చంద్రబాబూ.. ఈ లాజిక్కులకు సమాధానాలేవీ!

ఈవీఎంల విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వ్యక్తంచేస్తూ ఉన్న అనుమానాలు బాగానే ఉన్నాయి. అయితే ఎటొచ్చీ ఆయన అనుమానాలను విన్నాకా జనాలకు కలుగుతున్న సందేహాలకే సమాధానాలు లభించడం లేదు. ఇప్పుడు జాతీయస్థాయి ఉద్యమం అంటున్న బాబు.. ముందుగా కొన్ని లాజికల్ ప్రశ్నలకు సమాధానం ఇస్తే బావుంటుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

-ఈవీఎంల ఎన్నికల ఫలితాలను నమ్మడానికి లేదని అంటున్న మీరు.. గత ఎన్నికల్లో గెలిచింది ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల ద్వారా కాదా?

-నంద్యాల ఉపఎన్నిక జరిగింది కూడా ఈవీఎంల మీదే కదా? అప్పుడు మీకు మంచి మెజారిటీ రాలేదా?

-నంద్యాల ఉపఎన్నిక సమయంలో.. మీరు, బీజేపీ స్నేహితులుగానే ఉన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారానే అప్పుడు గెలిచారా?

-బీజేపీ వాళ్లు ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారని అని వాదిస్తున్న మీరు, అప్పుడు ఆ కుట్రలో భాగస్వామ్యులేనా? ఆ విషయం గురించి సూటిగా మాట్లాడటంలేదు ఎందుకు?

-ఈవీఎంల గురించి మీరు బీజేపీతో కలిసి ఉన్నంత సేపూ ఎందుకు మాట్లాడలేదు? యూపీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఈవీఎంల మీద కాంగ్రెస్ తదితర పార్టీలు అనుమానాలు వ్యక్తం చేశారు కదా? అప్పుడు మీరు ఎందుకు నోరు విప్పలేదు?

-ఇక వీవీ ప్యాట్ ల విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పును ఇచ్చింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనూ ఐదు వీవీ ప్యాట్లను లెక్కించాలని కోర్టు తీర్పును ఇచ్చింది. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక మెతుకు చాలదా?

-ఒకవైపు టెక్నాలజీకి మీరే పితామహుడు అని చెప్పుకొంటూ.. మగ్గిపోయిన నేతలా మాట్లాడటం ఏమిటి?

-ఈ ఎన్నికలు ఎన్నికలే కాదు.. అని అంటున్న మీరు మరోవైపు నూటా ముప్పై సీట్లను నెగ్గుతున్నట్టుగా ఎలా ప్రకటించుకుంటున్నారు?

-ఎలాగూ మీరు గెలిచే మాత్రానికే అయితే.. ఇలా ఈవీఎంల మీద, ఈసీ మీద ఎందుకు బురద జల్లుతున్నారు?

-మీరు గెలిచేట్టు అయితే.. గెలిచాకా ఈ విషయంలో పోరాడొచ్చు కదా. ఇప్పుడే ఎందుకు హడావుడి చేస్తూ ఉన్నారు?

-ముప్పైశాతం ఈవీఎంలు పని చేయలేదంటూ మీరే వాదన మొదలుపెట్టి, ఆ తర్వాత ప్రజలు అలా అనుకుంటున్నారని ఎందుకు ప్లేటు ఫిరాయించారు?

-ఆల్రెడీ ఈవీఎంల మీద చాలా చర్చ జరిగింది, సుప్రీంకోర్టు స్థాయిలో విచారణలూ జరిగాయి. అయినా మీరు మళ్లీ తొండి వాదనలతో ఎందుకు ప్రజలను గందరగోళానికి గురిచేయాలని అనుకుంటున్నారు?

-ఎలాగూ ఓటమి తప్పదనే చంద్రబాబు నాయుడు ఈ యాగీ అంతా చేస్తున్నారని జనాలు అనుకుంటున్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి?

ప్రెస్ మీట్ అంటూ పెట్టి పబ్లిక్ మీటింగులో ప్రసంగించినట్టుగా గంటల తరబడి మాట్లాడే బాబు.. ఈ ప్రశ్నలకు సూటిగా సుత్తిలేకుండా సమాధానాలు చెప్పి, ఈ ప్రశ్నలు అడిగిన జర్నలిస్టుల మీద అసహనాన్ని, అక్కసును వెల్లగక్కకుండా సమాధానాలు ఇవ్వగలరా?

జనసేనకు పడ్డ ఓట్లలో 80 టీడీపీ, 20 వైసీపీ ఓట్లని అంచనా!

Show comments