బన్నీ సినిమాకు స్ఫూర్తి ఇదేనా?

హీరో బన్నీ విపరీతంగా ఫ్రభావితం అయిపోయాడు. దర్శకుడు వేణు శ్రీరామ్ చెప్పిన లైన్, వివరించిన బౌండ్ స్క్రిప్ట్ విని, ఇవ్వాళే మొదలెట్టేద్దాం అన్నంతగా కదిలిపోయాడు. ఇదీ టాలీవుడ్ లో నిర్మాత దిల్ రాజు ప్రాజెక్టు గురించి వినిపిస్తున్న వార్తలు. ఐకాన్ అనే టైటిల్ కూడా ముందుగానే ప్రకటించేసారు. త్రివిక్రమ్ సినిమా ఇలా గుమ్మడికాయ కొట్టడం తరువాయి, ఈ సినిమా మొదలుపెట్టేస్తారు.

అసలు ఈ సినిమా స్క్రిప్ట్ ఏంటీ? ఇంతలా ఆకట్టుకోవడం ఏంటీ? ఆరాతీస్తే, నిజమో, గ్యాసిప్ నో కానీ, ఓ విషయం తెలిసింది. మనవాళ్లు వట్టి వెధవాయిలోయ్ అని గురజాడవారు గిరీశం ముఖంగా అనిపించారు ఆనాడు. ఇప్పుడు అయితే మనవాళ్లు కాపీ మాస్టర్ లోయ్ అని అంటారేమో? ఎందుకంటే రాజమౌళి దగ్గర నుంచి త్రివిక్రమ్ మీదుగా కిందన వున్న డైరక్టర్ వరకు ఏదో ఒక పరభాషా సినిమా నుంచి పాయింట్ ఎత్తుకురావడమో, ఇన్ స్పయిర్ కావడమో, కాదంటే రైట్స్ కొనడమో తప్పదు. 

బన్నీ-వేణు శ్రీరామ్ సినిమాకు కథ (రైట్స్ కొన్నారేమో తెలియదు) 2017లో విడుదలయిన 'కిట కిట' (KITA KITA) అనే ఫిలిప్పైన్స్ సినిమా ఆధారం అని తెలుస్తోంది. ప్రపంచభాషలకు మూలం సంస్కృతం అంటారు. ఈ కిటకిట అంటే 'ఐ విల్ సీ యూ' అనే ఇంగ్లీష్ అర్థం వున్న, మనదగ్గర ఓ పొడపు కథ వుంది. కిటకిట తలుపులు.. కిటారు తలుపులు అంటూ. కళ్లకు సంబంధించిన పొడుపు కథ. ఈ 'కిట..కిట' సినిమా కథ కూడా కళ్ల గురించే.

ఓ అంధురాలు, తను ఇష్టపడే అబ్బాయి కోసం సాగించే అన్వేషణ. టూరిస్ట్ గైడ్ గా పని చేసే యువతి తాత్కాలికంగా అంధురాలు కావడం, ఆమె టూరిస్ట్ ప్రదేశాలు అన్నీ తిరుగుతూ అతని కోసం అన్వేషించడం అన్నది లైన్. దీనికి ఇంకా చాలా పాడింగ్ వుంది. కానీ మరి మనవాళ్లు ఆ లైన్ తీసుకుని ఏం చేస్తున్నారో అన్నది తెలియాల్సి వుంది. ఇదే కథ అయితే మాత్రం, రైట్స్ తీసుకునే వుంటారు.

ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియా బాగా పెరిగాక లేనిపోని తలకాయనొప్పులు వస్తున్నాయి కనుక. మరి కొన్నిరోజులు ఆగితే, మరిన్ని డిటైల్స్ బయటకు వస్తాయేమో?

భారీస్థాయిలో పోలింగ్ అధికార పార్టీలను గద్దెదించింది

Show comments