పరిపాలన రాజధాని విశాఖ.. అసెంబ్లీలో అధికారిక ప్రకటన

ఇకపై ఇది అధికారికం.. విశాఖపట్నంను జగన్ సర్కార్ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అధికార-అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. 

బిల్లును 3 చాప్టర్లుగా విభజించిన బుగ్గన.. మొదటి చాప్టర్ లో జోన్స్ గురించి వివరించారు. బిల్లు ప్రకారం, ఇకపై అభివృద్ధి జోన్స్ వారీగా జరుగుతుందని, 3-4 జిల్లాలను కలిపి ఓ జోన్ గా ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఇలా చేయడం వల్ల అభివృద్ధి అత్యంత వేగంగా జరగడంతో పాటు వికేంద్రీకరణకు మార్గం సుగమం అవుతుందన్నారు.

ఇక బిల్లులో అత్యంత కీలకమైన చాప్టర్-2ను కూడా చదివి వినిపించారు బుగ్గన. సమ్మిళిత అభివృద్ధి కోసం పరిపాలన కేంద్రాల్ని ఏర్పాటుచేసేలా బిల్లులో ప్రతిపాదనలు చేర్చారు. దీని ప్రకారం.. ఇక మీదట లెజిస్లేటివ్ ఫంక్షన్స్ (శాసనపరమైన వ్యవహారాలు) మొత్తం అమరావతిలోనే జరుగుతాయి. అంటే.. లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతి ఉంటుంది. 

ఇక పరిపాలనకు సంబంధించిన రాజధానిగా విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ ను ఏర్పాటుచేయాలని బిల్లులో పెట్టారు. ఎగ్జిక్యూటివ్ వ్యవహారాలన్నీ విశాఖ నుంచే జరుగుతాయి. అంటే.. సెక్రటేరియట్ తో పాటు ఇతర శాఖల ఆఫీసులు విశాఖలో ఏర్పాటుచేస్తారు. రాజ్ భవన్ కూడా విశాఖలో ఏర్పాటవుతుంది. 

ఇక మూడోది జ్యూడీషియరీ విధులు-బాధ్యతలు. కర్నూలు అర్బన్ డెలవర్ మెంట్ ఏరియా ద్వారా జ్యూడీషియరీ బాధ్యతల్ని నిర్వర్తిస్తారు. దీని ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. అంటే కర్నూలు జ్యూడీషియల్ కేపిటల్ గా ఉంటుంది.

Show comments