్ని తెరాస మరింత పెద్దది చేసి బాబు డబ్బుతో బాబు తెలంగాణను ఆక్రమిస్తున్నాడన్న ప్రచారం చేస్తున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమసమయంలో కూడా ఆంధ్రా వాళ్లను కూడా అదే అన్నారు. ఇక్కడ వ్యాపారాలు చేసి, స్థలాలు కొనేసి, పలుకుబడి పెంచేసుకుని, మొత్తమంతా తమ గుప్పిట్లో పెట్టేసుకున్నారని. ఆంధ్ర ఎంపీలు దిల్లీలో డబ్బుతో కేంద్ర నాయకుల్ని కొనేసి, ప్రత్యేకరాష్ట్రం రాకుండా చేస్తున్నారన్నారు. చివరకు చూస్తే ఆంధ్రులకు సమైక్యమూ దక్కలేదు, హైదరాబాదులో వాటానూ దక్కలేదు. చివరకు ప్రత్యేక హోదా కూడా దక్కలేదు.

కానీ డబ్బు సంచులతో తెలంగాణను కొనేసి దాని సహజవనరులను దోపిడీ చేసేవారిగా ముద్ర మాత్రం పడిపోయింది. ఇప్పుడు ఆ ఆంధ్ర ముద్రంతా టిడిపి మీదకు బదలాయించారు. టిడిపిని తరిమివేసినా మళ్లీ కాంగ్రెసు చంకలో దూరి వచ్చేస్తోంది, పారా హుషార్‌ అని భయపెడుతున్నారు. జూపూడి ప్రభాకరరావు వంటి విద్యాధికుడు కూడా డబ్బు సంచులతో పట్టుబడ్డారు. పట్టించినవారు తెరాస కార్యకర్తలు. అంటే తెరాస వారు టిడిపి వారిపై బాగా నిఘా పెట్టారని అర్థమౌతోంది. రాజగోపాల్‌ సర్వే ప్రకారం 7 సీట్లు మాత్రం గెలిచే టిడిపి యింత ఎందుకు ఖర్చు పెట్టాలి? కెసియార్‌ను యిక్కడ నిలవరించకపోతే ఆంధ్రలో జగన్‌, పవన్‌లకు కెసియార్‌ నిధుల సాయం చేస్తారనే భయం బాబుకి ఉందని రాధాకృష్ణ రాశారు. అంటే యిప్పుడు పెట్టుబడి పెట్టి కాంగ్రెసును గెలిపిస్తే, రేపు ఆంధ్ర ఎన్నికలలో  టిడిపికి (అవసరమైతే) కాంగ్రెసు తెలంగాణలో గడించిన డబ్బు పంపిస్తుందన్నమాట.

ఆంధ్రమూలాల వారందరూ టిడిపికి, దాని కారణంగా కాంగ్రెసుకి ఓటేసేస్తారని మీడియా ప్రచారం సాగుతోంది. గత వ్యాసంలోనే దీనిలోని అసంబద్ధత గురించి రాశాను. తమను గాలికి వదిలేసిన టిడిపిని ఎందుకాదరించాలి వారు? పైగా కాంగ్రెసు వారికి ఏమైనా ఒరగబెట్టిందా? తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఆంధ్రులను తక్కువ తిట్లు తిట్టారా? కెసియార్‌ ఓ పాలు ఎక్కువగా తిట్టాడనుకున్నా, వీళ్లు అతన్ని ఆపారా? నిజానికి అతను వర్ణనాత్మకంగా తిడితే వీళ్లు పచ్చిగా తిట్టారు. అసలు తెలంగాణ వచ్చినది ఎవరి కారణంగా? స్వార్థపరులైన తెలంగాణ కాంగ్రెసు నాయకుల కారణంగా కాదా? సందేహాలుంటే జయపాల్‌ రెడ్డిగారిని అడగండి. రాష్ట్రం కలిసి వున్నంతకాలం తమకు అవకాశాలు పెద్దగా వుండవన్న భయంతో, విడగొట్టి మంత్రులై పోదామనే ఆశతో చేసినదంతా కాంగ్రెసు వారే.

రాష్ట్రం యిస్తే కెసియార్‌ మనలో కలిసిపోతాడని సోనియాను, రాహుల్‌ను తప్పుదోవ పట్టించి, పార్టీని నాశనం చేసింది వారే. పార్లమెంటులో బీభత్సం సృష్టించి బిల్‌ పాస్‌ చేయించినది వారే. ఇలాటివారిని ఆంధ్రమూలాల వారే కాదు, ఏ సమైక్యవాదీ ఆదరించలేడు. ప్రజాకూటమిలో యింకో పార్టీ టిజెఎస్‌. ఏకంగా 8 సీట్లిచ్చారు. ఉద్యమ సమయంలోనే కోదండరాంను పసుపు విఘ్నేశ్వరుడని నేను వర్ణించాను. మెయిన్‌ పూజ ప్రారంభించేసరికి, పక్కన పడేస్తారని అన్నాను. అదే జరిగింది. ఆయన పెద్ద వక్తా కాదు, నాయకుడూ కాదు, రాజకీయం తెలిసినవాడూ కాదు. 'కావమ్మ మొగుడంటే కాబోలుననుకున్నాను' అన్నట్లు, ఉద్యమం ఊపులో ఆయనో పెద్ద ఫిగర్‌ అయిపోయాడు.

తెలంగాణ వచ్చాక గాలి తీసేసిన బెలూన్‌ అయిపోయాడు. ఆయన తన పార్టీ ఓట్లను బదలాయించగలడా? వేరే పార్టీ ఓట్లను తమకు వేయించగలడా? వీళ్లనంతా పేపర్‌ టైగర్స్‌ అంటారు. పేపర్లలోనే కనబడతారు. ప్రజలను ప్రభావితం చేయలేరు. ఫలితాల తర్వాత ఎక్కడ తేలతాడో తేలిపోతుంది. కూటమిలో మిగిలిన పార్టీ సిపిఐ. అలిగి, అల్లరి పడినా దక్కినది మూడు సీట్లే. ఒకప్పుడు తెలంగాణలో కమ్యూనిస్టులు బలమైన శక్తిగా వుండేవారు. ఇప్పుడు కమ్యూనిస్టు నాయకులు రెగ్యులర్‌ పార్టీలకు ఫిరాయించేస్తున్నారు. ఈ ఎన్నికలలో సిపిఎంకి ఒక్కటి దక్కవచ్చట. సిపిఐ స్థానం కూడా తెలుస్తుంది.

మొత్తంమీద చూస్తే కూటమిలో ముఖ్యమైన పార్టీ కాంగ్రెస్సే. అది గెలిచిందంటే దానికి కారణం స్థానిక నాయకుల బలమో, తెరాస స్థానిక నాయకుల బలహీనతో కావాలి తప్ప రాహుల్‌ నాయకత్వమో, బాబు చేయూతో అనుకోవడానికి వీల్లేదని నా భావం. ఫలితాల విశ్లేషణ తర్వాత స్పష్టమైన చిత్రం కనబడవచ్చు. కూటమికి 50 సీట్లు వచ్చినా అదంతా బాబు వ్యూహచతురతే అని డప్పు కొట్టడానికి మన మీడియా ఎలాగూ రెడీగా ఉంటుంది. అయితే 13 సీట్లలో టిడిపి ఎన్ని గెలిచిందో చూస్తే ఆ పరిశీలనను ఎంతవరకు నమ్మవచ్చో మనకూ తెలుస్తుంది.

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2018)
mbsprasad@gmail.com

Show comments