తమ్ముడు, కుమార్తె.. బంధాలు బలపడుతున్నాయి!

‘రాజకీయాల్లో శాశ్వత బంధాలు ఉండవు’ ఇది చాలా పాచిపోయిన నానుడి. కానీ రాజకీయ బంధాలను కుటుంబ బంధాల తరహాలో.. ఆత్మీయంగా స్వీకరించే నాయకులు కొద్దిమందే ఉంటారు. అలాంటి వారిలో కేసీఆర్ కూడా ఒకరు. మామూలు పరిస్థితుల్లో అయితే.. ముఖ్యమంత్రి అయిన తర్వాత.. తన స్కూలు టీచరుకు వేదిక మీద సన్మానం చేసి పాదాభివందనం చేసేవారు, చిన్నతనం నుంచి నచ్చిన సినీదర్శకుడి ఇంటికి వెళ్లి.. ఆయనను సత్కరించి రావడం ఇలాంటి విషయాలు మరొకరినుంచి ఆశించలేం. ఇవన్నీ కేసీఆర్ కే సాధ్యం. అందుకే ఆయన ఇవాళ జగన్ ను తమ్ముడిగా, రోజాను కుమార్తెగా అభివర్ణించగలిగారు.

రాష్ట్రం విడిపోయిన సమయంలో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య కూడా చాలా చాలా భావోద్వేగాలు ఉన్నాయి. హైదరాబాదులో ఆస్తులు, వ్యాపారాలు కలిగి ఉన్నవారి సంగతి వేరు. వారికి ఖచ్చితంగా రాష్ట్ర విభజన బాధగా ఉంటుంది. హైదరాబాదుతో జీవితంలో ఎలాంటి అవసరమూ పడనివారికి విభజన గురించిన చింత తక్కువగా ఉంటుంది. సామాన్య ప్రజలకు సంబంధించినంత వరకు- విభజన సమయంలో ఉన్న భావోద్వేగాలు- తర్వాత క్రమంగా తగ్గిపోయాయి.

కానీ గత అయిదేళ్లలో తనకు అవసరం వచ్చినప్పుడెల్లా కేసీఆర్ తో మంతనాలకోసం వెళుతూ... కేసీఆర్ తన ప్రతిపాదనలకు తలఒగ్గని పక్షంలో ఆయనను విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ చంద్రబాబునాయుడు.. ఏపీ ప్రజల మనసుల్లో  తెలంగాణ అంటే విషబీజాలు నాటే ప్రయత్నం చేశారు. కానీ జగన్మోహన రెడ్డి రాగానే పరిస్థితి మొత్తం సాంతం మారిపోయింది. రెండు స్నేహ రాష్ట్రాలు అయ్యాయి.

తాజాగా నగరిలో ఎమ్మెల్యే రోజా ఇంటికి వచ్చిన కేసీఆర్.. జగన్‌కు ఒక పెద్దన్నలాగా ఉంటూ ఏపీ అభివృద్ధిలో కూడా భాగం పంచుకుంటానని అన్నారు. రోజా తన కూతురులాంటిదని కూడా చెప్పారు. ఆ రకంగా పొరుగు రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న వారిని తమ్ముడిగా, కూతురిగా వ్యవహరించేలా.. ఇప్పుడు బంధాలు ముడిపడుతున్నాయి. ఇక కేసీఆర్ తన మాటల్లో చెప్పినట్లుగా రాయలసీమ అభివృద్ధికి కూడా ఆయన చిత్తశుద్ధితో తోడ్పాటు అందిస్తే ఇక అంతకంటె కావాల్సింది ఏముంటుంది?

ప్రాంతీయ భాషల సినిమాలు అదుర్స్!