143 ఓట్ల తోపుకు.. టీడీపీ ఎమ్మెల్యే టికెట్!

అటు తిరిగి ఇటు తిరిగి తెలుగుదేశం పార్టీలో తేలుతున్నాడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి. ఆరేడేళ్ల కిందట ప్రత్యేక రాయలసీమ అంటూ హడావుడి చేశాడీయన. ఆ నినాదం చేస్తే ఏదో ఒక పార్టీ తనను తీసుకోకపోదా అనుకున్నాడు. అదే నినాదంతో నంద్యాల బైపోల్ లో రంగంలోకి తన పార్టీని దించారు ఈ పెద్దమనిషి. ఆ ఎన్నికల్లో రాయలసీమ గడ్డ మీద ఈయనకు జరిగిన అవమానం అంతాఇంతా కాదు.

భారీఎత్తున ప్రచారం చేస్తే వచ్చిన ఓట్లు నూటా నలభై మూడు. అలా బైరెడ్డి ప్రత్యేక రాయలసీమ ఉద్యమానికి ఆ రేంజ్లో మద్దతు లభించింది. ఇక చేసేది లేక పార్టీని కట్టి పెట్టి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ ను ఏపీలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. మొత్తానికి తన స్థాయికి తగ్గ పార్టీని ఎంచుకున్నారనిపించారు.

కట్ చేస్తే.. అక్కడ కూడా బైరెడ్డి ఉండలేకపోయారు. ఎన్నికల వేళ రాజీనామా అనేశారు. రఘువీరారెడ్డి మీద దుమ్మెత్తిపోసి బయటకు వచ్చారు. ఇక రాజకీయ విశ్రాంతే అనుకుంటే.. మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి అని వార్తలు వస్తున్నాయి. ఇంతకు మించిన కామెడీ ఏమిటంటే.. ఈ వీరుడికి శ్రీశైలం ఎమ్మెల్యే టికెట్ ఖరారు అయ్యిందనేది!

బుడ్డా రాజశేఖర రెడ్డి తప్పుకోవడంతో.. తెలుగుదేశం పార్టీకి అక్కడ బైర్లు కమ్ముతున్నాయి. మొన్నటివరకూ టికెట్టో.. టికెట్టో అంటూ గొడవచేసిన ఏవీ సుబ్బారెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డిలు కూడా ఇప్పుడు శ్రీశైలం నుంచి పోటీకి ముందుకు రావడం లేదట. దీంతో చేసేదిలేక బైరెడ్డి రాజశేఖరెడ్డిని చేర్చుకుని శ్రీశైలం టికెట్ ఇస్తున్నారట చంద్రబాబు.

రాయలసీమ నాలుగు జిల్లాల్లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవడానికి.. శ్రీశైలం ఒక్క ఉదాహరణ చాలని, నేతలు చాలామంది మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు, చంద్రబాబుతో సహా.. పోలింగ్ సమయానికి చాలామంది రియలైజ్ కాబోతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నూటా నలభై మూడు ఓట్ల వీరుడికి ఇప్పుడు టీడీపీ టికెట్ ఖరారు చేస్తే.. అదీ ఈ ఎన్నికల్లో బిగ్గెస్ట్ జోక్ కాబోతోంది.

చంద్రబాబు నిర్ణయాల పలితం-శక్తిమంతంగా KCR 

యాత్ర సినిమా సగటు విజయం ఏం చెప్తోంది?